చాలా ఏళ్ల క్రితం… అసలే మేఘాల్లో ఉండే చలిప్రదేశం… ఓ సాయం చలికి ఊరంతా దుప్పట్లోకి దూరిపోయింది… అకస్మాత్తుగా ఉగ్రవాదులు ఓ ఇంటిని చుట్టుముట్టారు… చేతుల్లో తుపాకులు… మాట్లాడితే అవి గర్జించడమే… వాటికి ఎదురు ప్రశ్నలు, ఎదురు జవాబులు అసలే నచ్చవు… అక్కడ వాళ్లు చెప్పిందే శాసనం…
అది షిల్లాంగ్… మేఘాలయ రాష్ట్రం… ఆ ఇంట్లోని ఓ వ్యక్తి కళ్లకు గంతలు కట్టారు… నిర్బంధంగా ఓచోటికి తీసుకుపోయారు… ఆయన ఓ ఐఏఎస్ అధికారి… పేరు ఆదిత్యనాథ్ దాస్… ఆ ఉగ్రవాద సంస్థ పేరు Hynniewtrep National Liberation Council (HNLC)…
స్థానికుల హక్కుల కోసం ఏ స్థాయికైనా పోరాడి, దేనికైనా తెగించే గ్రూపు అది… ఆయన్ని తీసుకుపోయి ఓచోట కూర్చోబెట్టారు నువ్వు చేస్తున్న పనేమిటి..? మా స్థానికులను గాకుండా ఎవరెవరినో వేరే రాష్ట్రాల వాళ్లను తీసుకొచ్చి నింపుతున్నావు… నిన్నెందుకు క్షమించాలి…? సూటి ప్రశ్న…! తను తొణకలేదు, బెణకలేదు… తాపీగా వివరిస్తూ పోయాడు… ఆ హాస్పిటల్ అవసరాన్ని విశ్లేషించాడు…… కాసేపటికి ఆ గ్రూపు సభ్యులే ఆయన్ని మళ్లీ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చారు… చాలామందికి తెలియని కథ… అవును, ఆయనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి… ఆదిత్యనాథ్ దాస్…
Ads
ఆదిత్యనాథ్ దాస్ తన కెరీర్లో గర్వంగా చెప్పుకునే ఆ హాస్పిటల్ పేరు తెలుసా..? నీగ్రిమ్స్… NEIGRIHMS… పూర్తి పేరు నార్త్ ఈస్టరన్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్… ఢిల్లీ ఎయిమ్స్ స్థాయి… చత్తీస్‌గఢ్ PGIMER స్థాయి… మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు అద్భుతమైన ప్రాంతీయ అత్యున్నత వైద్య కేంద్రం… దాస్‌ను ప్రత్యేకంగా పంపించారు… తొలి దశలో భూసేకరణ, స్థానికుల అంగీకారం, సహకారం సాధించి తిరిగి వచ్చాడు… మళ్లీ తనే రిక్వెస్టు పెట్టుకుని, మళ్లీ వెళ్లి, ఇలాంటి కథలు చాలా పడీ పడీ, మొత్తం పని పూర్తిచేసి వచ్చాడు… అక్కడ స్టాఫ్ నియామకం విషయంలో తలెత్తిన ఇష్యూలోనే ఈ గ్రూపు ఇన్వాల్వ్ అయింది…
రాష్ట్రాలకు చీఫ్ సెక్రెటరీలు వస్తుంటారు, పోతుంటారు… కొత్త చీఫ్ సెక్రెటరీగా దాస్‌ను నియమించాడు జగన్ అనే వార్త చూడగానే ఆ కథ స్ఫురించింది… జస్ట్, దాస్ తత్వాన్ని అది మనకు చెబుతుంది… తను చెప్పుకోడు… అసలు ప్రచారాన్ని పెద్దగా ఇష్టపడడు… తనది కాని పనిలో వేలుపెట్టడు… తన పనిలో ఏదీ విడిచిపెట్టడు… నిజానికి జగన్ ఏనాడో తీసుకోవాల్సిన నిర్ణయం ఇది… సరే, లేటయినా ఇది సరైన నిర్ణయమే…
నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ పిరియడ్‌లో స్టార్టయిన జలయజ్ఞం సమయంలో తను కార్యదర్శి… ప్రతి ప్రాజెక్టు పంచాయితీ ఏమిటో తెలుసు తనకు… దాస్ ప్రత్యేకంగా నాయకుల పట్ల రాగద్వేషాలు ఏమీ చూపించడు… కానీ జలయజ్ఞం సమయంలో వైఎస్‌తో బాగానే కనెక్టయ్యాడు… ఆ సాన్నిహిత్యంతోనే జగన్ కూడా తనను వెల్విషర్గా భావిస్తాడు… ఈరోజుకూ కృష్టా, గోదావరి జలవివాదాలు సహా ఏపీ ప్రతి ప్రాజెక్టు మీద దాస్ ముద్ర ఉంటుంది… తనే ఆ శాఖ కార్యదర్శి… మొన్నమొన్నటి రాయలసీమ లిఫ్టు తదితరాల వెనుక కూడా తనే…
నిజానికి ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొంతంగా చేయడానికి ఏమీ ఉండదు… కేబినెట్ రాజకీయ నిర్ణయాలను బట్టి తన పనితీరు ఉంటుంది… కాకపోతే సమర్థ ఇంప్లిమెంటేషన్ విషయానికొస్తే సరైన అధికారి కావాలి… కొన్ని పాలనపరమైన చిక్కుముళ్లు పడినప్పుడు, జాగ్రత్తగా విప్పగల నేర్పున్న వాళ్లు కావాలి… ఆ పని దాస్ చేయగలడు… ఒకవేళ చేయలేకపోతే అది సిస్టం ఫెయిల్యూరే… అబ్బే, మీరు దాస్‌కు పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు అంటారా..? నో ప్రాబ్లం… వాటికి ఆయన అర్హుడే… బెస్టాఫ్ లక్ సర్…
చివరగా :: దాస్ వరంగల్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు నక్సలైట్లు కాల్పులు జరిపారు… ఆయన కాన్వాయ్‌పై దాదాపు 80 రౌండ్ల కాల్పులు… తన భుజంపై చిన్న గాయంతో తప్పించుకున్నాడు… తన కారు డ్రైవర్ గాయపడ్డాడు… మేఘాలయ అనుభవానికీ, వరంగల్ అనుభవానికీ ఎంత తేడా…?!
Share this Article