మీరు జీతెలుగు చానెల్లో వచ్చే ప్రేమ ఎంత మధురం సీరియల్ చూస్తుంటారా..? అందులో ఆర్యవర్ధన్‌గా శ్రీరాం వెంకట్, అనురాధగా వర్ష, జిండేగా రాంజగన్ ఎట్సెట్రా పాత్రలు… నలభయ్యేళ్ల ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్… ఇరవయ్యేళ్ల ఓ డిగ్రీ స్టూడెంట్ మధ్య ప్రేమ… ఇదే కదా మెయిన్ ప్లాట్… మీకు ఈ కథ ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలని ఉందా..? నో, నో, థ్రిల్ పోతుంది అంటారా..? తెలిసిన కథను చూడటం కూడా థ్రిల్లే… అసలు ముందుగా ఈ కథ ఏమిటో చదవండి… జీతెలుగులో టాప్ రేటింగ్ సీరియల్స్‌లో ఇదీ ఒకటి కాబట్టి కాస్త ఆసక్తిగానే ఉంటుంది కదా… పైగా మంచి నిర్మాణ విలువలు మెయింటెయిన్ చేస్తున్నారు కదా…
ఆర్యవర్ధన్, అను ప్రేమించుకుంటారు… ఆ ప్రేమకు ఎన్నో అడ్డంకులు… ఆర్య ప్రాణస్నేహితుడు జిండేకు ఇష్టముండదు… ఆర్యను ప్రేమించే తన ఆఫీసు కీ పర్సన్ మీరాకు ఇష్టముండదు… ఏదో ఫ్లాష్ బ్యాక్ మనసులో పెట్టుకుని ఆర్యను చంపాలని, వీలయితే అనును చంపాలని చూసే ఓ విలన్ కేరక్టర్… ఈమధ్యే జైలు నుంచి విడుదలయ్యాడు… తను ప్రయోగించిన నీల్ అనే ఓ కోవర్టు… ఇంకా చిన్నాచితకా పాత్రలు… ఎట్‌లాస్ట్, ఆర్యవర్ధన్, అను పెళ్లి జరుగుతుంది…
Ads
ఇక్కడే అసలు కథ ఆరంభం… ఇప్పటిదాకా లాగించిన ఎపిసోడ్లన్నీ వార్మపులే… ఆర్యవర్ధన్ మంచివాడు కాదు అంటూ బిచ్చగాడు, సోదెమ్మ పాత్రల ద్వారా కాస్త కాస్త రివీల్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దర్శకుడు…
పెళ్లయ్యాక కూడా అను వాళ్ల ఆఫీసులో పనిచేస్తూ ఉంటుంది… తను ఒక ఫ్రాడ్ కనిపెడుతుంది… తమ సొంత కంపెనీ కదా ఇప్పుడు… ఆ ఫ్రాడ్ తవ్వడం స్టార్ట్ చేస్తుంది… అందులో షాకింగ్ విషయం తెలుసుకుంటుంది… ఆర్యవర్ధనే ఆ మోసానికి బాధ్యుడు… ఇక ఇక్కడి నుంచి ఆర్యవర్ధన్ అసలు నెగెటివ్ షేడ్స్ కనిపిస్తుంటాయి… ఇంకా ఆధారాలు తెలుసుకునేకొద్దీ ఆమెకు మరిన్ని విస్మయకర అంశాలు బయటపడుతుంటయ్…
ఇక్కడ ఫ్లాష్ బ్యాక్… ఈ ఆర్య, జిండే ఇద్దరూ పూర్, స్ట్రీట్ బ్యాచ్… ఓసారి రాజనందిని అనే ఓ అమ్మాయిని చూస్తాడు ఆర్య… మస్తు ఆస్తిపరురాలు… లైనేస్తాడు… ఆమె పడిపోతుంది… నమ్ముతుంది… ప్రేమిస్తుంది… పెళ్లి చేసుకుందామని అనుకుంటారు… కానీ ఆర్య విషయం తెలిసిన ఆమె తండ్రి అడ్డుపడతాడు… దాంతో ఆయనకు విషం ఇచ్చి చంపేస్తాడు… ఈవిషయం రాజనందినికి తరువాత తెలుస్తుంది… ఆర్య పెద్ద ఫ్రాడ్ అని అర్థం అవుతుంది… ఈ విషయాలన్నీ బహిర్గతం కాగానే ఆమెను కూడా బాల్కనీ నుంచి తోసేసి చంపేస్తాడు…
