ప్రస్తుతం వివిధ చానెళ్లలో వచ్చే మ్యూజిక్ కాంపిటీషన్ల ప్రోగ్రాములకన్నా… ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ డెఫినిట్‌గా బెటర్… దానికి కారణాల జోలికి ఇక్కడ పోదల్చుకోలేదు… అది వేరే సబ్జెక్టు… ఇప్పుడున్న కంటెస్టెంట్లలో కాస్త బక్కపల్చగా ఉన్న ఓ అమ్మాయి మీద అందరి దృష్టీ ఫోకస్ అవుతోంది… పేరు వాగ్దేవి… ఊరు నెల్లూరు…
అలై పొంగెరా పాడుతుంటే అంతటి థమన్ కూడా నోటమాట లేకుండా అలా వింటూ ఉండిపోయాడు… మంచి గొంతు… ప్లజెంట్ లుక్కు… ప్రత్యేకించి ఏ పాటకైనా భావప్రకటన ముఖ్యం… ఏదో నోటికొచ్చిన సంగతులు, శృతులు, నోట్స్ సరిచూసుకుని పాడితే అందులో లైఫ్ ఉండదు… వాగ్దేవి ఎమోషన్ పలికించగలదు… ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే… ఉంది, ఓ కీలకవిషయం ఉంది… ఇప్పుడు బహుశా 18 ఏళ్ల వయస్సు ఉండొచ్చు… కానీ ఒకసారి ఎనిమిదేళ్ల క్రితం రోజుల్లోకి వెళ్దాం…
జూన్ నుంచి సెప్టెంబరు 2014… ఈటీవీలో ఓ ఫేమస్ షో పాడుతా తీయగా కార్యక్రమం వస్తున్న రోజులవి… అందులో ఓ కంటెస్టెంటు ఈ వాగ్దేవి కూడా… అప్పటికి చిన్న పిల్ల… (అసలు తెలుగులో ఫేమస్ సింగర్స్ అందరూ దాదాపుగా ఆ పాడుతా తీయగా షోలో పాడి పైకొచ్చినవాళ్లే కదా… ఇప్పుడు ఇండియన్ ఐడల్ షోలో ఉన్న సింగర్స్ అదితి భావరాజు, వైష్ణవి, మాన్య చంద్రన్ కూడా పాడుతా తీయగా షోలో ఒకప్పుడు కంటెస్టెంట్స్…) ఓరోజు ప్రజాగాయకుడు గోరటి వెంకన్న గెస్ట్ జడ్జి…
Ads
తను పెద్దగా భేషజాల మధ్య తన చెప్పాల్సిన మాటల్ని దాచుకోడు… ఈ వాగ్దేవి ఖడ్గం సినిమాలో… నువ్వు, నువ్వు అనే పాట ఎంచుకుంది… నో డౌట్… బాగా పాడింది… ఆ పాటలో నిజానికి పైపైన అల్లాటప్పా పదాల్లాగా ఉంటాయి… కానీ లోతుల్లోకి వెళ్తే ఓ శృంగార తాదాత్మ్యత… వెంకన్న తన అభిప్రాయం చెబుతూ… ‘‘చాలా పదాలకు లోతైన అర్థాలుంటయ్, ఉన్నయ్… మీ వయస్సుకు, మీ స్థాయికి వాటి వివరణల జోలికి పోకూడదు, పోలేను ఇక్కడ… అందుకే ఆ భావాల లోతుల్లోకి పోకుండా… నీ గాత్రమాధుర్యంతో మెప్పించినావు…’’ అన్నాడు…
తరువాత బాలు మాట్లాడుతూ… ‘‘పిల్లలకు ఇచ్చే పాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి… సీతారామశాస్త్రి తన స్థాయిని దిగజార్చుకుని జుగుప్స పదాలు ఎప్పుడూ వాడడు… కానీ ఆ సినిమాలో ఆ పాత్ర వేరు… వీళ్ల వయస్సుకు ఆ పాట పదాల మోతాదు ఎక్కువ అవుతుందని చరణాల్లో చాలా లైన్స్ మార్చేశాం… వాళ్ల వయస్సుకు అనకూడని మాటలు ఏమైనా ఉంటే పరిహరించాలనేదే ఉద్దేశం.. ఒరిజినల్ సింగర్స్‌కు ఆ పదాలు వోకే… చాలా పదాల అర్థాలు కూడా లోతైనవే… కానీ పిల్లల నోట అవి వద్దు అనిపించింది…’’ అని వివరించాడు…
అంటే… వెగటు పదాల్ని పిల్లల నోట పలికించకుండా కార్యక్రమాన్ని నడిపించాలనే భావన గొప్పది… ఉదాత్తమైంది… పాట ఏదైనా సరే, అవసరమైతే చరణాల్ని మార్చేసి పాడించారు అని చెప్పడం ఈ కథన ఉద్దేశం… కానీ కొన్ని ప్రోగ్రాముల్లో పిల్లలతో కూడా గ్గుగ్గు గుడిసుంది, మ్మమ్మ మంచముంది పాడించే రోజులివి… డ్రైవర్ రాముడిలా పాయ్ పాయ్ అని కూడా పలికించే దుర్దినాలు… డెఫినిట్‌గా అప్పట్లో పాడుతా తీయగా కొన్ని స్టాండర్డ్స్‌కు కట్టుబడి సాగింది..!! ప్రస్తుతం పాడే పిల్లల కోసం ఆడిషన్స్ జోరుగా సాగుతున్నయ్ తెలుగు రాష్ట్రాల్లో… అందుకే ఈ ప్రస్తావన..!!
Share this Article