నిజానికి సినిమా అంతా చూశాక… బతుకుజీవుడా అని థియేటర్ నుంచి పారిపోయి వస్తుంటే… ఒకటి ఎందుకో కాస్త డిఫరెంటుగా స్ట్రయికయింది… అందరూ గోల్డెన్ లెగ్ అని కీర్తించి, ఆ పాదాల మీద, ఐమీన్ తొడల దాకా ప్రత్యేక గీతాలు రాసి, నేల మీద పొర్లుతూ పొర్లుదండాలు పెట్టారు కదా… ఆల్ ఆఫ్ సడెన్ ఫాఫం, ఇలా అయిపోయింది ఏమిటీ అని… అవును, పూజా హెగ్డే గురించే…
నటనలో ఆమె పూర్… గట్టిగా అడిగితే ఆమే ఒప్పుకుంటుంది ఆ విషయం… హైట్, కలర్ వరకూ వోకే… అంతే తప్ప మొహంలో ఎమోషన్స్ ఏమీ పలకవు… ప్యూర్ వారసహీరో తాలూకు లక్షణం… కొన్ని సినిమాలు హిట్, ఆమె ప్రమేయం ఏమీలేదు, కానీ ఆమెకూ కలిసొచ్చింది, మస్తు డిమాండ్ ఏర్పడింది… నిర్మాత, దర్శకులకు ‘‘కావల్సిన హీరోయిన్’’ అయిపోయింది…
అక్కడిదాకా ఎందుకు..? రాధేశ్యామ్ సినిమాలో ఆమె పాత్ర, ఆమె నటన మీద వచ్చినన్ని మీమ్స్ ఇంకెవరి మీదా వచ్చి ఉండవు… సినిమా సూపర్ ఫ్లాప్… గోల్డెన్ లెగ్ కాస్తా ఐరన్ లెగ్ అయిపోయినట్టుగా ఇప్పుడు బీస్ట్… ఏముంది..? ఏమీలేదు ఇందులో… ఓ రెండు పాటలు… రెండున్నర సీన్లు… జస్ట్, సినిమాలో ఉంది… ఆమెకు ఇంకేమీ అక్కర్లేదు కూడా… గాలి ఉన్నప్పుడే తూర్పారబట్టుకోవాలి… మిగతాది ప్రేక్షకుల ఖర్మ…
Ads
సరే, ఆమె ఖర్మానికి ఆమెను వదిలేయండి… మరో దరిద్రం గురించీ చెప్పాలి… బీస్ట్ ఓ డబ్బింగ్ సినిమా… విజయ్, పూజా తప్ప ఇంకెవరూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు… పరమ అరవ వాసన… గుప్పుమంటుంది… కానీ చెన్నైలో 195 టికెట్ ధర అయితే హైదరాబాదులో 295… టీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణి పట్ల జనం పకపకా వెక్కిరిస్తూ నవ్వే పరిస్థితి…
నిజానికి ఒక సూర్య, ఒక రజినీ, ఒక కమల్ తదితరులతో పోలిస్తే విజయ్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు ఇంకా… పైగా ఇది పాన్ ఇండియా సినిమా ఏమీ కాదు, కేవలం విజయ్ రెమ్యునరేషన్ వల్ల భారీ సినిమా అయ్యింది… తెలంగాణ ప్రభుత్వానికి పెద్దగా ఏ సోయీ ఉండదు కదా… టికెట్ల ధరలు మంటెక్కాయి… సినిమాలో కూడా విజయ్ తప్ప ఇంకేమీ లేదు…
ఎన్ని సినిమాల్లో చూడలేదు… ఎవరో ఓ గూఢచారి, ఆర్గనైజేషన్ వదిలేసి దూరంగా ఉంటాడు… ఏదో ఓ సంఘటనతో తిరిగి దేశం కోసం, ధర్మం కోసం బరిలోకి దిగాల్సి ఉంటుంది… ఛ, చివరకు మొన్న వచ్చిన జేమ్స్‌బాండ్ సినిమా కూడా అంతే కదా… ఇందులోనూ అంతే… భారత గూఢచారి సంస్థ (రా)… అసలు సినిమా దర్శకులెవడికీ రా గూఢచారుల పనివిధానం ఏమీ తెలియదు అని బీస్ట్ చూస్తే అర్థమవుతుంది… రా గూఢచారి అంటే జేమ్స్‌బాండ్ 007 అనుకుంటున్నట్టున్నారు…
ఓ గరల్ ఫ్రెండ్… ఓ మాల్ వెళ్తుంది… అక్కడికే హీరో వెళ్తాడు… ఈలోపు టెర్రరిస్టులు అక్కడున్న 150 మందిని నిర్బంధిస్తారు… డిమాండ్లు పెడతారు… ఎవడో ఓ కోన్‌కిస్కా గాడిని వదిలేయాలని… వాళ్లను దేశం కోసం, ధర్మం కోసం కష్టపడి, ఫైటోడ్చి హీరో విడిపించాలి… అంతే కథ… దాన్ని కూడా కామెడీ చేశాడు దర్శకుడు… పోనీ, అదయినా చేతనైందా అంటే అదీ లేదు…
మరేముంది సినిమాలో..? అర్థం కాని ఓ అరబిక్ కుత్తు పాట ఉంది… పిచ్చి కామెడీ ఉంది… విజయ్ యాక్షన్ ఉంది… స్టయిలిష్ హీరోయిక్ ఫైట్లు ఉన్నాయి… అవి చాలవా అంటారా..? అంతే… అవి చాలు అనుకుంటే సినిమా సూపర్… ఎహె, అదొక్కటే సరిపోతుందా అంటారా..? అవును, ఈ సినిమా చూస్తే చివరకు మిగిలే అసంతృప్తి అదే… విజయ్ మాత్రమే ఉన్నాడు సినిమాలో… ఇంకేమీ లేదు…!!
Share this Article