అటు జగన్… ఇటు కేసీయార్… ఇద్దరూ ముందస్తుకు సై అంటున్నారు… పోనీ, అంటున్నారని అందరూ అంటున్నారు… అడ్డగోలు పాలన వైఫల్యాలతో రోజురోజుకూ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జగన్ ముందుగానే ఎన్నికలకు వెళ్లి, రెన్యువల్ అయిపోదామని అనుకుంటున్నాడు… కేసీయార్ స్థితీ అంతకు భిన్నంగా ఏమీ లేదు… కాస్త బెటర్…
జనరల్ ఎలక్షన్స్‌తోపాటే స్టేట్ ఎలక్షన్స్ వస్తే… బీజేపీ మోడీ ప్రభావం పడుతుందని కేసీయార్ సరిగ్గా అంచనా వేశాడు… గత ఎన్నికల ముందు బీజేపీతో, మోడీతో బాగానే ఉండేవాడు కదా… ముందుగానే మాట్లాడుకుని, ముందస్తుకు సై అన్నాడు… వ్యూహం క్లిక్కయింది… నిజానికి అసెంబ్లీ, జనరల్ ఎలక్షన్స్ వేర్వేరుగా ఉంటే… అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్టేట్ ఇష్యూస్ మాత్రమే జనంలో చర్చకు వస్తాయి… కానీ మోడీ పాపులారిటీ బాగా పెరిగిపోయి ఉంది… జనరల్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి వస్తే మోడీ ఇంపాక్ట్ పడుతుంది అనుకున్నాడు కేసీయార్, అందుకే ముందస్తుకు వెళ్లాడు… ఎత్తుగడ గెలిచింది…
ఇప్పుడైనా సరే… ఎలక్షన్స్ సాధారణ గడువులోపల జరిగితే, తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్‌లోపే వస్తాయి కాబట్టి కేసీయార్‌కు ఆ భయం అక్కర్లేదు… కానీ మోడీ కూడా ముందస్తుకు వస్తే..? అదుగో, అదే కేసీయార్‌ను కలవరపెడుతోంది… అందుకని ఇంకాస్త ముందస్తుకు వెళ్దామని ప్లాన్… కానీ కేంద్రం కరుణించనిదే సాధ్యం కాదు… కేసీయార్‌ను ఇరకాటంలో పెట్టడానికి జనరల్, అసెంబ్లీ ఎలక్షన్స్ కలిపేస్తే…? కేసీయార్ ప్లాన్ వర్కవుట్ కాదు… ఇప్పుడున్న స్థితిలో మోడీ కేసీయార్ ఆలోచనలకు సై అనే సిట్యుయేషన్ లేదు… పైగా ఢిల్లీలో గాయిగత్తర లేపుతా అంటున్నాడు… అసెంబ్లీ ఎలక్షన్స్‌లోనూ మోడీ పాపులారిటీ ఉపయోగపడాలనేది బీజేపీ ప్లాన్…
Ads
ఏపీలో…. జగన్, మోడీ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి… మోడీ ఎలాగూ ఇక జన్మలో చంద్రబాబును నమ్మే సిట్యుయేషన్ లేదు, అసలు దగ్గరకే రానివ్వడం లేదు, ప్రధాని అపాయింట్‌మెంట్‌కే దిక్కులేదు… ఈ స్థితిలో జగన్ ఒకవేళ ముందస్తుకు రెడీ అయిపోయినా మోడీ నుంచి అడ్డంకి ఏమీ రాకపోవచ్చు… పైగా ఏపీలో బీజేపీ నామమాత్రం పార్టీ… వాళ్లకేమీ హోప్స్ లేవు… ఈ సిట్యుయేషన్‌లో ఒక్కసారి మనం గతంలో ఎన్టీయార్ అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి…
1983, 84 కాలం అది… కేంద్రం, రాష్ట్రం సంబంధాలు, రాజకీయ ఒప్పందాలు, తెర వెనుక అవగాహనల గురించి తెలుసుకోవాలి… జగన్, కేసీయార్‌కు తెలియక కాదు… ఇద్దరికిద్దరూ ముదుర్లే… కాకపోతే ఓసారి ఎన్టీయార్ మధ్యంతరం ఏమిటో ఓసారి చదవాల్సిన అవసరం ఉందేమో… ఆగస్టు సంక్షోభం, నాదెండ్ల నీచమైన రాజకీయాల్ని ఏపీ ప్రజలు తిప్పికొట్టిన రోజులవి… లెఫ్ట్, రైట్ కలిసికట్టుగా ఎన్టీయార్‌కూ జై అంటున్న రోజులవి… అప్పుడు… ఇందిర హత్య జరిగింది… దేశమంతా ఇందిర మరణం తాలూకు సానుభూతి… రాజీవ్ ప్రధాని అయ్యాడు…
అప్పటి కాంగ్రెస్ ఇప్పటిలాగా శక్తులన్నీ ఉడిగిన బాపతు కాదు… ఏక్‌సేఏక్ రాజకీయ వ్యూహ దురంధరులు ఉండేవాళ్లు… ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జె దొర ఓ పుస్తకం రాశాడు ఆమధ్య… ‘‘ఎన్టీయార్‌తో నేను’’ ఇదీ పుస్తకం పేరు… ఎన్టీయార్ దగ్గర ఇంటలిజెన్స్ చీఫ్… తను రాసుకున్న అంశాల్నే నెమరేసుకుందాం ఓసారి… (తను స్వయంగా డీల్ చేసినవీ, సాధికారంగా రాసుకున్న సంగతులే ఇవన్నీ…)
నాదెండ్ల ఇష్యూ సమయంలో తనకు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యేలు ఎన్ని డ్రామాలు ఆడారో ఎన్టీయార్‌కు తెలుసు… అసలే తనను తాను దైవాంశ సంభూతుడిగా భావించే తత్వం… అలాంటి వారిని వదిలించుకుని మధ్యంతర ఎన్నికలకు వెళ్దామనేది ఆయన ఆలోచన… కానీ అది బయటికి తెలిస్తే మళ్లీ సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే చిక్కులు వస్తాయని సందేహం… పైగా తను జాతీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు… కేంద్రంలోని కాంగ్రెస్‌కు అది కన్నెర్ర… మధ్యంతరం వెళ్దామంటే కేంద్రం సహకరించాలి… ఎలా..?
