ప్రశాంత్ కిషోర్… ఓ పొలిటికల్ బ్రోకర్ అనే పదాన్ని వాడాల్సిన పనిలేదు… కానీ తను ఓ పొలిటికల్ మానిప్యులేటర్… తన ఆలోచనలు అత్యంత చంచలం… తనది వేల కోట్ల పొలిటికల్ స్ట్రాటజీ దందా… ఈ దేశ రాజకీయాల తాజా దురదృష్టం ఏమిటంటే… తను చుట్టూ తిరుగుతున్నారు సోకాల్డ్ రాజకీయ దురంధరులు… 24 గంటలూ రాజకీయ చాణక్యంలో మునిగి, తమను తాము ప్రూవ్ చేసుకున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ రాజకీయ వేత్తలు సైతం సిద్దాంతాలు, మన్నులేవు అంటూ ఓ వ్యక్తి ఎదుట సాగిలబడుతున్న ఓ విషాదదృశ్యం…
ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే… కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదు, గతంలో వాళ్ల కోసం పనిచేసినవాడే… తరువాత తరిమేశారు… చివరకు మళ్లీ తనే దిక్కయ్యాడు… ఇన్ని దశాబ్దాల చరిత్ర కలిగిన ఓ జాతీయ పార్టీకి చివరకు పీకే వంటి వ్యక్తి ఓ సపోర్టింగ్ పిల్లర్ కావడం ఖచ్చితంగా ఓ ట్రాజెడీ… ఆ పార్టీ తనలోతాను కుమిలిపోవాలి… అంతకుమించి కుమిలిపోవాల్సిన దురవస్థ టీఆర్ఎస్‌ది…
పీకే కాంగ్రెస్‌లో చేరతాడట… కానీ తన దుకాణం ఐప్యాక్ మాత్రం టీఆర్ఎస్‌కు పనిచేస్తుందట… అదేమిటయ్యా అంటే, ప్రస్తుతం ఆ దుకాణంలో తను కూర్చోవడం లేదట, వేరే మేనేజర్లకు అప్పగించాడట… ఈ టెక్నికల్ సమర్థన ఏ ప్రజల కళ్లకు గంతలు కట్టడానికి..? అసలు ఇవన్నీ చెప్పమని ఎవడడిగాడు..? తెలంగాణ తెచ్చాం, జీవితాంతం టీఆర్ఎస్‌కు వోటు వేయాల్సిందేనని ధీరగంభీరంగా పలికే గొంతులకు ఈ పీకే మద్దతు దేనికి..? తను ఏం పనిచేస్తాడు..? తెలంగాణలో పార్టీ అంతగా ఎత్తిపోయినట్టు అనిపిస్తోందా..? ఏమిటి ఈ బేలతనం..? పోనీ, కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయా..? విలీన ప్రతిపాదన ఉందా..? ఉంటే, ఇన్నేళ్లలో కాంగ్రెస్‌ను తొక్కీ తొక్కీ, ఇప్పుడీ స్నేహహస్తాలు దేనికి..? ఆలింగనాల ఆప్యాయతలు దేనికి..? ముందే చెప్పండి… ప్రజలు మానసికంగా ప్రిపేర్ అవుతారు ఫాఫం…
Ads
పొద్దంతా కాంగ్రెస్ అసంతృప్తులతో భేటీలు… సాయంత్రానికి ప్రగతి భవన్లో రిపోర్టింగ్… అక్కడే బస… రాజమర్యాదలు… ఇంకేం కావాలి..? రాష్ట్రాలు, పార్టీలు, ప్రభుత్వాలు జోహారు శిఖిపింఛమౌళీ అని పాడుతూ స్వాగతిస్తున్నాయి… అలుముకుంటున్నాయి… అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ… అని పొర్లుదండాలు పెడుతున్నాయి… నువ్వు కారణజన్ముడివి ప్రశాంత కిషోరమా… పెట్టిపుట్టావు… (కానీ జాగ్రత్త… ప్రకాష్‌రాజ్, రాకేష్ టికాయట్‌తో కూడా ఓసారి మాట్లాడు…)
