ఆ పిల్లాడు ఉత్సాహంగా ఉన్నాడు… అదే సమయంలో కాస్త టెన్షన్ కూడా… మంగుళూరులో ఉంటుంది ఆ కుటుంబం… పిల్లాడి పేరు శంతను… తండ్రి పేరు కిషన్ రావు… అబ్బాయి టెన్త్ పరీక్షలు కాగానే కేరళలోని తమ సొంతూరికి వెళ్లిరావాలని అనుకున్నాడు… అక్కడ వాళ్లకు ఓ పాత ఇల్లు కూడా ఉంది… కిషన్‌రావుకు తీసుకుపోయేంత తీరిక లేదు, ఏదో బిజీ… ఏదో ప్రైవేటు ఆటోమొబైల్ కంపెనీలో జనరల్ మేనేజర్ తను.. సరే, నేనొక్కడినే వెళ్తాను అన్నాడు శంతను…
ఏప్రిల్ 19… తెల్లవారుజామున 5 గంటలు… మంగుళూరు సెంట్రల్ స్టేషన్… శంతనును పరుశురాం ఎక్స్‌ప్రెస్ ఎక్కించాడు తండ్రి… అది నేరుగా తనను పిరవోమ్ రోడ్ స్టేషన్‌లో దింపుతుంది… అది ఎర్నాకుళం, కొట్టాయం నడుమ ఉంటుంది… మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుతుంది… అక్కడ దిగిపోతే శంతనును తన కజిన్స్ రిసీవ్ చేసుకుని, వెహికిల్ తీసుకుని ఊరికి వెళ్లిపోవాలి… ఇదీ ప్లాన్… కజిన్స్ కూడా రైలు వచ్చే వేళకు అక్కడ ఉంటాం, భయం లేదు, వచ్చెయ్ అన్నారు… ఇది శంతనుకు ఒంటరిగా తొలి ప్రయాణం…
తండ్రి కిషన్‌రావు, తల్లి సంధ్య ఎందుకైనా మంచిదని ఓ మొబైల్ ఇచ్చి, ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని చెప్పారు గట్టిగా… ఒంటరిగా తొలి ప్రయాణమనే ఉత్కంఠలో ఆ ముందురాత్రి శంతను సరిగ్గా నిద్రపోలేదు కూడా… ఉదయం పది గంటలకు ఆయన ఓసారి ఫోన్ చేశాడు… స్విచ్‌డ్ ఆఫ్… ఆయనకేమీ అర్థం కాలేదు…
Ads
రైలు ఎక్కేటప్పుడు ఫుల్ చార్జింగ్‌తో ఉంది… అప్పుడే డిస్‌చార్జి అయిపోయిందా..? లేక ఇంకేమైనా అయ్యిందా..? ఆయనలో టెన్షన్ పెరిగింది… టీటీఈ నంబర్ తీసుకోవడం మరిచిపోయాడు… తన దగ్గర ఉన్నది కేవలం పీఎన్ఆర్ నంబర్ మాత్రమే… మళ్లీ కాల్ చేశాడు, ప్చ్, ఫలితం లేదు… అరగంట ప్రయత్నించాడు… లాభం లేదు… ఇక టెన్షన్ తట్టుకోలేక ట్విట్టర్ ఓపెన్ చేసి, రైల్వే మినిష్టర్ అశ్విన్ వైష్ణవ్ ట్విట్టర్ వివరాలు చెక్ చేశాడు… అందులోనే పీఎన్ఆర్ నంబర్ పెట్టేసి, ఎస్ఓఎస్ మెసేజ్ ట్వీట్ చేశాడు…
మన వ్యవస్థలో రైల్వే మంత్రి ఓ అబ్బాయి ఫోన్ ఎత్తకపోతే స్పందించాలా..? స్పందిస్తాడా..? ట్రాష్… నవ్వొస్తుంది కదా… కానీ ఒక తండ్రిగా కిషన్‌రావు ఆందోళన అర్థం చేసుకోతగిందే… ఏదో ఒక బాణం… తగిలితే మంచిదే… కానీ వేరే మార్గం ఏమీ లేదు… పోనీ, ట్రెయిన్‌కు ఏమైనా అయ్యిందా..? టీవీల్లో వార్తలు చూడసాగాడు… ఏమీ లేదు… మరేమైంది..?
