రెండు పెద్ద దేశాలు… సామ్రాజ్యవాద అమెరికా, నాటో కూటమికి వ్యతిరేకంగా బలంగా నిలబడిన దేశాలు… రెండూ కమ్యూనిస్టు దేశాలే… (పేరుకు)… ఆ రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీల బిడ్డలే మన దేశ కమ్యూనిస్టులు… అసలు అదికాదు… రష్యా అధినేత పుతిన్… చైనా అధినేత జిన్పింగ్… (వాళ్ల హోదాలు ఏమైనా కావచ్చు)… తమ జీవితాంతం కుర్చీ వదలకుండా ఉండేందుకు వీలుగా అక్కడి సొంత పార్టీల నియమావళిని మార్చిపారేశారు… కానీ కాలం చాలామందిని చూసింది… ఇప్పుడు ఆ ఇద్దరూ తీవ్ర అస్వస్థతతో కొట్టుమిట్టాడుతున్నారు… మిత్రుడు పార్ధసారధి పోట్లూరి కథనం ఇదీ…
ఒకే సమయంలో ఇద్దరు అగ్ర రాజ్యాధినేతల తీవ్ర అస్వస్థత ! రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పొత్తికడుపు కాన్సర్ మరియు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాడు! ఆపరేషన్ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పారు. చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ మెదడులో రక్త నాళాలు గడ్డకట్టినట్లు [cerebral aneurysm ] తెలుస్తున్నది.
చాలా కాలంగా పుతిన్ కాన్సర్ తో బాధపడుతున్నాడు కానీ విషయం చాలా రహస్యంగా ఉంచారు. వారం క్రితం పాశ్చత్య మీడియా ఈ విషయాన్ని వెల్లడించినా అప్పట్లో అది ప్రచారం అని భావించారు… కానీ విశ్వసనీయ వార్తాకథనాల ప్రకారం అది నిజమేనట. పుతిన్ కనీసం 15 రోజుల పాటు పాలనకి దూరంగా ఉండాలి అని వ్యక్తిగత వైద్యులు గట్టిగా చెప్పడంతో, ఇక తప్పనిసరై పరిపాలన బాధ్యతలని తన ముఖ్య అనుచరుడికి అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
Ads
Nikolai Patrushev- నికోలాయ్ పత్రుషేవ్ !
నికోలాయ్ పత్రుషేవ్ రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు. పుతిన్ కి అత్యంత సన్నిహితుడు నికోలాయ్ పత్రుషేవ్ ! పూర్వపు సోవియట్ యూనియన్ లోని గూఢచార సంస్థ KGB లో పనిచేశాడు తరువాతి కాలంలో రష్యా సీక్రెట్ సర్వీస్ అయిన FSB లో అత్యున్నత అధికారిగా పనిచేశాడు. అందుకే పుతిన్ కి సన్నిహితుడు అవగలగాడు. నిజానికి రెండు వారాల క్రితమే పుతిన్ వ్యక్తిగత డాక్టర్లు ఆపరేషన్ కోసం ఒత్తిడి తెచ్చారు కానీ పుతిన్ ప్రస్తుతం ఉక్రెయిన్ మీద దృష్టిపెట్టడం అత్యవసరం అని భావించి ఆపరేషన్ వాయిదా వేస్తూ వచ్చాడు. అయితే వారం క్రితం పుతిన్ నికోలాయ్ పెత్రుషేవ్ తో దాదాపుగా రెండు గంటలపాటు సమావేశం అయ్యాడు. ఒకవేళ ఆపరేషన్ విజయవంతం కాకపోతే , తనకేదయినా జరిగితే రష్యా అధ్యక్ష పగ్గాలు చేపట్టవలసినదిగా పెత్రుషేవ్ ని కోరినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రష్యా తదుపరి అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోయింది.
రష్యా సీక్రెట్ సర్వీస్ లో అత్యున్నత అధికారిగా పనిచేసి, ఆపై దేశం వదిలిపెట్టి పారిపోయిన మాజీ అధికారి ఈ విషయాన్ని బయటపెట్టాడు కానీ తన పేరు వెల్లడించడానికి నిరాకరించాడు ! ఈ మాజీ రష్యన్ సీక్రెట్ సర్వీస్ అధికారి చెప్తున్న దాని ప్రకారం వ్లాదిమిర్ పుతిన్ కంటే నికోలాయ్ పెత్రుషేవ్ చాలా ప్రమాదకారి ! పుతిన్ అన్నా ఏదన్నా కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తాడేమో కానీ నికోలాయ్ పెత్రుషేవ్ మాత్రం ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని ఎవరు వ్యతిరేకించినా అమలు చేసి తీరుతాడు అనే వార్త ప్రచారంలో ఉంది. ఉక్రెయిన్ లో అమెరికా, యూరోపియన్ దేశాలు నియో నాజీలని పెంచి పోషిస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఈ మాజీ గూఢచారి !
పుతిన్ కి పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నట్లు ఇటీవలే బయటపడ్డది! ఒక సమావేశంలో మాట్లాడుతూ పుతిన్ ఏం మాట్లాడాలో మర్చిపోవడం, కొద్ది సేపటి తరువాత దానిని మళ్ళీ చెప్పడానికి ప్రయత్నించడం, అది కుదరక వేరే విషయంలో వెళ్ళిపోవడం జరిగినది. రష్యాలోని అత్యున్నత అధికార సమావేశంలో ఈ సంఘటన జరిగినది! కానీ విషయం గురించి మాట్లాడే ధైర్యం చేయలేదు ఎవరూ !