తరువాత కంపెనీ పేరు మార్చుకుంటాడు… జిండేను తన దగ్గరే ఉంచుకుంటాడు… అయితే మరణించిన రాజనందిని తండ్రి వీలునామా ప్రకారం ఆ ఆస్తంతా ఆమెకే దక్కాలి… అందుకని మరణించిన రాజనందినే తరువాత అనుగా జన్మించిందని (పునర్జన్మ) నమ్మించాలని అనుకుంటాడు… దీనివల్ల తన తల్లి, తన తమ్ముడు కూడా వాళ్ల వాటాల్ని అను పేరిట బదిలీ చేసేస్తారని అనుకుంటాడు… నిజానికి ఓ తెలివితక్కువ ఆలోచన… కథలో లాజిక్ లేని, కన్విన్సింగుగా లేని పార్ట్ ఇది… పైగా కథకు ఇదే కీలకం…
ఈలోపు అను ఈ ఫ్రాడ్ ఇంకా తవ్వడానికి ఆర్యవర్ధన్ ఇంట్లోని ఓ సీక్రెట్ రూం తలుపులు తెరుస్తుంది… ఆమెకు ఈ రాజనందిని కథ, ఆర్యవర్ధన్ చేసిన హత్యలు మొత్తం తెలిసొస్తాయి… ఆమె షాక్ తింటుంది… చివరకు ఆర్యవర్ధన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అని నిర్ణయం తీసుకుంటుంది…
ఆధారాలు అన్నీ సేకరిస్తుంది… ఈలోపు ఆర్య ఏదో విషయంలో కోపమొచ్చి జిండేను కూడా చంపేస్తాడు… అను తను సేకరించిన ఆధారాలన్నీ ఆర్య తల్లి, తమ్ముడు, తన తల్లిదండ్రులు, మీరా… అందరి ముందూ బయటపెట్టేస్తుంది… ఇక తప్పించుకోవడానికి ఏమీ ఉండదు… తన గురించిన మొత్తం కథ అందరికీ తెలిసిపోయిందనే విషయం ఆర్యకు మింగుడుపడదు… నిజానికి తను రాజనందినిని ప్రేమించలేదు కానీ అనును గాఢంగా ప్రేమిస్తాడు…
తను గర్భం ధరించినట్టు కూడా అప్పటికే చెబుతుంది… ఆమెను ఏమీ చేయడానికి మనసొప్పదు… ఏం చేయాలో తోచదు… చివరకు ఏ బాల్కనీ నుంచి తన మొదటి భార్యను తోసి చంపేశాడో, అక్కడి నుంచో కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాడు… ఇదీ కథ…
ఆగండి… ఇది తులా పహెతే రే అనబడే జీ మరాఠీ సీరియల్ కథ… మస్తు రేటింగ్స్ సంపాదించింది ఆ భాషలో… అందుకని జీవాడు ఇక తన మిగతా భాషల చానెళ్లలోకి కూడా రీమేక్ చేసి ప్రసారం చేసేస్తున్నాడు… అందులో భాగమే ఈ ప్రేమ ఎంత మధురం సీరియల్… అయితే అదే కథను యథాతథంగా తెలుగులోనూ చూపించాలని ఏమీ లేదు… ఎందుకంటే… ఏవేవో మార్పులు చేయకపోతే, తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చుకోకపోతే… ఆల్ రెడీ కథ తెలిసిన సీరియల్లో ఒక థ్రిల్ కంటిన్యూ చేయడం కష్టం… అందుకని ఏ మార్పులతో కథ నడిపిస్తాడో చూద్దాం…
నిజానికి చాలా పిచ్చి, తిక్క సీరియళ్లతో పోలిస్తే ఇది కాస్త నయమే… అత్తల కుట్రలు, కోడళ్ల కన్నీళ్లు, ఆడపడుచుల విలనీలు, హత్యాప్రయత్నాలు, నల్కా మొగుళ్లు తప్ప ఇంకేమీ కనిపించని మన టీవీ సీరియళ్ల కథలతో పోలిస్తే… ఇందులో క్రైం, లవ్, రొమాన్స్, సస్పెన్స్ గట్రా చాలా ఎమోషన్స్ ఉన్నయ్… మరీ జీడిపాకం ఏమీ కాదు, కథ కాస్త వేగంగానే కదులుతూ ఉంటుంది… తెలుగు సీరియల్ అవలక్షణాలు చాలా ఉన్నయ్, కానీ ఉన్నంతలో కాస్త బెటర్…
Share this Article