Bharadwaja Rangavajhala……… హమ్మా అను ఈ కథ పునః ప్రసారం
హమ్మా … ఛెప్పమ్మా … నాన్నను కిరాతకంగా హతమార్చింది ఆ పరంధామయ్యేనా హమ్మా … ఛెఫమ్మా ఛెప్పూ …
అని సునామీలా తనను పట్టుకుని ఊపేస్తున్న కొడుకు పాత్రధారిని తట్టుకుని ఎన్ని సినిమాలు చేసిందో ఈవిడ లెక్కలేదు …
Ads
ఈ సినిమాలో మీరు ఆయన తల్లి కాదు అంటే హమ్మయ్య అనుకునేలోపే…
డైరక్టర్ ఆయా కారక్టరు…అనేసేవారు.
ఏమిటీ నేను ఆయనకు ఆయానా?
అనుకునే లోపు షూటింగ్…
ఆయా … చెప్పు ఆయా … నా తల్లిదండ్రుల్ని కిరాతకంగా హతమార్చింది ఆ పరంధామయ్యేనా ఆయా …
ఏ పాత్రైనా ఎమోషనల్ సునామీ తప్పదనుకునేసి నటించేసిన ఆ నటి పేరు పండరీబాయి పాపం ..
ఆ సునామీ ఎమోషనల్ నటుడెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆయననే కాదు ..
ఎందరో హీరోలకు ఆవిడే తల్లి… లేకపోతే
పుష్పలత అనే మరో అమాయకురాలు ఆ పాత్రలో బలైపోయేది పాపం …
1930 లో పుట్టిన పండరీబాయి గారి తండ్రి రంగారావు ఆర్టిస్టు.
మంగుళూరులో బొమ్మలు వేసేవారు.
అలాగే ఫొటోల ఎన్లార్జిమెంట్లు కూడా చేసేవారు.
ఇలా చేసేవాళ్లకి అప్పట్లో బోల్డు గిరాకీ ఉండేది … బెజవాడలో బ్లాక్ అండ్ వైట్ ప్రసాద్ గారు అంటే చాలా ఫేమస్ …
ఆయనకు ఓ పాత చెదలు పట్టేసిన ఫొటోగానీ ఎక్కడో పేపర్లో పడ్డ ఫొటో ఇవ్వండి …
ఒక చిన్న నమూనా చూపిస్తే చాలు ఆ ఫొటోలో ఉన్నవాళ్లు స్లిప్పిచ్చి వెళ్లి వందేళ్లైనా ఇందాకే వచ్చి దిగి వెళ్లారు అన్నంత గొప్పగా పెద్ద సైజు ఫొటో ఒకటి రడీ చేసి ఇస్తారు.
సిలార్ అనే ఆయన కూడా ఈ పన్లో బిజీగా ఉండేవాడు.
ఈ గోల పక్కన పెడితే …
పండరీబాయిగారి ఫాదర్ ఇలా బొమ్మలు వేయడం ఫొటోలు ఎన్లార్జిమెంట్లు చేయడం చేస్తూ ఉండేవారు. మదర్ టీచరు.
ఈ రంగారావు గారు ఈ బొమ్మల వ్యాపకంతో పాటు హరికథలు చెప్పడం నాటకాలు వేయడం కూడా చేసేవారట.
పండరీబాయ్ గారు రంగారావుగారి పెద్దమ్మాయి.
ఈ అమ్మాయికి తండ్రి చెప్పే హరికథలు విపరీతంగా నచ్చేసి తనకూ నేర్పమనడం …
నేర్చేసుకోడంతో పాటు టెంత్ క్లాస్ కు వచ్చేసరికి .. కన్నడ మరాఠాలలో హరికథలు చెప్పే రేంజ్ కు ఎదిగింది.
ఆ రోజుల్లోనే మైసూరులో ఆవిడకు సన్మానం చేసి కీర్తన కోకిల బిరుదు కూడా ఇచ్చేశారు.
ఇలా నడుస్తుండగా కుటుంబం నెమ్మదిగా మైసూరుకు షిఫ్ట్ అవడం జరిగింది.
పండరీబాయ్ అన్నగారు విమలానందదాస్ అప్పటికే పాపులర్ నటుడు.
ఆయన తండ్రికి తెలియకుండా చెల్లెలిని తీసుకెళ్లి గౌతమబుద్ద నాటకంలో యశోధరగా నటింపచేశారు. అలా స్టేజ్ మీద నటించడం కూడా ప్రారంభించింది పండరీబాయి .
ఈ నాటకాలు చూసిన కన్నడ నట నిర్మాత హిరణ్యయ్య తను తీయబోతున్న వాణి అనే సినిమాలో కారక్టర్ ఆఫర్ చేశారు.
సంగీత ప్రధాన చిత్రంగా రూపుదిద్దుకున్న వాణి బాక్సాఫీసు దగ్గర భారీగా దెబ్బతిన్నది.
