ఒక వంటల వీడియోకు యూట్యూబ్‌లో ఎన్ని వ్యూస్ రావచ్చు..? మ్యాగ్జిమం 50 లక్షల నుంచి 60, 70 లక్షలు…? అబ్బో, చాలా ఎక్కువ ఫిగర్ అంటారా..? పర్లేదు, పచ్చిపులుసు వీడియోలకే పదీపదిహేను లక్షల వ్యూస్ ఉంటున్నయ్… జనం అవసరం… ఇప్పుడందరికీ వంట గురువు యూట్యూబే కదా… అనుకోకుండా ఓ వీడియో కనిపించింది… కోటీపదమూడు లక్షల వ్యూస్ ఉన్నయ్… అదీ మెయిన్ కోర్స్ డిష్ కాదు, ఓన్లీ స్నాక్స్, అదీ వంకాయ స్నాక్స్…
కేవలం రెండు ఆలుగడ్డలు, ఒక కోడిగుడ్డు మాత్రమే ఉన్నప్పుడు చేసుకోగలిగే స్నాక్స్ అంటూ ఓ వీడియో ఉంది… నమ్ముతారా..? దాదాపు 3 కోట్ల వ్యూస్… అవును, అక్షరాలా మూడు కోట్లు… ఏమో, అంతకుమించిన రికార్డులు ఏమైనా ఉన్నాయేమో గానీ… వంటల వీడియోలకు మరీ ఇంత పిచ్చి ఉందానే ఆశ్చర్యం మాత్రం కలిగింది… సరే గానీ… ఆ వంకాయ స్నాక్స్ సంగతేమిటి అంటారా..? వెయిట్… వెయిట్… ముందుగా…
నో మసాలాస్, నో మిరపకాయ్స్, నో ఉల్లిపాయ్స్, నో అల్లమెల్లిపాయ్స్, నో సవ్వాలాక్ ఇంగ్రెడియెంట్స్, నో చెమట్స్,… జిగట, గిగట ఏమీ లేకుండా… జస్ట్, నిమిషాల్లో సూపర్ బెండీ స్నాక్స్ ఎలాగో ఆమధ్య చెప్పుకున్నాం గుర్తుందా..? అన్నంలోకి మంచింగ్… మందులోకి కూడా ‘మంచిం’గ్… సరదాగా కూడా ఉత్తగా కూడా లాగించొచ్చు… ఇదీ ఆ లింకు…
Ads
జిగట లేదు, ప్రయాస లేదు… ఆరోగ్యం + మాంఛింగ్ బెండీ… రుచిమరిగితే ఇక అంతే…
ఆ కోటి వ్యూస్ వంకాయ వీడియో దిగువ ఇస్తున్నాను… హిందీలో ఉంటుంది… చాలా సింపుల్ తెలుగులో చెప్పుకోవాలంటే… ‘‘నిలువు వంకాయల్ని తీసుకొండి… తొక్క తీసి, తొడిమలు అలాగే ఉంచి, జాగ్రత్తగా నిలువునా చీల్చండి… సన్నగా…! ఓ గిన్నెలో ఉప్పు, కారం, మిరియాల పొడి, కాసిన్ని నీళ్లు… కాస్త ఆరార్ పొడి ప్లస్ కాస్త మైదా కలపండి… బైండింగ్ కోసం… ఆరార్ పొడి అంటే అర్థం కాలేదా..? పర్లేదు… వరి పిండి, మక్కల పిండి కూడా తీసుకోవచ్చు…
ఈ నిలువునా చీల్చబడిన వంకాయల్ని ఆ ద్రావణంలో ముంచి, వాటిని అలాగే బ్రెడ్ క్రంబ్స్ మీద అద్ది నూనెలో వేగించాలి… అంతే… అయితే బ్రెండ్ క్రంబ్స్ చాలామందికి అలవాటు లేదు… అవి పెద్ద విశేషమేమీ కాదు, బ్రెడ్ ముక్కల్ని ఎండబెట్టి, మిక్సీలో వేసి తిప్పండి, ఆ పొడి చాలు… డిష్ కాస్త కడక్ కడక్ ఉండటానికి ఉపయోగం…
నిజానికి మీరు ప్రయోగశీలురే అయితే… ఈ తిక్క డిష్ అక్కర్లేదు… మిర్చి బజ్జీల పిండి కలుపుతారు కదా… అలా కలుపుకొండి… ఇలా నిలువునా చీల్చబడిన వంకాయల్ని ముంచి, నూనెలో ఫ్రై చేయండి… మరీ మిర్చి బజ్జీల్లా వేయకండి… వంకాయ ముక్కలకు (తొడిమెలతో సహా ఉన్నవి) కాస్త కాస్త శెనిగెపిండి అద్దబడితే చాలు… ఫ్రై అయ్యాక వంకాయ బజ్జీ ప్లస్ వంకాయ ఫ్రైలాగా… ఓ కొత్త టేస్టు దొరుకుతుంది… ఎహె, అదీ బాగాలేదు అంటారా..?
