గత సంవత్సరం అక్టోబరులో… ఆరేడు నెలల క్రితం… కేరళకు చెందిన ఒక ఐపీఎస్ అధికారి డీజీ ర్యాంకులో రిటైరయ్యాడు… ఆయన పేరు ప్రతీప్ ఫిలిప్… రిటైర్ కావడానికి నెల క్రితం కోర్టుకు ఓ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు… జడ్జి మొదట ఆశ్చర్యపోయాడు… తరువాత వోకే అనేశాడు… ఆ రిక్వెస్ట్ ఏమిటో తెలుసా..? మీ కోర్టు ఆధీనంలో రక్తపు మరకలు అంటిన నా క్యాప్, నా నేమ్ బ్యాడ్జి ఉన్నాయి, దయచేసి వాటిని ఓసారి ఇవ్వండి… వాటిని గుండె నిండా ఓ ఫీల్‌తో నా రిటైర్మెంట్ రోజున ధరిస్తాను… మళ్లీ మీకు వాపస్ చేస్తాను… ఇదీ తన కోరిక… ఈ క్యాప్ ఏమిటి..? ఈ కథేమిటి అంటారా..? చదవండి…
1991… ఐపీఎస్ ట్రెయినింగ్ అయ్యాక ఫస్ట్ పోస్టింగ్ అక్కడే… అడిషనల్ ఎస్పీగా శ్రీపెరంబుదూరులో రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు భద్రతా ఏర్పాట్లు తన బాధ్యతే… నాయకులు, కార్యకర్తలు ఎంత చెప్పినా వినిపించుకోరు… ఎప్పటికప్పుడు ఏవో మార్పులు చేసేస్తున్నారు… 250 మంది పోలీసులను భద్రత కోసం నియమించారు ఆరోజు… నిజానికి తను కాంచీపురంలో జరగాల్సిన డీఎంకే కరుణానిధి సభ భద్రత ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉంది… కానీ అనుకోకుండా అది రద్దయింది… దాంతో రాజీవ్ గాంధీ భద్రత కోసం పెరంబుదూరుకు రాకతప్పలేదు… పంజాబ్ నుంచి తను ఇష్టపడి కొనుక్కున్న లాఠీ పట్టుకుని భద్రతను పర్యవేక్షిస్తున్నాడు…
రాజీవ్ గాంధీకి మూడు అడుగుల దూరంలో… అటూఇటూ గమనిస్తూ నడుస్తున్నాడు ఫిలిప్… హఠాత్తుగా విస్పోటనం… భారీ శబ్దం… వెలుగు… ఎగిరి చాలాదూరంలో పడిపోయాడు ఫిలిప్… విస్పోటనం తాలూకు ఎన్ని శిథిలాలు దేహంలోకి గుచ్చుకున్నాయో తెలియదు… ఒళ్లంతా రక్తం… నొప్పి… ఒక్కసారిగా మెదడు మొద్దుబారిపోయింది… తమ ఇన్‌స్పెక్టర్ ఛాకో కాసేపటికి పరుగెత్తుకొచ్చి, ఓ స్థానికుడి సాయంతో వేరే ఎవరిదో జీపులో ఎక్కించడం మాత్రమే గుర్తుంది… నాయకులు ఎటో పారిపోయారు… అక్కడ ఎటూ చూసినా శ్మశాన వాతావరణం… తరువాత తను ఎప్పుడు కళ్లు తెరిచాడో తనకే తెలియదు… అసలు తను ప్రాణాలతో బయటపడటమే ఓ అబ్బురం…
Ads
హాస్పిటల్‌లోనే ఆరునెలలు ఉన్నాడు… మొత్తం కోలుకోవడానికి ఏడాదిపైగా కాలం పట్టింది… ప్రత్యేక దర్యాప్తు బృందం సంఘటన స్థలంలో పలు ఆధారాలను స్వాధీనం చేసుకుంది… కోర్టులో విచారణల్లో ఈ ఐపీఎస్ అధికారే కీలక సాక్ష్యం… ట్రయల్ కోర్టులో విచారణ 1998 నాటికే పూర్తయింది… తీర్పు కూడా వెలువడింది… ఆ ఆధారాల్లో తన క్యాప్, తన నేమ్ బ్యాడ్జి కూడా ఉన్నాయి… అదుగో వాటిని ఓసారి ఇవ్వండి అనేది ఆయన రిక్వెస్టు…
వాటికి ఓ సెంటిమెంటల్ విలువ ఉంది… తన జీవితంలోనే మరుపురాని రోజుకు, ఆ దుర్ఘటనకు అవే గుర్తులు..! అందుకే ఓసారి ధరించాలని కోరుకున్నాడు… అందుకే సర్వీసులో ఉండగానే రిక్వెస్టు పెట్టుకున్నాడు… కోర్టు ఆ సెంటిమెంట్‌ను గౌరవించింది… ఆయన ఫీల్‌ను అర్థం చేసుకుంది… ఫస్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి టి.చంద్రశేఖరన్ వోెకే అనేశాడు… లక్ష రూపాయల బాండ్ ఇచ్చి, తాత్కాలికంగా తీసుకో, నెల రోజుల తరువాత వాపస్ ఇచ్చేయాలని చెప్పింది కోర్టు…
1987 బ్యాచ్‌కు చెందిన ఈయన తండ్రి బెంగుళూరులో వ్యాపారి… తల్లి రూట్స్ మాత్రం కేరళలోని పథ్తనపురం… మొదట్లో తను ఎస్బీఐ ఉద్యోగి… దాంతో సంతృప్తిపడక సివిల్స్ రాసి, ఐపీఎస్ కేడర్ ఎంచుకున్నాడు… 2003లో ప్రధానమంత్రి మెడల్… 2012లో రాష్ట్రపతి మెడల్… ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ అనే కాన్సెప్టుకు సృష్టికర్త తనే… నాడు రక్తం అంటిన ఆ క్యాప్, ఆ నేమ్ బ్యాడ్జిని, తన 34 ఏళ్ల కెరీర్‌కు తుది వీడ్కోలు చెబుతూ, మళ్లీ ధరించినప్పుడు తన ఫీలింగ్స్ ఏమిటో అక్షరాల్లో చెప్పగలమా..?!
Share this Article