దొర చక్రం తిప్పాడు… కేంద్రంలో ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నారాయణన్ సహకారంతో… ఇచ్చిపుచ్చుకునే ధోరణి అయితే ఏపీలో మధ్యంతరానికి అడ్డంకులు చెప్పబోమని రాజీవ్ గాంధీ తరఫున చెప్పేశాడు నారాయణన్… రాజీవ్ తుపాన్ ప్రాంతాల పర్యటనకు వచ్చినప్పుడు ఎన్టీయార్ తనను కలిశాడు… ఆంతరంగికంగా కొన్ని షరతులు, ఒప్పందాలు… రాజకీయాల్లో సహజమే కదా… కానీ రహస్యంగా, వేగంగా నిర్ణయాల అమలు జరిగిపోవాలి… గవర్నర్ శంకర్ దయాళ్ శర్మకు ముందే చెప్పిపెట్టారు…
ఎన్టీయార్ జనరల్ ఎలక్షన్స్‌లో ఏపీ మినహా ఇంకెక్కడా ప్రచారం చేయకూడదు… హన్మకొండ, ఖమ్మం, మెదక్ స్థానాల్లో గట్టి అభ్యర్థులను పెట్టకూడదు… హన్మకొండలో పీవీ, ఖమ్మంలో జలగం, మెదక్‌లో శివశంకర్ కాంగ్రెస్ అభ్యర్థులు… (ఇందిర సానుభూతి పవనాల్లో టీడీపీ పెద్దగా సాధించేదేమీ లేదని ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల అంచనా… ఐనా ఎందుకైనా మంచిదని ఈ ఒప్పందం… ముందుగా జనరల్ ఎలక్షన్స్ వస్తాయి, అందులో ఇందిర సానుభూతి పనిచేస్తే, ఆ ప్రభావం ఏపీ మధ్యంతరంపైనా పడుతుందనీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వాళ్ల అంచనా…)
రాజీవ్‌తో ఒప్పందం మేరకు హన్మకొండను మిత్రపక్షం బీజేపీకి ఇచ్చేశాడు ఎన్టీయార్… అక్కడ జంగారెడ్డి కేండిడేట్… మెదక్‌లో ఓ తాలూకా స్థాయి లీడర్ మాణిక్‌రెడ్డి టీడీపీ టికెట్ ఇచ్చారు… ఖమ్మం సీపీఎంకు ఇచ్చేశాడు… అనివార్యంగా రాయలసీమలో కాంగ్రెస్ నుంచి కొత్తగా వచ్చి టీడీపీలో చేరిన నాయకులకు టికెట్లు ఇచ్చాడు… అంతా చంద్రబాబు ప్లానింగే… కోట్ల విజయభాస్కరరెడ్డిపై కర్నూలులో అయ్యపురెడ్డి, కడపలో డీఎన్‌రెడ్డి, నంద్యాలలో మద్దూరి సుబ్బారెడ్డి, రాజంపేటలో పాలకొండ రాయుడు, చిత్తూరులో ఝాన్సీలక్ష్మి… రామకృష్ణ హెగ్డే మాట కాదనలేక కర్నాటకలోని ఒక్క కోలార్ వెళ్లడం మినహా ఎన్టీయార్ ఇంకెక్కడా ప్రచారానికి పోలేదు…
జరిగింది వేరు… ఎన్టీయార్ హవా పనిచేసింది… పీవీ వంటి నేతలూ కొట్టుకుపోయారు… దేశమంతా ఇందిర సానుభూతి పవనాలు పనిచేసినా సరే, ఏపీలో మాత్రం ఎన్టీయార్, మిత్రపక్షాలు కలిసి 42కు 36 గెలుచుకున్నారు… తరువాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌లోనూ ఇదే సిట్యుయేషన్… ఎన్టీయార్ పేరు మీద సీపీఎం, సీపీఐ చెరో 11 సీట్లను, బీజేపీ 8, జనతా పార్టీ 3 సీట్లను గెలుచుకున్నయ్… వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ కేవలం 50 సీట్లతో బిక్కమొహం వేసింది… ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే..? వెనకాముందు చూడకుండా ముందస్తుకు సై అనే పరిస్థితి లేదు అని…!! కేసీయార్ ఏం చేయబోతున్నాడు అని… జగన్ ఆలోచన, ఆచరణ ఏమిటీ అని… జగన్‌కు సై చెప్పి, కేసీయార్‌కు నో చెప్పలేని మోడీ ఇరకాటం అని…!!
Share this Article