ఫస్ట్.., ఎవరో మార్నింగ్ వాకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఇన్సిడెంట్ ఆధారంగా… ది లాజికల్ ఇండియన్ సైటులో వచ్చినట్టుంది ఇది… తరువాత ది హిందూ, తరువాత పలు పత్రికలు… తెలుగులో Bade Raja Mohan Reddy తెలుగీకరించి ఫేస్‌బుక్‌లో రాస్తే కొన్ని వేల షేర్లు, లైకులు… సైట్లు, టీవీలు, యూట్యూబర్లు కూడా ఎడాపెడా వాడేసుకున్నారు ఈ స్టోరీని… ఎందుకు..? తెల్లారి లేస్తే మొత్తం నెగెటివిటీయే కమ్మేస్తోంది మనల్ని… రకరకాలుగా…
సమాజం, మీడియా, రాజకీయాలు, ప్రభుత్వాలు, మనుషులు, అనుభవాలు… అందరూ… అంతులేని నిరాశావాదాన్ని నింపుతున్నారు… లేదు, లేదు, మానవత్వం, మంచితనం, స్పందించే హృదయాలు ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు అని చెప్పే కథ ఇది… వేలకువేల పోస్టులు ఇప్పటికే చదివి ఉన్నారు కదా అంటారా..? చదవని వాళ్లూ బోలెడు మంది… మళ్లీ చదవాల్సిన వాళ్లూ బోలెడు మంది… ఫస్టయితే ఈ స్టోరీ ఓసారి నెమరేయండి…
Ads
చెన్నై… సమయం ఉదయం 6:30… నిరక్షరాస్యురాలైన ఓ తల్లి తన కూతురిని వెంటబెట్టుకుని చెన్నైలోని అన్నా యూనివర్శిటీకి చేరింది… ఎవరినో అడిగింది, అడ్మిషన్లు ఎక్కడ జరుగుతాయి అని… పొద్దున్నే ఆ క్యాంపస్‌లో వాకర్ల సందడి ఎక్కువ… ఎవరికో డౌటొచ్చి అడ్మిషన్ కోసం రమ్మని యూనివర్శిటీ వాళ్లు పంపించిన కార్డు ఉందా అనడిగారు… ఆమె సంచీ నుంచి జాగ్రత్తగా తీసి ఇచ్చింది…
తీరా చూస్తే అసలు వాళ్లు రావల్సింది ఇక్కడికి కాదు… కోయంబత్తూరులోని వ్యవసాయ యూనివర్శిటీకి… వర్శిటీవాళ్లు పంపించిన సమాచారంలో Anna Arangam, Tamil Nadu Agriculture University, Coimbatore అనే రాసి ఉంది… వాళ్లు అన్నా యూనివర్శిటీ అనుకుని వచ్చేశారు… మరి ఇప్పుడు ఏం చేయాలి..?
చాలా పూర్ బ్యాక్ గ్రౌండ్… 1200కు గాను 1017 మార్కులు సంపాదించిన ఆ అమ్మాయి స్వాతి భవిష్యత్తు చదువులపై ఎన్నో ఆశలు పెట్టుకుంది… చెన్నై నుంచి కోయంబత్తూరు 550 కిలోమీటర్లు… 8.30 గంటలకు అడ్మిషన్స్ ప్రక్రియ స్టార్ట్… అప్పటికే 7 అయ్యింది… గంటన్నరలో ఎలా వెళ్లగలదు..? స్వాతి కళ్ల నుంచి నీళ్లు కారిపోతున్నయ్… ఆరోగ్యం బాగా లేకపోయినా కష్టపడి చదివి ఆ మార్కులు సంపాదించింది ఆమె…
అప్పటికప్పుడు కారులో వెళ్లినా కనీసం 7 గంటలు పడుతుంది… ఒకరిద్దరు కాస్తా పది మంది పోగయ్యారు… యూనివర్శిటీ పాత విద్యార్థి ఒకరు ముందుగా వాళ్లకు బ్రేక్ ఫాస్ట్ తెచ్చిపెట్టాడు… తలా కొంత పోగేసి రెండు ఫ్లయిట్ టికెట్లు బుక్ చేశారు… అక్కడే వాకింగుకు వచ్చిన ఓ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పరిచయం… ఆయనకు ఫోన్ చేసి, ఫలానా స్టూడెంట్ కాస్త లేటుగా వస్తుంది, అనుమతించండి అని రిక్వెస్ట్ చేశాడు… ఆయన సరేనన్నాడు…
ఇంకొకరు ఎవరో ఓ కారు మాట్లాడారు… విమానాశ్రయానికి… ఎలా వెళ్లాలో, ఏం చేయాలో చెప్పాడు ఓ విద్యార్థి వివరంగా… పది గంటలకు విమానం ఎక్కారు వాళ్లు… జీవితంలో విమానాన్ని ఎక్కడం కాదు కదా, అంత దగ్గరగా చూడటమే తొలిసారి వాళ్లకు… 11.40 గంటలకు కోయంబత్తూరులో దిగారు… దిగిన వెంటనే మరో కారు వచ్చింది పికప్ కోసం… అంతా వాకర్లే అరేంజ్ చేశారు… ఓ ఉమ్మడి టాస్క్… 12.15 గంటలకు వర్శిటీ చేరుకున్నారు… రెండు గంటలకు అడ్మిషన్ ప్రకియ పూర్తి… బీఎస్సీలో బయోటెక్‌లో చేరింది… ఎంత పాజిటివిటీ ఉంది ఈ కథలో…!!
ఇదీ కథ… బాగుంది… అడ్మిషన్ తరువాత తల్లీబిడ్డలు సొంతూరికి వెళ్లిపోయారు… తిరిగి చెన్నై వెళ్తాననీ, వాకర్స్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పి, ఫ్లయిట్ చార్జీలు ఇచ్చేస్తాననీ ఆ తల్లి తంగపొన్ను చెప్పింది… ఇక్కడితో వార్త ముగిసింది… 2015 నాటి వార్త… ఆ తరువాత స్వాతి చదువు పూర్తయిందా..? ఏం చేస్తోంది..? ఎక్కడుంది..? ఎంత వెతికినా, ఎంత ప్రయత్నించినా ఏ సమాచారమూ కనిపించ లేదు… ఇంతటి బిజీ ప్రపంచంలో ఫాలోఅప్ చేసేది ఎవరు..? ఎవరి బతుకు వేగంలో వాళ్లు…
కనీసం ఆమె మళ్లీ చెన్నైకి వచ్చిందా..? తెలిసిన వాకర్స్‌ను పలకరించిందా..? ప్చ్, కనీసం సోషల్ మీడియాలో కూడా ఏ సమాచారమూ లేదు… ఇదే, మీడియా, సోషల్ మీడియా ధోరణి… ఎంత పెద్ద సెన్సేషనయినా రెండురోజులు… తరువాత మరొకటి… పాతవి గుర్తుండవ్… గుర్తుంచుకుని మరీ ఫాలోఅప్ చేయాల్సిన అంశమూ కాదు… అప్పుడప్పుడూ ఈ పాత కథ చదువుకుని ఆనందించడమే..!! చదువు పూర్తి చేసి, మంచి కొలువు సంపాదించుకుని, జీవితంలో ఎంచక్కా స్థిరపడిపోయిందని ఈ కథకు మనమే ఓ ముగింపు రాసుకుని, చదువుకుని, సంతృప్తిగా నిట్టూరిస్తే సరి…!!
Share this Article