మీ పాలన తీరు బాగుంటే ప్రజలే బ్రహ్మరథం పడతారు కదా… కొత్త మేనిప్యులేటర్ల పాత్ర దేనికి..? కొత్తేమీ కాదు, పీకే ఒకేసమయంలో ఒకే రాష్ట్రంలో వేర్వేరు పార్టీలకు కూడా పనిచేస్తాడు, చేశాడు… ముందే చెప్పుకున్నాం కదా… అది ఓ దుకాణం… ఎవరికి ఏం కావాలో పొట్లం కట్టి ఇచ్చేయడమే… కానీ కాంగ్రెస్‌లో చేరాలంటే మిగతా బంధాల్ని తెంచుకోవాలనే షరతు పెడుతున్నది కదా హైకమాండ్… కానీ వందల కోట్ల దందాను పీకే ఎందుకు వదులుకుంటాడు… ఇదొక సాకు… నాకు ఐప్యాక్‌తో లింక్ లేదు అని…
ఐప్యాక్ తనదే… అసలు తన దగ్గర ట్రెయిన్ అయినవాళ్లే వేరే పార్టీలకు కూడా వర్క్ చేస్తుంటారు… అదొక పెద్ద వ్యూహం… దాని చక్రబంధంలో దేశ రాజకీయం గిరగిరా తిరుగుతోంది… చంద్రబాబు కోసం పనిచేసే రాబిన్ ఐప్యాక్ ఉత్పత్తే… కాంగ్రెస్‌లో చేరినా సరే, పీకే జగన్ కోసం పనిచేస్తూనే ఉంటాడు… అదేమంటే టీఆర్ఎస్ కంట్రాక్టుకు చెప్పినట్టే ఐప్యాక్‌తో నాకు లింక్ లేదు అంటాడు… అంటే అంతా వాళ్లే… ఒక్క ముక్కలో చెప్పాలంటే బీజేపీ కోసం తప్ప యాంటీ-బీజేపీ పార్టీలన్నింటినీ ఓ బ్యానర్ కిందకు తీసుకురావాలనే స్ట్రాటజీ పేరిట… దందాకు దందా… డబ్బుకు డబ్బు… వావ్… పీకే భాయ్… జవాబ్ నహీఁ
నిజానికి పీకే వర్క్ చేసేది ఇప్పుడు ఓ నేషన్ లెవల్ టాస్క్… మోడీని తరిమేసి, బీజేపీని దింపేసి, మళ్లీ ఏ కలగూరగంప సర్కారునో ఢిల్లీ కుర్చీ మీద కూర్చోబెట్టడం… చూశాం కదా, గతంలో… వీపీసింగ్, గుజ్రాల్, చంద్రశేఖర్, దేవెగౌడ… అలాంటి కథలన్నీ పడి, కేంద్రంలో తను కీలకంగా చక్రం తిప్పాలి… ఇంత పెద్ద పెద్ద ఆశలున్నాయి కాబట్టే బీహార్లో చెంత చేర్చుకున్న నితిష్‌ను పక్కకు తోసేసి దేశీయ మార్కెట్‌లో పడ్డాడు… అవునూ, లెఫ్టర్లూ… అనగా, ఎర్రన్నలూ… మీరు కూడా పీకే కూటమిలో చేరుతున్నారా..?! మీరు కూడా పీకే మార్క్ సిద్ధాంతమే ఈ దేశానికి అర్జెంటు అనుసరణీయం అనబోతున్నారా..?! కొన్నాళ్లు మార్క్సిజాన్ని, లెనినిజాన్ని అటక మీద భద్రపరుద్దాం…!!
సార్, పీకే గారూ… ఓ చిన్న రిక్వెస్టు… రాబోయే రోజుల్లో పాకిస్థాన్‌లో ఇమ్రాన్ పార్టీకి, బంగ్లాదేశ్‌లో ఖలీదా జిలా పార్టీకి, శ్రీలంకలో రాజపక్స పార్టీకి కూడా పనిచేయడానికి ఒప్పందాలు కుదుర్చుకోకండి ప్లీజ్… ఐప్యాక్ అంటే ఇంటర్నేషనల్ ప్యాక్ అని కొత్త టెక్నికల్ సమర్థన చెప్పకండి… కొడితే నాటో కుంభస్థలాన్ని కొట్టండి… ఈ చిల్లర మల్లర కంట్రాక్టులు దేనికి… అసలే మీరు విశ్వనాయకుడు…!!
Share this Article