ఒకవేళ ఆపరేషన్ జరిగిన తరువాత పుతిన్ కొలుకున్నా పార్కిన్సన్స్ వ్యాధి వల్ల చురుకుగా ఉండలేడు ! పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడే వారు చురుకుగా ఉండలేరు. చేతులు వణకడం, వేళ్ళు వణకడం, నడకలో వేగం తప్పడంతో పాటు తరుచూ మాట తడబడడం లాంటి లక్షణాలు ఉంటాయి. వ్రాయడం కూడా తడబడుతూ వ్రాస్తారు చేతి వేళ్ళు వణకడం వలన. అందువలన ఒకసారి ఆపరేషన్ అయినా పుతిన్ మళ్ళీ అధ్యక్ష పగ్గాలు చేపట్టలేక పోవచ్చు. పుతిన్ ఆపరేషన్ కి వెళ్ళిన మరుక్షణం నికోలాయ్ పెత్రుషేవ్ అధ్యక్షుడు అవడం తధ్యం !
నికోలాయ్ పెత్రుషేవ్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత ఉక్రెయిన్ విషయంలో కావొచ్చు మరియు యూరోపియన్ యూనియన్ విషయంలో కావచ్చు, కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉక్రెయిన్ లో ప్రస్తుత రష్యన్ దళాల వైఫల్యం కేవలం పుతిన్ అనారోగ్యం వలనే అని భావించవచ్చు.
నికోలాయ్ పెత్రుషేవ్ కి ఉక్రెయిన్ సమస్య ఒక్కటే కాదు… ముందు దాని కంటే మరో పెద్ద సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ లో స్పెషల్ మిలటరీ ఆపరేషన్ మొదలు పెట్టిన ఫిబ్రవరి 24 నుండి ఇప్పటి వరకు దాదాపుగా ఒక లక్షా యాభై వేల మంది రష్యన్ పౌరులు రష్యాని వదిలి అమెరికా, యూరోపు దేశాలకి వెళ్లిపోయారు.
రష్యా వదిలి వెళ్ళిన లక్షా 50 వేల మందిలో దాదాపుగా 20 వేల మంది అత్యున్నత విద్యార్హత ఉన్నవారే ! స్టెమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడిసిన్, రసాయన శాస్త్రాల్లో పరిశోధన చేస్తున్న వారే ! అమెరికా , యూరోపు దేశాలు విధించిన కఠిన ఆంక్షల వల్ల రష్యాలో తమ అర్హతకి తగ్గ ఉద్యోగం, దానితో పాటు వేతనం దక్కట్లేదు అంటూ రష్యా ని విడిచి వెళ్లిపోయారు. వీళ్లలో 20 ఏళ్ల అనుభవం ఉన్నవారూ ఉన్నారు. అంటే ప్రస్తుతం రష్యాకి అత్యున్నత విద్యార్హతలు ఉన్నవాళ్ళ కొరత ఉంది వీళ్ళు వెళ్ళిపోవడంతో ! ఇప్పటికే నిధుల లేమితో బాధపడుతున్న రష్యన్ డిఫెన్స్ సెక్టార్లు తమ దేశ పౌరులు అడిగినంత వేతనం చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. అందుకే మేధోవలస జరిగినది ఇంకా జరుగుతూనే ఉంది. నికోలాయ్ పెత్రుషేవ్ కి విజయం అంత తొందరగా లభించడం కష్టమే !
ఇక జింగ్పింగ్ కి మెదడులోని రక్త నాళాలలో రక్తం గడ్డకట్టి చాలా చిన్న చిన్న బ్లడ్ బ్లాకులు ఏర్పడినట్లు తెలుస్తున్నది. అయితే కోవిడ్ వాక్సిన్ కొత్తగా అందుబాటులో వచ్చినప్పుడు కూడా స్వీడన్, నార్వే, దేశాలలో మొదట్లో ఇలాంటి మెదడులో రక్తనాళాలో రక్తం గడ్డ కట్టి కోవిడ్ రోగులు మరణించిన సంగతి తెలిసిందే ! బహుశా కోవిడ్ వాక్సిన్ తీసుకున్న జింగ్పింగ్ కి కూడా వాక్సిన్ దుష్ఫలితాలు చూపించి ఉండవచ్చు !
ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్, అటు చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ ఇద్దరూ జీవిత కాల అధ్యక్షులుగా ఉన్నవారే కావడం, అదే సమయంలో ఇద్దరికీ ఒకేసారి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడం అనేదే ఇప్పుడు చర్చనీయాంశం ! ఇటు రష్యాలో అటు చైనాలో అధ్యక్షులు మారితే మాత్రం ప్రపంచ రాజకీయాలలో పెను మార్పులకి కారణం అవుతుంది. కాలం కంటే బలమయినది ఏదీ లేదు ఉండబోదు ! కాలమే నేనయి ఉన్నాను అని కదా అన్నది శ్రీ కృష్ణ పరమాత్మ !
Share this Article