ఇంకాస్త వీజీ స్నాక్స్ చేసుకోవచ్చు… సేమ్, ఇంతకుముందు డిష్‌కు చెప్పినట్టే వంకాయల్ని తొడిమెలు అలాగే ఉంచి, నిలువునా చీల్చండి, అనగా కట్ చేయండి… ఓ ప్యాన్ తీసుకుని, కాస్త నూనె… అందులో ఎప్పటిలాగే ఆవాలు… కాస్త వేగాక ఎర్ర కారం, ధనియాల పొడి, ఉప్పు వేయండి… మీకు ఇష్టమైతే కాస్త ఇంగువ… దీనికి నువ్వుల పొడి కూడా కలపండి… ఇక వంకాయల్ని వేసి, అన్ని ముక్కలకూ ఆ మసాలాలు పట్టేలా అటూఇటూ తిప్పండి… సన్నటి సెగపై మూడు నిమిషాలు… మంచింగ్ మహారాజా రెడీ… చేతనైతే కాస్త నిమ్మరసం జల్లుకుని లాగించేయండి…
ఎప్పుడూ ఒకటే జాగ్రత్త… స్టార్ హోటళ్ల చెఫ్పుల వీడియోల జోలికి వెళ్లకండి… అవి ఉప్పుకారం ఉండని చప్పిడి వంటలు… పైగా బోలెడు ఇంగ్రెడియెంట్స్ కుమ్మేస్తారు, టైమ్ టేకింగ్… చివరకు పెంట పెంట… ఎక్కువ మసాలాల్ని సూచించే వీడియోల వైపు అసలే వద్దు… తక్కువ టైమ్, లోకల్ వంట నిపుణులు, తక్కువ ఇంగ్రెడియెంట్స్, తక్కువ మసాలాలు మాత్రమే ఉండేవీ, మరీ ప్రధానంగా నూనె తక్కువగా అవసరపడేవి ఎంచుకొండి… అది మెయిన్ కోర్స్ అయినా, స్నాక్స్ అయినా, కొత్త డిషెస్ అయినా… వీడియోలు చూడాలి, మనకు అనువైన పద్ధతిలో చేసుకోవాలి… అదీ పద్ధతి… ఇదే వంకాయకు సంబంధించి వందల రకాల వీడియోలు ఉంటయ్… అందులో పనికొచ్చే ‘మాంచింగ్’ స్నాక్స్ కొన్ని మాత్రమే..!!
ష్… మరీ వీజీ వంకాయ స్నాక్స్ ఏమిటో తెలుసా..? తొక్క తీయకండి, తొడిమెల్ని అలాగే ఉంచి, నిలువునా ముక్కలుగా చీల్చండి… అందుబాటులో ఉన్న ఏదేని ఊరగాయను ఆ ముక్కలకు సమానంగా పట్టుకునేలా పూయండి… ఓ ప్యాన్ మీద కాసింత నూనె వేసి… చిలకరిస్తే చాలు… దాని మీద ఈ వంకాయలను పడుకోబెట్టండి… కాస్త అటూఇటూ కాలనివ్వండి… ఇక ఏదీ అక్కర్లేదు… ప్లేటు మీదకు తీసుకోవడమే…!! ఎప్పుడూ ఆమ్లెట్లు, ఫ్రైడ్ పల్లీలేనా… ఇలా చేసుకుని చూడొచ్చుగా…!!
Share this Article