పార్ధసారధి పోట్లూరి ……. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని పెట్రోల్,డీజిల్, వంట నూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు గోధుమల వంతు రాబోతున్నది! ప్రపంచవ్యాప్తంగా గోధుమల దిగుబడులు ఘోరంగా పడిపోబోతున్నాయి. ఉదాహరణకి ప్రపంచం మొత్తం ఒక పంటకి సాధారణంగా 100 కిలోల ఉత్పత్తి అవుతుంది అనుకుంటే ఈసారి 60 కిలోల ఉత్పత్తి మాత్రమే అవబోతున్నది అంటే 40% శాతం దిగుబడి తగ్గబోతున్నది అన్నమాట.
గోధుమ పంట దిగుబడి ఇంతలా పడిపోవడానికి కారణం ఏమిటి ?
విపరీతమయిన వాతావరణ మార్పులే అసలు కారణం. చల్లగా ఉండాల్సిన చోట వేడిగా ఉండడం, వేడిగా ఉండాల్సిన చోట చల్లగా ఉండడమే గోధుమ దిగుబడి తగ్గడానికి కారణం అవుతున్నది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో పొద్దు తిరుగుడు పంట నాశనం అవగా మరోవైపు గోధుమ పంట కూడా బయటికి తీసే పరిస్థితి లేదు అక్కడ. చాలా వరకు పంట మొత్తం యుద్ధ టాంకుల వల్ల నాశనం అవగా మిగిలిన పంటని పొలం నుండి బయటికి తీసి, వాటిని శుభ్రపరిచి రవాణా చేయడానికి మనుషులు లేరు. మనుషులు ఉన్న చోట్ల ఎటు వైపు నుండి బాంబులు వచ్చి మీద పడతాయేమో అనే భయం వల్ల వాటి వైపు ఎవరూ వెళ్లకపోవడం వల్ల పంట మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు తమకి గోధుమలు ఎవరు సరఫరా చేస్తారా అని ఎదురు చూస్తున్నది ఉక్రెయిన్. యుద్ధానికి ముందు ఉక్రెయిన్ గోధుమ ఎగుమతి చేయగల స్థితిలో ఉండేది.
Ads
1. అమెరికా, ఫ్రాన్స్ , భారత్, యూరోపు… ఇలా ఎక్కడ చూసినా గోధుమ పంట దిగుబడులు భారీగా పడిపోయాయి.
2. ఒక్క రష్యాలో మాత్రం ఎలాంటి వాతావరణ మార్పులు లేకపోవడం వలన అక్కడ గోధుమ దిగుబడి వెనకటి సంవత్సరం కంటే ఎక్కువే వచ్చింది ఈసారి. రష్యా గోధుమలకి డిమాండ్ విపరీతంగా ఉండబోతున్నది. చూడాలి ! రష్యన్ రూబుల్ రూపంలో చెల్లింపులు చేస్తేనే ఎక్కువ ధరకి గోధుమలు ఎగుమతి చేస్తామని పుతిన్ డిమాండ్ చేసే రోజు దగ్గరలోనే ఉంది.
3. బ్లూమ్ బర్గ్ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అనుకూలించని కారణంగా దాదాపుగా గోధుమ పంట పండే అన్ని దేశాలలో కూడా దిగుబడి గణనీయంగా పడిపోయింది అని. దీని వల్ల రాబోవు రోజుల్లో గోధుమల సరఫరాలో అంతరాయం ఏర్పడి ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉన్నది అంటూ బ్లూమ్ బర్గ్ హెచ్చరిస్తున్నది.
4. ఆఫ్రికా నుండి అమెరికా దాకా, యూరోపు నుండి ఆసియా దాకా అన్ని చోట్లా గోధుమ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
5. రాబోయే రోజుల్లో మన దేశంలో కిలో గోధుమ పిండి ధర 100/- రూపాయలకి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.
యూరోపియన్ యూనియన్ లో :
ఉన్నట్లుండి వాతావరణం వేడి ఎక్కి పొడిగా మారడం వలన గోధుమ పంట దిగుబడిలో విపరీతమయిన లోటు ఏర్పడింది. మరో వైపు యూరోపులో వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల దిగుబడి పడిపోయింది. ఫ్రాన్స్ లో అయితే గోధుమ దిగుబడి సగానికి పడిపోవచ్చని అంచనా వేశారు. ఈ నెల ఆఖరులోగా వర్షాలు పడకపోతే మాత్రం దిగుబడి ఇంకా తగ్గే అవకాశం ఉంది.
