ఒకప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పోషించిన పాత్ర వేరు… ఆ పత్రిక ఓ సంచలనం… పాత్రికేయ ప్రమాణాల్లో, టెంపర్‌మెంట్‌లో అదొక లెజెండరీ స్టేటస్… నిజానికి దాంతో ఈనాడు ప్రమాణాల్ని పోల్చడం, ఆ ఎక్స్‌ప్రెస్ రామనాథ్ గోయెంకాతో రామోజీరావును పోల్చడం సరైందేనా కాదా అనేదే ఓ పెద్ద ప్రశ్న… కానీ కొన్నిసార్లు అనివార్యంగా పాఠకుల్లో ఒక పోలిక చర్చకు వస్తుంది… సహజం… ఎందుకంటే… ఈనాడు ఇండియాలో ప్రస్తుతం టాప్ టెన్ పత్రికల్లో ఒకటి కాబట్టి…
అయితే మీడియా హౌజ్ ఓనర్లందరూ ఒకేలా ఉంటారా..? ఉండరు… ఒకప్పుడు తన తల్లి మరణవార్తను ప్రముఖంగా వేయవద్దన్న పత్రికాధిపతి ఈరోజు తన మనమరాలి పెళ్లికి మూడు ఫుల్ పేజీల్లో ఫోటోలు కుమ్మేశాడంటే ఖచ్చితంగా ఓ విస్మయం… ఓ చర్చ అనివార్యం… ఓ మీడియా హౌజ్ ఓనర్ మనమరాలి పెళ్లికి ఉండే పాఠకాసక్తి ఏమిటి..? పాత్రికేయ ప్రమాణం ఏమిటి..? ప్రజాప్రయోజనం ఏమిటి..? ఇదీ ఆ చర్చ… జరగనివ్వండి… అది ఈనాడు కాబట్టి ఈమాత్రం చర్చ… వేరే పత్రికలయితే అసలు సొసైటీలో ఎవడూ పట్టించుకోడు, ఏం రాసినా సరే… ఏం చూపించినా సరే…
అప్పట్లో ఎక్స్‌ప్రెస్, దాని అనుబంధ భాషాపత్రికల్లో (ఆంధ్రప్రభ వంటివి) పనిచేసిన సీనియర్ జర్నలిస్టుల్లో ఈ చర్చ ప్రధానంగా సాగుతోంది… ‘‘నాకు బాగా గుర్తుంది… గోయెంకా మరణశయ్య మీద ఉన్నాడు… చివరిరోజు… అందరమూ ఆయన జీవితచరిత్ర తాలూకు కథనాలు సిద్ధం చేసుకున్నాం… కుమ్మేయాలి… తెల్లారి పెయిడ్ హాలీడే ఉంటుంది…’’ ఇలా సాగుతున్నాయట హైదరాబాద్ ఆఫీసులో ఆలోచనలు…
Ads
ఎక్స్‌ప్రెస్ వ్యవహారాల్ని చూసే పెద్దాయన నుంచి ఫోన్… ‘‘పెద్ద సార్ చెప్పాడు… నేను పోయినా సరే, ఎడిషన్ లేట్ కావద్దు, నా మరణవార్తను ఫస్ట్ పేజీలో వేస్తే అది నాకు నివాళి అస్సలు కాదు, లోపలి పేజీలో… అదీ సింగిల్ కాలమ్ వేయండి, చాలు అన్నాడు…’’ ఇదీ ఆ ఫోన్ కాల్ సారాంశం… ‘‘అంతకుముందు కూడా ఇలాంటి అనుభవమే… ఓసారి హైదరాబాద్ వచ్చాడు సారు, రోటరీ క్లబ్బో మరొకటో సన్మానించాయి… ఓ రిపోర్టర్ రెచ్చిపోయి నాలుగు కాలాల వార్త పంపించాడు… ఓ సబ్ ఎడిటర్ యథాతథంగా పబ్లిష్ చేసి, పేజీలు పాస్ చేశాడు… తెల్లవారి ఇద్దరికీ టర్మినేషన్ ఆర్డర్స్ అందాయి’’ అని గుర్తుచేసుకున్నాడు ఆ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి ఒకరు…
మరో సీనియర్ జర్నలిస్ట్ మంగు రాజగోపాల్ రాసుకున్న జ్ఞాపకం కూడా ఈరోజు వైరల్… అది ఇక్కడ యథాతథంగా…
ఇది ఇంకో ట్రిపుల్ ఆర్
*******************
నేనిప్పుడు RRR గురించి రాయబోతున్నాను.
ఇది రాజమౌళి RRR కాదు.
R అంటే రామ్ నాథ్ గోయెంకా..
R అంటే రామోజీ రావు..
