సినిమా ప్రమోషన్ తీరూతెన్నూ మారిపోయినయ్… ఒకప్పటి కాలం కాదు ఇది… టీజర్లు, పోస్టర్లు, ట్రెయిలర్లు, ప్రిరిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా క్యాంపెయిన్, ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్స్, పెయిడ్ రివ్యూయర్లు… అసలు కథే మారిపోయింది… ఇది మరీ దిగజారి ప్రాంక్ వీడియోల దాకా వచ్చింది, అది వేరే సంగతి… అఫ్కోర్స్, ప్రస్తుతం రచ్చ అంతా ఆ చీదర వీడియోలతో ప్రమోషన్ ఏమిటనేదే…
కథలో దమ్ముండాలే గానీ… ప్రేక్షకుల్ని కట్టిపడేసే కథాకథనాలు ఉండాలే గానీ… మామూలు ప్రమోషన్ కూడా సరిపోతుందని అని చెప్పడానికి జాతిరత్నాలు, డీజే టిల్లు వంటి చిన్న సినిమాల విజయాలే ఓ పెద్ద ఉదాహరణ… అత్యంత పాపులర్ భారీ తారాగణం ఉన్నా సరే, ప్రేక్షకుడికి నచ్చకపోతే డిజాస్టర్ అవుతుందని చెప్పడానికి ఆచార్య మరో తాజా ఉదాహరణ…
సన్నాఫ్ ఇండియా అత్యంత ఘోర పరాజయానికి కారణం… మోహన్‌బాబు, వాళ్లేమీ ఖర్చు పెట్టింది లేదు, గెస్టులుగా కొందరు ఆర్టిస్టులను పిలిచి ఓరోజు ఫ్రెండ్లీ షూటింగ్ జరిపి, ఇంత కూడుపెట్టి, తరువాత డమ్మీ యాక్టర్లు, వాయిస్ ఓవర్లు, బ్లర్ ఫేసులతో ఆ పాత్రల్ని కొనసాగించి, తెలుగు చిత్రసీమలోనే ఓ పిచ్చి, తిక్క ప్రయోగం చేశారు… ప్రేక్షకుడు విసిరి చెత్తబుట్టలోకి విసిరేశాడు…
Ads
కాసేపు విష్వక్సేనుడిని వదిలేద్దాం… నిజానికి జయమ్మ పంచాయితీ అనే సినిమాకు సీనియర్ యాంకర్ సుమ చేస్తున్న ప్రమోషన్ గురించి చెప్పుకోవాలి ఈ సందర్భంగా… ఏళ్లుగా కొన్ని వేల సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసిన సుమాకు ఇండస్ట్రీలో చాలా మంచి సంబంధాలున్నయ్ అందరితోనూ… నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అన్నట్టుగా… అందరూ ఆమెను ప్రేమిస్తారు…
ఇన్నేళ్లూ రాజీవ్ కనకాల ఆంక్షలతో సినిమా తెర మీద అడుగుపెట్టలేదు సుమ… కాకపోతే నాకే ఇష్టం లేదు అని కవరింగు ఇచ్చుకుంది… ఫాఫం… ఇప్పుడు కాస్త సుమదే పైచేయి కావడంతో తనకు తగిన… అంటే, తన వయస్సు, తన ఇమేజీకి తగిన ఓ విభిన్న పాత్రను ఎంచుకుంది… సినిమా పూర్తయింది… ఆమె ఆ సినిమాలో ఏమైనా డబ్బు పెట్టుబడి పెట్టిందో లేక సుమకు ఊహించనంత డబ్బు ఇచ్చారో తెలియదు గానీ… అంతా తానై విస్తృత ప్రమోషన్ వర్క్ చేస్తోంది ఆమె…
ఆ సినిమా టీంలో కీరవాణి ఒక్కడే అందరికీ తెలిసిన మొహం… తను ఈ చిన్న సినిమా చేయడం విశేషమే… ఇక సుమ తప్ప దర్శకుడు, నిర్మాత, ఇతర నటీనటులు గట్రా ఎవరికీ ఏమీ తెలియదు… అంతా సుమ… అంతే… ప్రతి పాపులర్ హీరోను తన ప్రమోషన్లో భాగం చేసింది సుమ… ప్రతి టీవీషోలోకి అడుగుపెట్టింది… తన క్యాష్ షో మొత్తం ఎపిసోడ్‌ను ఒకటి ప్రమోషన్‌కు అంకితం చేసింది… చిన్నాచితకా యూట్యూబర్లకూ ఇంటర్వ్యూలు…
నిజానికి ఆమె రెగ్యులర్ హీరోయిన్ కాదు, వయస్సులో లేదు, రేప్పొద్దున కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు, అసభ్యతకు ఆమడదూరం, స్టెప్పులు వేయదు, రొమాన్స్ సీన్స్ కుదరవు… ఐతేనేం, ఆ చిన్న సినిమాకు అవసరమైనదానికన్నా చాలా ఎక్కువ ప్రమోషన్ చేసిపెట్టింది సుమ… ఆమె ఎనర్జీ, ఆమె ఎఫర్ట్ మెచ్చుకోదగినవే…
విడిగా చెప్పుకోదగిన మరో అంశం… సర్కారువారి పాట ప్రమోషన్… రోజూ ఓ ప్రెస్ మీట్… ముందుగా టెక్నికల్ టీం… ఫస్ట్, థమన్, తరువాత అనంత శ్రీరాం, నిన్న కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్… మెల్లిగా ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, తరువాత దర్శకుడు, హీరో, హీరోయిన్, వీలయితే నిర్మాత… ఎక్కడా గ్యాప్ రానివ్వని షెడ్యూల్ అన్నమాట… రాసేవాడు రాస్తాడు… (ఐనా ఎందుకు రాయరు..? రకరకాల కారణాలు)… ఈరోజు ఏదో సినిమాకు సంబంధించి ఎడిటర్ ప్రెస్‌మీట్ వచ్చింది… ఈ ధోరణిని రాజమౌళి స్టార్ట్ చేశాడు… ఇప్పుడు అందరూ అందుకున్నారు…
ప్రమోషన్ అంటే అదొక వెగటు వ్యవహారం కాకూడదు… అందుబాటులో ఉన్న ప్రచార మార్గాల్ని వాడుకోవాలి… కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలి… ప్రజలకు ఏవగింపు కలిగే విధానాలు కాదు… అదీ ఇక్కడ చెప్పదలుచుకుంది… సుమను, విష్వక్సేనుడిని పోల్చలేం… పోల్చడమూ తప్పే… కానీ ప్రమోషన్ పద్ధతులపై ఓ డిబేట్‌కు సరైన ఉదాహరణలే వాళ్లు…!!
Share this Article