అంతకుముందు తెలుగు ప్రేక్షకులకు తెలియని కేరక్టర్… పునీత్ రాజకుమార్… కానీ మరణం తరువాత పునీత్ మీద కన్నడిగుల అభిమానం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని ఆశ్చర్యపోవడం మన వంతయింది… అసలు కన్నడ ఇండస్ట్రీ ఎప్పుడూ మిగతా సినిమా ప్రపంచానికి దూరదూరంగానే ఉంటూ వచ్చింది… ఇప్పుడిప్పుడే ప్రధాన స్రవంతిలోకి వచ్చేస్తోంది… ప్రత్యేకించి కేజీఎఫ్ కొత్త కన్నడ సినిమాను పరిచయం చేస్తోంది… కొత్త చరిత్రను రాస్తోంది…
దానికి కారకుడు యశ్ కాదు… ప్రశాంత్ నీల్…! హసన్‌లో పుట్టి, సినిమాయే ప్యాషన్‌గా బతికిన ఈ నలభయ్యేళ్ల డైరెక్టర్ ఫిల్మోగ్రఫీలో ఎన్ని సినిమాలు ఉన్నాయో ఊహించగలరా..? కేజీఎఫ్‌కన్నా ముందు కేవలం ఒకటి… నిజం… ఒకటే… ఉగ్రం అనే సినిమా… అదీ హిట్టే… టెక్నికల్ టీంలో ప్రధానంగా సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, సంగీతం రవి బస్రూర్… వాళ్లను విడిచిపెట్టలేదు… ఫుల్ స్వేచ్ఛ… చూశారుగా… కేజీఎఫ్-2లో కొన్ని సీన్లు అబ్బురపడేట్టు ఉంటయ్… ఇక సంగీతం సరేసరి… రవి ఓ థమన్‌కు తాత…
Ads
ఉగ్రం తరువాత కేజీఎఫ్… ఇప్పుడు కేజీఎఫ్ సీక్వెల్‌గా సెకండ్ చాప్టర్… అంతే… తన సినిమాల సంఖ్య కేవలం మూడు మాత్రమే… అయితేనేం… ఈరోజు ఇండియన్ సినిమా తన వైపు చూస్తోంది… రాజమౌళికి తాత అంటున్నారు… నిజానికి కేజీఎఫ్-2లో చికాకు కలిగించే, లాజిక్‌లెస్ సీన్లు కొన్ని ఉన్నయ్… కానీ తన సీన్ల చిత్రీకరణ మాయతో అన్నీ మరిపించేశాడు… అయితే ఇప్పుడు సమస్య ఒకటుంది… అదే ఇప్పుడు చెప్పుకునేది…
ఇదే ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సాలార్ తీస్తున్నాడు… ఇద్దరికీ పరీక్షే… ఎందుకంటే..? కేజీఎఫ్-2కు ఆఫ్టరాల్ వంద కోట్లు ఖర్చు పెట్టారు… కానీ సాలార్ 350 కోట్ల బడ్జెట్… ప్రభాస్ రాధేశ్యామ్‌తో షాక్ తిన్నాడు… బాహుబలి, సాహో సినిమాలతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది… తన రాధేశ్యామ్ చేదు నుంచి బయటపడాలంటే ప్రభాస్‌కు ఓ సూపర్ డూపర్ హిట్ కావాలి… సేమ్… ప్రశాంత్ నీల్‌కు కూడా పరీక్షే…
కేజీఎఫ్-1 లోనే మితిమీరిన సూపర్ హీరోయిజం… ఇక కేజీఎఫ్-2లో దానికి పదిరెట్లు ఎలివేషన్స్… ఇక ప్రశాంత్ నీల్ తీసే తదుపరి సినిమాలో..? అదీ ప్రభాస్‌తో…? ఇంకేం చూపించాలి..? కేజీఎఫ్-2లోనే ఎవరెస్టుకు ఎక్కించాడు… ఎలివేషన్స్‌పరంగా ఎక్కించడానికి వేరే ఎత్తయిన శిఖరం ఏముంది..? కేజీఎఫ్ ఘన విజయం తరువాత కేజీఎఫ్-2 మీద విపరీతమైన హైప్ క్రియేటైంది… ప్రశాంత్ ఎక్కడా తొట్రుపాటుకు గురిగాకుండా కూల్‌గా సీక్వెల్ లాంచ్ చేశాడు… అక్కడి వరకూ వోకే…
ప్రభాస్ సినిమా మాత్రమే కాదు… ఆమధ్య ఎప్పుడో జూనియర్‌తో ఓ సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు… అదేమైందో తెలియదు… బహుశా బాహుబలి, కరోనా జాప్యాలతో ప్రాజెక్టు స్థంభించిపోయి ఉంటుంది… ఒ:కవేళ అదీ పట్టాలెక్కితే అదీ ఓ పరీక్షే… ఎందుకంటే, ఆర్ఆర్ఆర్ తరువాత జూనియర్‌కు ఓ భారీ సినిమా కావాలి… అదీ ప్రశాంత్ నీల్ రేంజు అయి ఉండాలి…
ఈమధ్యలో కూల్‌గా దర్శకత్వాన్ని పక్కనపెట్టేసి భగీరా సినిమాకు కథ, స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే రాసిస్తున్నాడు ప్రశాంత్ ప్రశాంతంగా… తను కేజీఎఫ్-3 తీయకపోవడమే మంచిది… యశ్‌ను ఇంతకుమించి ఇక ఎలివేట్ చేయడానికి ఏమీ లేదు… పది మంది బాలయ్యల్ని చూపించాడు ఈ సినిమాలో..!! ఏమాత్రం తగ్గినా నేలమీదకు దిగుతుంది యవ్వారం..!! నిజానికి ఈ దశలోనే ప్రశాంత్ కాస్త స్థిమితంగా, జాగ్రత్తగా అడుగులు వేయాల్సింది…!!
Share this Article