R అంటే రీడర్స్
*********
ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు గారి మనవరాలి వివాహ విశేషాల గురించి ఇవాళ ఈనాడు, ఈటీవీలో కళ్లు బైర్లు కమ్మేలాగా వచ్చిన కవరేజ్ చూడగానే నా మనసు నలభై ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. పాత జ్ఞాపకాలు రింగులు రింగులుగా గిర్రుమని తిరిగాయి.
***********
నేను ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపుకి చెందిన ఆంధ్రప్రభ, హైదరాబాద్ ఎడిషన్ లో సబ్ ఎడిటర్ గా ఉద్యోగం చేస్తున్న రోజులవి. 1978లోనో, 1979లోనో సరిగ్గా గుర్తు లేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రికల యజమాని రామ్ నాథ్ గోయెంకా మనవరాలు కవితా గోయెంకాకి పెళ్లి కుదిరింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్ ప్రెస్, ఆ గ్రూపులో ఉన్న భాషా పత్రికల సిబ్బంది అందరికి పెళ్లి శుభలేఖలు అందాయి. గోయెంకా గారు సిబ్బంది ప్రతి ఒక్కరికీ పంచెలు నీట్ గా ప్యాక్ చేసి కానుకగా పంపించారు.
సరే..పెళ్లి రోజు రానే వచ్చింది. మద్రాసులో పెళ్లి జరిగింది. పెళ్లి ఫోటోలు, వార్తలు, విశేషాల కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఇంతకీ రావు. అంతకీ రావు. అవతల ఎడిషన్ డెడ్ లైన్ ముంచుకు వస్తోంది. రెసిడెంట్ ఎడిటర్ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. మా డెస్కు దగ్గరికి వచ్చి ఏమైనా మెసేజ్ వచ్చిందా అని ఆరా తీస్తున్నారు. టెలిప్రింటర్ రూములోకి వెళ్లి అడుగుతున్నారు. మధ్య మధ్యలో పక్కనే ఉన్న ఎక్స్ ప్రెస్ న్యూస్ ఎడిటర్ క్యాబిన్ లోకి వెళ్లి వస్తున్నారు. ఆయన కంగారంతా అప్పటికీ రాని కవితా గోయెంకా పెళ్లి ఫోటోలు, వార్తల గురించే అని డెస్కులో మాకు అర్ధమవుతూనే ఉంది.
ఫోర్మన్ వచ్చి “సార్, టైమవుతుండాది, పేజీ పెట్టడానికి రండి సామీ” అని తొందర చేస్తున్నాడు. నేను బితుకు బితుకుమంటూనే పొత్తూరి వారి క్యాబిన్ లోకి దూరి ” సార్, ఎడిషన్ లేటయిపోతోంది. ఫస్ట్ ఎడిషన్ ఇచ్చేద్దాం. కావాలంటే సిటీకి మార్చుకుందాం” అన్నాను.
అవతల యజమాని గారి మనవరాలి పెళ్లి. దాని గురించి ఒక్క ముక్క కూడా లేకుండా పేపరు వెళ్తే యాజమాన్యం ఏమనుకుంటుంది? పాఠకులు ఏమనుకుంటారు? ఇలా ఆలోచిస్తున్న పొత్తూరి గారు ఆ మాటే అని, “సరే, ఫైనల్ గా మెడ్రాస్ వాళ్లనే అడుగుదాం” అని ఫోన్ తీశారు. నేను బయటికి వచ్చేశాను.
అందరం పొత్తూరి గారి క్యాబిన్ వైపే చూస్తున్నాం. కాస్సేపయాకా పొత్తూరి గారు నవ్వు మొహంతో బయటికి వచ్చారు. వస్తూనే అన్నారు. ” మీరు ఎడిషన్ ఇచ్చెయ్యండి. దేని కోసం వెయిట్ చెయ్యక్కర్లేదు”
“ఏమయింది సార్!” అని సస్పెన్స్ భరించలేక అడిగాం.
అప్పుడు పొత్తూరి గారు ఏం చెప్పారంటే..
మెడ్రాస్ లో ఓఎస్ డీ గారు పెళ్లి మంటపంలో ఉన్న రామ్ నాథ్ గోయెంకా గారి దగ్గరికి వెళ్లి, “సార్, అన్ని ఎడిషన్ల వాళ్లు పెళ్లి న్యూస్, ఫోటోల కోసం వెయిట్ చేస్తున్నారు” అని చెప్పారు.
దానికి రామ్ నాథ్ గోయెంకా గారు చెప్పింది ఇదీ.
“చూడండీ..నా మనవరాలి పెళ్లి మా కుటుంబ వ్యవహారం. మన పాఠకులికి ఇందులో న్యూస్ ఇంట్రస్టు ఏమీ లేదు. న్యూసూ లేదు, గీసూ లేదు. ఎడిషన్లు ఆపొద్దని వెంటనే అందరికీ చెప్పండి.”
అందుకే మరి… గోయెంకా? మజాకా?
Share this Article