చీకటి వ్యవస్థల్లో దీపం వెలుతురు వంటి కొన్ని పాజిటివ్ ఉదంతాలు ఇవి… చుట్టూ నెగెటివిటీ దట్టంగా ఆవరించిన రోజులు కదా… మంత్రి స్పందించాడు… అశ్విన్ వైష్ణన్ సంప్రదాయిక రాజకీయవేత్త కాదు… ఓ మాజీ బ్యూరోక్రాట్… కాన్పూర్ ఐఐటీలో ఎంటెక్… 1994 యూపీఎస్సీ 27 ర్యాంకు… ఒడిషా కేడర్ ఐఏఎస్… కొన్నాళ్లు వాజపేయి పీఎంఓలో డిప్యూటీ సెక్రెటరీ… తరువాత కొన్నాళ్లు అమెరికాలో ఇంకా చదువుకుని, ఇండియా వచ్చేసి, కార్పొరేట్ సెక్టార్‌లోకి వెళ్లిపోయాడు… మొదట ఏవేవో కొలువులు, తరువాత గుజరాత్‌లో సొంత యూనిట్లు… మొన్నామధ్య మోడీ రాజ్యసభ సీటు ఇచ్చాడు, ఏకంగా రైల్వే మంత్రిని చేశాడు… అదీ మంత్రి నేపథ్యం…
ఆ మంత్రి ఉదయమే స్పందించాడు… ఆ ఎస్ఎస్ఎస్ సంబంధిత అధికారులకు రీట్వీటయింది… రైల్వే కంట్రోల్ రూం నుంచి పది నిమిషాల్లో కిషన్‌రావుకు ఫోన్… వివరాలు తీసుకున్నారు… ట్రెయిన్ షోర్నూర్ జంక్షన్ చేరుకోగానే రైల్వే పోలీస్ ఫోర్స్‌కు చెందిన నలుగురు జవాన్లు రైల్లోకి ఎక్కారు… శంతను అని పేరు పిలుస్తూ ఆ సీటు నంబరు దగ్గరకు చేరుకున్నారు… తీరా చూస్తే ఆ అబ్బాయి మంచి నిద్రలో ఉన్నాడు… లేపారు… ఒక్కసారిగా పోలీసులను చూసి ఆ పిల్లాడిలో మరింత భయం, ఆందోళన, టెన్షన్… విషయం చెప్పారు తనకు…
ఓ మొబైల్ ఇచ్చి మాట్లాడమన్నారు… తండ్రికి కాల్ చేశాడు ఆ అబ్బాయి… మంత్రికి ట్వీట్ చేసింది 10.34 గంటలకు అయితే కొడుకు నుంచి రిప్లయ్ వచ్చింది 11.08 గంటలకు… ‘‘ఏమైంది బేటా..?’’…. ‘‘బాగా నిద్రొచ్చింది పప్పా… పడుకున్నాను… ఎందుకోమరి ఫోన్ మొత్తం డిస్‌చార్జి అయిపోయింది… సారీ…’’
ఒక అబ్బాయి… రైల్వే భాషలో ఓ ప్రయాణికుడు కాసేపు కమ్యూనికేషన్‌లో లేకపోతే… సంబంధిత బంధువులు ఆందోళనకు గురైతే… మంత్రికి ట్వీట్ చేస్తే… ఏకంగా మంత్రి స్పందిస్తాడా..? ఇండియాలో మొద్దుబారిన వ్యవస్థల్లో ఈ సున్నితత్వం కలా..? నిజమా..? పోనీ, ఎవరెవరో ప్రయాణికులు ఏవేవో సమస్యల్ని ఏకరువు పెడితే మంత్రి అన్నింటికీ స్పందిస్తాడా..? ఈ ప్రశ్నలకు జవాబులు సరళంగా, సంక్షిప్తంగా, సూటిగా కష్టం… కానీ ఒక చిరుదీపం వెలుతురును అభినందిద్దాం..!!
Share this Article