అవును..ఈ ఒక్క రోజు
మీ నిలువెత్తు విగ్రహం చుట్టూ
Ads
ఖాకీల లాఠీ పహారాల మధ్య
దళితత్వం పులుముకున్న
నాయక మన్యుల అభినయాలు!
మీ ఆలోచనలే అక్షరాలై
కల్పించిన రిజర్వేషన్లు
గద్దెలెక్కించాయన్న సోయి
రాబందు రాజకీయాలు
స్మరించుకునే రోజు..
అవును.. ఈ ఒక్క రోజు
దొరీర్కం కార్లలోనే విడిచి
నీలాకాశం నీడన
జై భీంజెండా నినాదాల నడుమ
కైదండలూ,, కౌగిలింతలు
కరచాలనాలూ, పలకరింతలు,
అవును.. ఈ ఒక్క రోజు..
అందరూ.. “దళిత బంధు”వులే
చీప్ లిక్కర్ ప్రవాహాలలోంచి
పోలింగ్ బూత్ దగ్గరకొచ్చిపడే
బ్యాలెట్ డబ్బా ఓట్లలా కాకుండా
మా బస్తీ చేవలేని పోరల్లంతా
అసలు సిసలు మనుషుల్లా కన్పించేది
అవును.. ఈ ఒక్క రోజు..
మా అంటరాని బస్తీ, గల్లీలలో
ఖరీదైన కార్ల లోంచి దిగి
మీ విగ్రహం పొరబాటున కూడా
చేతులకంటుకోకుండా
అతి జాగ్రత్తతో,అతిలాఘవంగా
పై నవ్వులు రువ్వుతూ
మీ మెడలో పూలమాలలేయటం
వంగి దండాలు బెట్టటం.
ఊసరవెల్లి రాజకీయ జెండాల
అనివార్యపు ఎజెండాలైతాయి
అవును.. ఈ ఒక్క రోజు
మా బాగు కోసం నడిచి
మా బాగు కోసం నిలిచి
మా బాగు కోసం చదివి
మా బాగు కోసం రాసి
మా మురికి దేహాలకు
ఆశల అంగీలు తొడిగిన
మా ఆజ్ఞానాచారాలపై
విజ్ఞానపు పన్నీరు జల్లిన
బాబా అంబేద్కరా!
నిస్సహాయుడిని నేను
అవును.. ఈ ఒక్క రోజు
నన్ను క్షమించక తప్పదు
మీ పాదాల చెంత వుంచాలని….
ఊరి బడి గోడలపై మొలిచిన
గడ్డిపూల మాలచేసుకొచ్చాను
నేనెంత వేచినా.వారినెంత వేడినా
మీ దరి చేరలేకపోయాను.
ఖాకీ పహారాలు దాటి..
నాయక నటవర్గ శ్రేణుల దాటి
మీ మోము చూడలేకపోయాను
నను క్షమించక తప్పదు
అవును.. ఈ ఒక్క రోజు…
Share this Article