డబ్బులు పిండుకునే కళలో రాజమౌళి సిద్ధహస్తుడు… కొత్త కొత్త మార్కెటింగ్ ఎత్తుగడల్ని ప్రయోగించి, బాహుబలిని ఆ 2 వేల కోట్ల రేంజుకు తీసుకుపోయాడు… ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతకుమించి పిండుకోవాలని తహతహలాడుతున్నాడు… అందుకే ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా సినిమాకు ‘టికెట్లు’ అమ్మే కొత్త ప్రయోగానికి సిద్ధపడ్డాడు… కాస్త వివరంగా చెప్పుకుందాం…
కరోనా అనంతరం ప్రేక్షకులు మరీ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు తప్ప, ఇతరత్రా సినిమాల కోసం థియేటర్ల దాకా పోవడం లేదు… టీవీలో లేదా ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు… అలాగే అడ్జస్ట్ అవుతున్నారు కూడా… థియేటర్ వెళ్లి సినిమా చూడటం నిజంగానే ఓ శాపం… ఆ రేట్లు, పార్కింగ్, క్యాంటీన్, అక్కడికి వెళ్లేవరకు పొల్యూషన్, పెట్రోల్ ఖర్చు… మన ‘సినిమాల’ కోసం అంత వ్యయప్రయాసలు, తల్నొప్పి అవసరమా..?
ఆర్ఆర్ఆర్ నిర్మాణవ్యయం పేరుకు 350 కోట్లు అని చెబుతున్నా అది పెద్ద హంబగ్ అని అందరికీ తెలుసు… వాడినవి మామూలు గ్రాఫిక్సే… అదేమీ అవతార్ కాదు… కేజీఎఫ్ వ్యయం 100 కోట్లు… సర్కారువారిపాట 65 కోట్లు అట… మరి ఈ 350 కోట్ల మాటేమిటి..? సరే, అలాంటి కథలన్నీ రాజమౌళికి అలవాటే గానీ… ఆర్ఆర్ఆర్ ఓటీటీలో వస్తోందని తెలియగానే ఆనందపడిన ప్రేక్షకులు కాస్తా రాజమౌళి కొత్త ‘డబ్బు పిండుడు’ స్కీమ్‌తో ఒక్కసారిగా హతాశులవుతున్నారు…
Ads
మామూలుగా మనకు తెలిసిందేమిటి..? మనం ఓటీటీకి వార్షిక చందాలు కడుతున్నాం… సో, ఫ్రీగా కంటెంటు ఆశిస్తాం… కానీ ఇక్కడ కూడా రాజమౌళి ‘చార్జి’ ఫిక్స్ చేశాడు… అంటే ఉచిత ప్రదర్శన కాదు… జీ5 చందా ప్లస్ ఆర్ఆర్ఆర్ టికెటు ధర కలిపి ఆరొందల రూపాయలు అట… అవి కడితేనే ఆ సినిమా చూడగలరు… లేకపోతే లేదు… అంటే నథింగ్ బట్ టికెట్ ఎట్ ఓటీటీ థియేటర్…
నిజానికి ఇది కొత్తేమీ కాదు… సల్మాన్ ఖాన్ నటించిన రాధే మూవీ థియేటర్లలో అట్టర్ ఫ్లాప్… కానీ సేమ్, ఇలాగే ‘‘పే పర్ వ్యూ’’ పద్ధతిలో ఓటీటీలో రిలీజ్ చేస్తే నాలుగు డబ్బులొచ్చాయి… శాటిలైట్ డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నవాళ్లకు ఈ ‘వీడియో ఆన్ డిమాండ్’’ పద్ధతి తెలిసిందే… డబ్బులు కట్టు, సినిమా చూడు… అంతే… వర్మ కూడా ఒకటీరెండు సినిమాలు ఇలా రిలీజ్ చేశాడు… అయితే ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి…
- టీవీ, ఓటీటీలకు సంబంధించి మన ఇండియన్ ఆడియెన్స్ ఫ్రీ కంటెంట్‌కు అలవాటు పడ్డారు… జీ5 వార్షికచందా ప్లస్ ఆర్ఆర్ఆర్ ఛార్జి కలిపి 699 రూపాయల ధర ఖరారు చేశారు… ఒరిజినల్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు 599 తీసేస్తే, ఆర్ఆర్ఆర్ కోసం 100 చెల్లించాలా..?
- కేవలం వంద కడితే చాలదు, జీ5 సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలి… జీ5 రీచ్ చాలా తక్కువ… వేరే ఇంట్రస్టింగ్ కంటెంట్ కూడా దొరకదు, మరి ఆర్ఆర్ఆర్ కోసం ఆ ఓటీటీని ఎందుకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలి ప్రేక్షకుడు..?
- ఆర్ఆర్ఆర్ ప్రధానంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా… డోల్బీ సౌండ్, బిగ్ స్క్రీన్, పిక్చర్ క్వాలిటీల కోసం…
- ఓటీటీ కంటెంట్ చూసేవాళ్లలో 90 శాతం మొబైల్ వీక్షకులే… సో, 4కే రెజల్యూషన్ అయినా 8కే రెజల్యూషన్ అయినా ఒకటే… వర్మ డేంజరస్ సినిమాకూ ఆర్ఆర్ఆర్‌కూ క్వాలిటీలో తేడా కనిపించదు… ప్రత్యేకించి బీజీఎం మిస్సవుతారు ఓటీటీ ప్రేక్షకులు…
- ఆల్‌రెడీ ఆర్ఆర్ఆర్ థియేటర్లలో బాగా నడిచింది… అడ్డగోలుగా జేబులు ఖాళీ చేసుకున్నారు… ఓటీటీల్లో చూసేవాళ్లు ఎందరు మిగిలారు అనేదే పెద్ద ప్రశ్న… మిగిలినవాళ్లు టీవీల్లో వచ్చేటప్పుడైనా చూస్తారు, నిరీక్షిస్తారు అంటే అంతగా ఎగబడే రకం కాదు…
- సో, వారం పదిరోజులు ఈ ఛార్జి సిస్టం పెట్టి, తరువాత ఫ్రీగా జీ5 చందాదారులు చూడటానికి అవకాశం కల్పిస్తారేమో… ఐనా ప్రైమ్ వంటి ఓటీటీలతో పోలిస్తే వాళ్ల సంఖ్య కూడా తక్కువే… ఫలితం చూడాలిక..!!
Share this Article