అమెరికా :
సెంట్రల్ అమెరికాలోని మైదాన ప్రాంతాలలో దిగుబడి పడిపోయినట్లు గుర్తించారు. ముఖ్యంగా కాన్సాస్ ప్రాంతంలో ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది కానీ ఈసారి అది 20 క్వింటాళ్లుగా ఉండవచ్చని ఇన్స్యూరెన్స్ ప్రతినిధులు ఒక నివేదిక ఇచ్చారు. అయితే మిస్సీసిపి నదికి పశ్చిమాన వర్షాలు పడితేనే పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఆ సూచనలు కనపడట్లేదు. అమెరికా కూడా గోధుమలని ఎగుమతి చేస్తుంటుంది… కానీ ఈసారి తమ దేశంలో బ్రెడ్ ధరలు పెరగకుండా చూడడానికి ఎగుమతులు చేయకపోవచ్చు దాంతో ఇతర దేశాలు గోధుమ కొరతని ఎదుర్కోబోతున్నాయి.
కెనడా :
కెనడా కూడా గోధుమలని ఎగుమతి చేస్తుంటుంది కానీ ఈసారి దిగుబడులు తగ్గాయి కాబట్టి ఎగుమతి చేసే స్థితిలో ఉండదు. కెనడా నుండి దిగుమతి చేసుకునే దేశాలు గోధుమ కొరతని ఎదుర్కోబోతున్నాయి. ప్రస్తుతం కెనడాలో గోధుమ పంట వేయడానికి కూడా వాతావరణం అనుకూలంగా లేదని అంటున్నారు… అంటే రెండో పంట కూడా దెబ్బతినే అవకాశం ఉండబోతున్నది అన్నమాట. కెనడాలోని సౌత్ అలబ్రేట్టా ప్రాంతం ప్రస్తుతం కరువు లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
భారత్ :
1901 వ సంవత్సరం తరువాత ఉత్తర భారతంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎంతలా పెరిగాయి అంటే గత మార్చి నెలలో వడగాడ్పులు వీచి గోధుమ పంటకి బాగా నష్టం వాటిల్ల చేశాయి. దాంతో గోధుమ దిగుబడి 10% నుండి కొన్నిచోట్ల 50% కి పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఈసారి గోధుమ దిగుబడి దాదాపుగా 105 మిలియన్ టన్నులు ఉండవచ్చు అని అంచనా వేసింది… కానీ గోధుమలని కొనే ట్రేడర్లు మాత్రం ఇంకా తక్కువగానే ఉంటుంది అని చెప్తున్నారు. గత సంవత్సరం గోధుమ దిగుబడి 111 మిలియన్ టన్నులుగా నమోదు అయ్యింది. అంటే 6 మిలియన్ టన్నుల లోటు కేంద్ర ప్రభుత్వపు అంచనా ప్రకారం ఉండబోతున్నది. గోధుమ ధర పెరగకుండా ఉండాలి అంటే FCI గోదాములలో మూలుగుతున్న గోధుమలని బహిరంగ మార్కెట్ లోకి తీసుకురావాల్సి ఉంటుంది… అప్పుడే మన దేశంలో గోధుమ ధర పెరగకుండా ఉంటుంది. కానీ ఇప్పటికీ ఎగుమతి ఆర్డర్లు తీసుకున్న వాటిని ఎగుమతి చేస్తారా ? లేక రద్దు చేస్తారా ? ఒకవేళ రద్దు చేస్తే ముందస్తుగా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అదీ డాలర్ల రూపంలో.
చైనా :
గత కొన్ని సంవత్సరాలుగా ఇతర దేశాల నుండి గోధుమలు దిగుమతి చేసుకోకుండా తమ దేశంలోనే పండించుకుంటూ వస్తున్నది…. కానీ ఈసారి శీతాకాలపు గోధుమ పంట అకాల వర్షాలకి మునిగి పోయింది. దాంతో దిగుబడి తగ్గింది. కాబట్టి ఈ సంవత్సరం దిగుమతి చేసుకోవాల్సిందే. కానీ రష్యా అండగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు…
మొత్తంగా చూస్తే రష్యా, ఉక్రెయిన్ లు వాతావరణపరంగా అనుకూలంగా ఉండి మంచి దిగుబడులు వచ్చాయి… కానీ ఉక్రెయిన్ లో పరిస్థితులు బాగా లేనందున పంట పొలాలోనే ఉండిపోయింది. ఇక రష్యా మాత్రమే ప్రపంచానికి గోధుమలు ఎగుమతి చేయగల పటిష్ట స్థితిలో ఉంది.
సన్ ఫ్లవర్ ఆయిల్ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇండోనేషియా, మలేషియా దేశాలు పామాయిల్ ఎగుమతుల మీద నిషేధం విధించాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకునే కంటే పామాయిల్ ని దాని స్థానంలో వినియోగించుకోవాలని భావించడమే నిషేధానికి కారణం. దాంతో మన దేశానికి పామాయిల్ కొరత కూడా తోడవబోతున్నది. పామాయిల్ స్థానంలో సన్ ఫ్లవర్ ఆయిల్ వినియోగం పెరిగితే దాని ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కోవిడ్ వల్ల జరిగిన నష్టంతో పాటు ఇప్పుడు యుద్ధం వలన మరియు వాతావరణ మార్పుల వలన ఇంకా నష్టం జరుగుతున్నది….
Share this Article