సాక్షి భాషలో చెప్పాలంటే క్రిస్మస్ స్టార్… ఈనాడు భాషలో చెప్పాలంటే మహా సంయోగం… ఆంధ్రప్రభ భాషలో చెప్పాలంటే మహా కలయిక… ఇలా రకరకాల మీడియా సంస్థలు వాటి జ్ఞానపరిధులను బట్టి హెడ్డింగులు పెట్టుకున్నాయి… అదేనండీ… ధర్మప్రభువైన గురుడు, ఖర్మప్రభువైన శని 470 ఏళ్ల తరువాత కలుస్తున్నాయట… అద్భుతం, అమోఘం, అసాధారణం, ఆశ్చర్యం అంటూ మస్తు గీకిపడేశాయి పత్రికలు… రిపబ్లిక్ టీవీ వాడయితే ఏకంగా 800 సంవత్సరాల తరువాత ఇదే మళ్లీ అంటూ రాసిపారేశాడు… హహహ…
ఇంగ్లిషులో great conjunction అంటారు కదా దీన్ని… Conjunction అంటే డిక్షనరీలో గానీ, గూగుల్ మార్క్ అనువాదాల్లో గానీ సంయోగం అని అర్థం… కలయిక… దాన్ని అదే అర్థంలో తీసుకుని ఆ గ్రహాలు నిజంగానే ఆ స్పేస్లో రెండూ ఒకదానితో మరొకటి కలిసిపోతున్నట్టుగా రాశారు… కానీ ఇదొక అబ్సర్డిటీ… అలా కలిసినట్టు కనిపిస్తాయి తప్ప… వాటి మధ్య కొన్నికోట్ల మైళ్ల దూరం అలాగే ఉంటుంది… వాటి గతులను బట్టి, ఓ రెండు గంటలపాటు భూమి నుంచి చూసేవాళ్లకు అలా కనిపిస్తాయి… చిత్తభ్రాంతి తరహాలో జస్ట్, మన నయనభ్రాంతి… అంతే…
Ads
ఇక దీనికి నానా విశేషాలూ అంటగట్టి, ఏదేదో రాసేశారు… నవ్వుకొండి సరదాగా… భూమి నుంచి అలా కనిపిస్తుంది సరే, మరి పక్కన బుధుడి మీద నుంచి చూస్తే… ఏముంది..? ఏ విశేషమూ ఉండదు… నిజానికి మనం చెప్పుకునేది ఇది కాదు… గ్రహసంచారాల్లో ఇలాంటి ఏదో విశేషం వస్తుంది అనగానే కొందరు పట్టేసుకుంటారు… తమ జ్ఞానసంపదను విరివిగా ప్రదర్శించుకుంటారు… గార్గేయ అని ఓ జ్యోతిష్కుడు ఉన్నాడు… అయిపోయింది, సత్యనాశనం, సర్వనాశనం అన్నట్టుగా చెబుతున్నాడు… ఇదీ ఆ వార్త…
ఆయన చెబుతున్న ఉత్పాతాలన్నీ మనం చదివి, బుర్రపాడు చేసుకోవడం వేస్టు గానీ… దేశంలో ఆరు రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం అని తేల్చిపారేశాడు… అయ్యా, స్వామీ… గ్రహాలు పరస్పరం దగ్గరగా వచ్చినా… ఏమీ జరగదు… అలాంటిది దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తే ఏం జరుగుతుంది..? ఏ కూటమిలోకి లేదా ఏ రాశిచక్రంలోకి ఏయే గ్రహాలు వస్తే ఏం జరుగుతుందో చెప్పేందుకు కొన్ని ప్రామాణికాలున్నయ్… ఇలాంటి నయనభ్రాంతి పరిణామాలు వాటిల్లో, అంటే ఆ లెక్కల్లో ఫిట్ కావు… ఇతర జ్యోతిష్కులు నవ్వుకునే జోస్యాలు దేనికి చెప్పండి..? పైగా రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన, రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పు, ఇంకో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ముప్పు అట… చివరకు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతాయట… 2021 జూలై 10 దాకా ఈ ప్రభావం ఉంటుందట… చెప్పేవాడికీ, రాసేవాడికీ, చదివేవాడికీ… ఇదుగో ఇలా విశ్లేషించేవాడికీ… వీళ్లకు మాత్రం ఏ ప్రభావమూ సోకదు లెండి… మనం శనిగ్రహాలను మించిన గ్రహాలం కదా మరి…!! అవునూ… ఆ ఆరు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుందంటున్నావు సరే గానీ, తెలంగాణ పదిలమే కదా మాస్టారూ…!!
Share this Article