ఓ మిత్రుడు హఠాత్తుగా ఓ ప్రశ్న వేశాడు… మహాభారతంలో పాత్రలన్నీ తెలుసా అని…! పెద్ద పెద్ద ప్రవచనకారులు, పురాణాలకు బాష్యాలు చెప్పే భాగవతులకు కూడా మొత్తం పాత్రలు తెలుసో లేదో సందేహమే అని జవాబిచ్చాను… నిజంగానే అదొక సముద్రం… మనకు తెలిసింది ఓ దోసిలంత…! పైగా ఒరిజినల్ కావ్యం ఇన్ని వేల ఏళ్లలో, అనేక కళారూపాల్లోకి ఒదిగి, వ్యాప్తి చెంది, పలు దేశాలకు పయనించి, రకరకాల ప్రక్షిప్తాలు, క్రియేటివ్ యాడిషన్స్‌తో రకరకాలుగా మారిపోయింది… ప్రత్యేకించి తూర్పుదేశాల్లో మన రామాయణం, మన భారతం కొత్త కొత్తగా వినిపిస్తుంది… కొత్త పాత్రలు కూడా బోలెడు కనిపిస్తాయి… అసలు కథకు సంబంధమే లేని బొచ్చెడు ఉపకథలు కూడా…
అదంతా సరే, తను అడిగిన ప్రశ్న… మేఘవర్ణుడు ఎవరు..? మేఘనాథుడు తెలుసు… కానీ అది రామాయణంలోని ఓ ప్రధానపాత్ర… మరి ఈ మేఘవర్ణుడు ఎవరు..? కృష్ణుడేనా..? తనను గాకుండా మేఘవర్ణుడు అని ఎవరిని అనగలం..? కానీ అది అంత సులభంగా జవాబు గుర్తుకొచ్చే ప్రశ్న అయితే తను అడగడు నన్ను… కాసేపటికి ఏదో మెరిసినట్టయి… ఘటోత్కచుడి కొడుకేనా అన్నాను… నిజానికి ఎప్పుడూ చదివినట్టు గుర్తులేదు… ఎందుకలా స్పురించిందో తెలియదు… జవాబు చెప్పాక, గూగులమ్మను అడిగాను…
ఘటోత్కచుడి కొడుకు అనేది కరెక్టు… కానీ ఇక ఏ వివరాలూ దొరకలేదు… నాలుగు పొడివాక్యాలు మినహా ఇంకేమీ లేదు… ఘటోత్కచుడి కథ అందరికీ తెలిసిందే… కానీ తన ప్రేమకథ చాలామందికి తెలియదు… నాగకన్య మౌర్వి తనను పెళ్లాడేవాళ్లకు అనేక ప్రశ్నలు వేసి, పరీక్షలు పెడుతూ ఉంటుంది… కృష్ణుడికి ఆమె గత జన్మవృత్తాంతం తెలుసు… ఆమె ఓ భీకరాకారుడైన రాక్షసరాజును పెళ్లాడాల్సి ఉంటుందనీ తెలుసు… అందుకని ఘటోత్కచుడికి కొన్ని చిట్కాలు చెప్పి పంపిస్తాడు… (నిజానికి ఘటోత్కచుడు సంపూర్ణ రాక్షసుడు కాదు, భీముడి రక్తం వల్ల అర్ధరాక్షసుడిగా పుట్టాడు)… ఘటోత్కచుడు విజయవంతంగా అన్ని పరీక్షల్లో నెగ్గి ఆమెను పెళ్లాడతాడు… దాంతో ఆ హిడింబి కుటుంబం మరో జాతితో మరింత వైవిధ్యాన్ని సమీకరించుకున్నట్టవుతుంది…
Ads
(ఇది బాలి (ఇండొనేషియా)లోని డెన్‌పాసర్ ఎయిర్ పోర్టు వద్ద ఉన్న విగ్రహం)
అక్కడా ఇక్కడా చదివినవి క్రోడీకరించి ఈ మేఘవర్ణుడి కథ చెప్పుకోవాలి… నిజమెంతో అబద్ధమెంతో తెలియదు… కానీ కథే కదా… కథలాగే చెప్పుకుందాం… ఘటోత్కచుడికి మౌర్వి ద్వారా ముగ్గురు పిల్లలు… అందులో బర్బరీకుడి కథ అందరికీ తెలిసిందే… నిమిషంలో యుద్ధాన్ని ఫినిష్ చేయగల అత్యంత బలసంపన్నుడైన తనను కురుక్షేత్రానికి ముందే కృష్ణుడు మాయమాటలతో యుద్ధానికి బలి ఇస్తాడు… మరో కొడుకు పేరు అంజనాపర్వుడు… బర్బరీకుడిలాగే తనకూ కొన్ని శక్తులున్నాయి…
కానీ యుద్ధంలో అశ్వత్థామ ఆ శక్తులన్నీ ఛేదించి అంజనాపర్వుడి తలనరికేస్తాడు… మరోవైపు కర్ణుడు అర్జునుడిని సంహరించడానికి దాచిపెట్టుకున్న శక్తిని విధిలేక ప్రయోగించి ఘటోత్కచుడిని కూడా నేలకూలుస్తాడు… ఇక మిగిలింది మేఘవర్ణుడు… తండ్రిలాగే గద తన ప్రధాన ఆయుధం… (తను పిల్లవాడు యుద్ధంలో పాల్గొనలేదు అనే వాదన కూడా ఉంది…) నిజానికి కురుక్షేత్ర సమరంలో బతికి బట్టకట్టింది కేవలం 12 మంది అంటారు… పంచపాండవులు, యుయుత్సుడు, కృష్ణుడు, సాత్యకి, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడి కొడుకు వృషకేతు, కృతవర్మ… కానీ మేఘవర్ణుడు కూడా…
యుద్ధానంతరం తన రాజ్యానికి వెళ్లిపోతాడు… ఆ రాజ్యానికి వారసుడు తనే… అవసరమైనప్పుడు పాండవుల దగ్గరకు వెళ్లడమే తప్ప ఎప్పుడూ హస్తిన రాజకీయ, పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు… ఓసారి ధర్మరాజు యాగానికి తగిన అశ్వాన్ని తనే సమకూర్చాడు… ఇలా భారతంలో పెద్దగా, ప్రముఖంగా చెప్పబడని పాత్ర ఇది… ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… తెరపై కనిపించేవాళ్లే హీరోలు కారు… కొందరు హీరోలు అనామకంగా మిగిలిపోతారు చరిత్రలో… ఇలాంటివాళ్లు భారతంలో బోలెడు మంది… వర్తమాన భారతంలోలాగే…!!
Share this Article