ముందుగా ఓ కథ చదవండి… 2017 నుంచి రకరకాల సైట్లలో, సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా సర్క్యులేటయింది… ఇప్పటికీ షేర్ అవుతూనే ఉంటుంది… డెస్టినీ అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి దీన్ని ఉదహరిస్తుంటారు… చదువు, సంపద, హోదా, వారసత్వం, సపోర్ట్ ఏమున్నా సరే, పిసరంత అదృష్టం, కర్మఫలం బాగుంటే విజయం వెంట ఉంటుందని చెప్పడానికి ఈ కథను వివరిస్తుంటారు… ఆ కథేమిటంటే..?
ఒక పిల్లవాడు… బ్రిలియంట్… బడిలో ఎప్పుడూ ఫస్ట్ క్లాస్… ప్రతి పరీక్షలో టాపర్… బడి దాటాక కాలేజీ, యూనివర్శిటీ… ఎక్కడైనా తనే ఫస్ట్… పేరు శ్రీధరన్…
రెండో పిల్లవాడు… యావరేజ్… బడిలో ఎప్పుడూ ఫెయిలయ్యేవాడు కాదు, కానీ ఎలాగోలా గట్టెక్కుతుండేవాడు… పేరు శేషన్…
Ads
మూడో పిల్లవాడు… కాస్త మందమతి… కానీ ప్రతిదీ మేనేజ్ చేసేవాడు… పేరు ఉన్నికృష్ణన్…
ఈ ముగ్గురూ మంచి ఫ్రెండ్స్… ఒకే బడి… ఒకే ఊరు… సేమ్ ఉపాధ్యాయులు… సేమ్ సోషల్ బ్యాక్ గ్రౌండ్… చదువు పూర్తయింది… శ్రీధరన్ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని రైల్వే ఇంజనీర్ అయ్యాడు… మెట్రో శ్రీధరన్‌గా పిలవబడిన ఈయన ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు సంబంధించి జెమ్…
శేషన్ గురించి చెప్పనక్కర్లేదు… చదువు తరువాత సివిల్ సర్వీసులో చేరి, రిటైరయ్యాక చీఫ్ ఎన్నికల కమిషనర్‌గా రాజకీయ పార్టీలన్నింటికీ వణుకు పుట్టించాడు… దేశంలో ఎన్నికల తీరును మార్చేశాడు… తనతో పోటీపడిన శ్రీధరన్ పనిచేసే రైల్వే శాఖకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ అయ్యాడు…
ఉన్నికృష్ణన్ చదువును పట్టించుకోలేదు… రాజకీయాల్లో చేరాడు… సరైన టైమ్‌లో సరైన పార్టీని ఎంచుకునేవాడు… వరుసగా గెలిచేవాడు… ఓ దఫా మంత్రిగా కూడా పనిచేశాడు… తన ఇద్దరు బడిస్నేహితులు పనిచేసే శాఖకే మంత్రి అయ్యాడు… అదీ డెస్టినీ… ఇదీ పదే పదే చెప్పబడుతున్న కథ… స్థూలంగా చూస్తే చదవబుల్ స్టోరీ… బాగుంది… కానీ..?
శ్రీధరన్, శేషన్ ఒకే బడిలో చదివారు అనేది నిజం… ఒక క్లాసులో పరస్పరం పోటీపడ్డారు అనేది నిజం… వీరిలో శేషన్ యావరేజ్ స్టూడెంట్ అనేది అబద్ధం… వీళ్లిద్దరూ చదివింది పాలక్కాడ్‌లోని బీఈఎం స్కూల్… ప్రస్తుతం కేరళలో ఉంది… టెన్త్ క్లాసులో ఈ ఇద్దరికీ వచ్చిన మార్కుల్లో తేడా కేవలం ఒకే మార్కు… (451, 452)… ఎవరో కాదు, శేషన్ మరణించినప్పుడు ఈ వివరాలన్నీ శ్రీధరన్ షేర్ చేసుకున్నవే… సో, శేషన్ యావరేజ్ స్టూడెంట్ కాదు…
వీళ్లిద్దరిదీ పాలక్కాడ్… కానీ ఉన్నికృష్ణన్‌ది కొజిక్కోడ్… పైగా శ్రీధరన్, శేషన్ పుట్టింది 1932లో… కానీ ఉన్నికృష్ణన్ పుట్టింది 1936లో… ముగ్గురూ ఒకే బడి కాదు… ఒకే తరగతి కాదు… కాకపోతే శేషన్, ఉన్నికృష్ణన్ ఇద్దరూ చెన్నైలోని ఎంసీసీ కాలేజీలో చదువుకున్నారు… సో, ఉన్నికృష్ణన్ చదువులో మందమతి అనేది నిజం కాదు…
శ్రీధరన్ పనిచేసిన రైల్వేకు శేషన్ ఎప్పుడూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ కాలేదు… పైగా ఆయన సివిల్ సర్వీసులో ఉన్నాడు… సో, శేషన్ అధికార పరిధిలో శ్రీధరన్ ఎప్పుడూ పనిచేయలేదు… 1989-90 నాటికే శేషన్ కేబినెట్ సెక్రెటరీ అయ్యాడు… తరువాత కొన్నాళ్లు ప్లానింగ్ కమిషన్, తరువాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్… సో, ఉన్నికృష్ణన్ మంత్రిగా ఉన్న 1989-90 కాలంలో ఆయన అధికార పరిధిలో శేషన్ లేడు… శ్రీధరన్ ఉన్న రైల్వే బోర్డు మీద మాత్రం ఉన్నికృష్ణన్‌కు ఉపరితల రవాణా శాఖా మంత్రిగా కొన్నాళ్లు అధికార పరిధి ఉండేది… ఇలా ఈ స్టోరీ ఓ కల్పన… శ్రీధరన్, శేషన్ స్కూల్ క్లాస్‌మేట్స్ అనేదొక్కటే నిజం..!!
కొసమెరుపు :: ఉన్నికృష్ణన్ మొదటి నుంచీ రాజకీయాల్లో ఉన్నవాళ్లే… తనను వదిలేస్తే కెరీర్ ఉచ్చదశల్ని అనుభవించి, వయస్సు మళ్లాక రాజకీయాల్లోకి ప్రవేశించారు శేషన్, శ్రీధరన్… శేషన్ ఏకంగా రాష్ట్రపతి పదవికే పోటీపడగా… శ్రీధరన్ ఆమధ్య కేరళ ఎన్నికల్లో పోటీపడ్డాడు…!! అఫ్‌కోర్స్, ఇద్దరూ భంగపడ్డారు సహజంగానే…!!
Share this Article