దీంతో పండరీబాయ్ తిరిగి హరికథలు చెప్పుకోడం మొదలుపెట్టేసింది.
ఆ తర్వాత చేసిన సినిమా ప్రయత్నాలు కూడా కలసిరాలేదు.
భక్త కుంబారాలో నటించింది … ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
సినిమా హిట్టైతేనే కదా హీరోయిన్నుకు ఆఫర్లు వచ్చేదీ …
అయినప్పటికీ ఎవీఎమ్ము వారి కళ్లల్లో పడింది ఈవిడ.
రెండేళ్లు కాంట్రాక్ట్ మీద సంతకం చేయించుకున్నారు. ఆ రెండేళ్లల్లో ఒక్కటే సినిమా చేయించుకున్నారు వారు.
అదీ తన్నేసింది.
దీంతో మనకు తెరయోగం లేదని ఫిక్స్ అయిపోయిందావిడ.
1951 వరకు సినిమాలు పెద్దగా కల్సిరాలేదు. మధ్యలో రాజా విక్రమ, మర్మయోగి లాంటి సినిమాలు చేసినా తనకు ఉపయోగపడలేదు అవి.
జీవితం హిందీ వర్షన్ బహార్ తో ఆవిడ దశ తిరిగింది. ఆ తర్వాత వరస అవకాశాలు వెల్లువెత్తాయ్ …
అలా మొదలైన సినీనట జీవితం…
తెలుగు తమిళ కన్నడ సినిమాలతో వర్ధిల్లింది.
ఆ తర్వాత రాజ్ కుమార్ , ఎమ్జీఆర్, శివాజీ గణేశన్ ల సరసన హీరోయిన్ గా చేసింది .
తెలుగులో వదినె సినిమాతో పాటు కన్నడ కాళహస్తీశ్వర మహత్మ్యమ్ ,
తెలుగు గుమస్తా లాంటి సినిమాలతో మొదలైనా హీరోయిన్ ఆఫర్లు పెద్దగా రాలేదు.
మాతృభాష కొంకణి అయినా కన్నడ తమిళ తెలుగు హిందీ భాషలు చక్కగా మాట్లాడేసేది ఆవిడ.
దీంతో డబ్బింగ్ అవసరం లేకపోయేది.
మనవాళ్లు కారక్టర్ రోల్సే ఎక్కువ ఆఫర్ చేశారు. డెబ్బై దశకానికి తను నెమ్మదిగా కృష్ణ లాంటి హీరోలకు తల్లిగా నటించడం ప్రారంభించింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ తల్లి పాత్రల ఆఫర్లూ రావడం మొదలైంది.
ముఖ్యంగా ఎన్టీఆర్ ను కొత్త తరహాలో చూపించాలనుకున్న బాపయ్య, రాఘవేంద్రరావులు అన్నగారి తల్లి పాత్రలు అంజలీదేవి , శాంతకుమారి లాంటి వాళ్లతో వేయించడం తప్పు అని నిర్ణయించుకున్నారు.
ఎట్రాక్టివ్ మదర్స్ అవసరం పడింది అప్పుడు … సరిగ్గా ఆ సమయంలో పండరీబాయి గారితో పాటు పుష్పలత కూడా అంది వచ్చిన అదృష్టంగా వచ్చారు. 64 లో లక్స్ సబ్బు మోడల్ గా కనిపించిన పుష్పలత కూడా ఎన్టీఆర్ తో హమ్మా అనిపించుకోకతప్పలేదు. ఆ అదృష్టం లక్ష్మికి కూడా పట్టిందనుకోండి అది వేరు విషయం …
నాకెందుకో జయప్రద, శ్రీదేవిలను కూడా అన్నగారు హమ్మా అంటున్నట్టు పీడకలలు వచ్చేవి అప్పుడప్పుడూ …
మళ్లీ ట్రాకు తప్పుతున్నా …
పండరీబాయిగారితో పోలిస్తే పుష్పలత యంగే. ఆవిడ తెలుగులో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా కూడా నటించారు పాపం.
రాము సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించారావిడ. అదే ఆవిడ తొలి తెలుగు చిత్రం అనుకుంటా …
కానీ పాపం హమ్మా అయిపోయారు చివరి రోజుల్లో …
పండరీబాయ్ గారు మాత్రం 2003 లో డెబ్బై మూడేళ్ల వయసులో కన్నుమూశారు.
రాత్రి ఊసుపోక గజదొంగ సినిమా చూశాను … అందులో వీరిద్దరూ ఎన్టీఆర్ ను పెంచి పెద్ద చేస్తారు పాపం .
అప్పుడు గుర్తొచ్చి వీళ్ల గురించి రాయాలనిపించింది. అదండీ విషయం ఉంటాను మరి … హమ్మా …
Share this Article