మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్, మారుతీరావుల కథపై రాంగోపాలవర్మ ఏదో సినిమా తీశాడు కదా… సరే, వర్మ రీసెంటు హిస్టరీ దృష్ట్యా ఆ సినిమా ఎలా తీశాడో, ఏమిటనేది పక్కన పెడితే… కులం కారణంగా జరిగే పరువు హత్యలపై నెట్‌ఫ్లిక్స్ కోసం తమిళ దర్శకుడు వెట్రిమారన్ ‘ఊర్ ఇరవు’ అనే ఓ ఫిలిమ్ తీసి, మంచి మార్కులు కొట్టేశాడు… పావ కథైగల్ పేరిట ఆ ఓటీటీలో విడుదలైన అంతాలజీ కథల్లో ఇదీ ఒకటి… అసలే ప్రకాష్ రాజ్, ఆపై సాయిపల్లవి… తండ్రి అమితమైన ప్రేమ కాస్తా పరువు అంశం వచ్చేసరికి ఎంత వికృతమైన ద్వేషంగా మారిపోతుందో… మనిషి ఎలా రాక్షసుడు అవుతాడో చెప్పే కథ… తండ్రి ప్రకాష్ రాజ్, బిడ్డ సాయిపల్లవి…
ఇద్దరూ ఇద్దరే… పైగా సూపర్ కంటెంట్… భావోద్వేగాల గాఢత… సమస్య తీవ్రత… పోటీపడి నటించారు… ఇద్దరికీ మంచి మార్కులు పడ్డయ్… నిజంగా సాయిపల్లవి ఓ డిఫరెంట్ ఈ ఇండస్ట్రీలో… మంచి నటి… నటన గురించి వదిలేయండి… తన పాత్రల ఎంపిక, తన ఆలోచన విధానం అన్నీ డిఫరెంటే… అసలు ఈ ఇండస్ట్రీలో ఆమె ఎలా ఫిట్టవుతుందనేది ఆశ్చర్యమే… ఆడదాన్ని ఓ సెక్స్ ఆబ్జెక్టుగానే చూస్తూ, దోపిడీ చేసే ఇండస్ట్రీ కదా…
Ads
శేఖర్ కమ్ములతో చేసిన లవ్ స్టోరీ అనేది వదిలేస్తే… ఆమె నటిస్తున్న విరాటపర్వం మరో డిఫరెంట్ సినిమా, ఆమెకు డిఫరెంట్ రోల్… సరే, మనం ఈ పరువు సినిమా విషయానికొస్తే… దిన్యూస్మినట్ సైటు, ఇండియాటుడే తనను ఇంటర్వ్యూ చేశాయి… ఆమె చాలా విషయాల్ని ఓపెన్‌గానే షేర్ చేసుకుంది… సాధారణంగా ఫిమేల్ లీడ్ స్టార్ల ఇంటర్వ్యూలంటేనే బోలెడన్ని హిపోక్రటిక్ అంశాలు, మెయిన్‌గా గ్లామర్ కంటెంట్ గట్రా ఉంటయ్ కదా… కానీ ఇవి అలా కాదు… కొంచెం భారంగా, లోతుగా, భిన్నమైన సామాజికాంశం చుట్టూ, కులం అనే సమస్య చుట్టూ తిరుగుతాయి… ఓ దళితుడిని పెళ్లిచేసుకున్న బిడ్డను సీమంతం పేరిట తీసుకుపోయి చంపేసే తండ్రి కథ ఆ 36 నిమిషాల షార్ట్ సినిమా… ఇంటర్వ్యూల సారాంశం…
‘‘నిజమే, ఒక గర్భిణిని తండ్రే హతమార్చడం ఎంత పెయిన్ఫుల్ సబ్జెక్టు… కానీ సమాజంలోని రియాలిటీయే కదా… ఆ పాత్ర చేస్తున్నప్పుడు ఆవరించిన ఉద్వేగం భరించరానిదిగా ఉండేది… ఎంత కాదనుకున్నా సరే, అది మనల్ని ఓ కుదుపుకి గురిచేస్తూనే ఉంటుంది… నేను నేల మీద పడి ఉంటాను, తండ్రిని చూస్తూ, నాన్నా నా పెయిన్ చూడు, నా దగ్గరకు రా అని పిలుస్తుంటాను, దిగ్భ్రాంతితో కూడిన కన్నీళ్లు కారిపోతుంటయ్… యోగా తరగతుల్లో ఓ మాట చెబుతారు… మనం ఏం ఫీలవుతామో కడుపులో బిడ్డ అదే ఫీల్ అవుతుంది… నేను ఏడుస్తున్నాను, భయపడుతున్నాను, గాయపడ్డాను… అదే ఫీలింగ్ నా కడుపులో బిడ్డకూ ఉంటుంది… ఆ బిడ్డకు నేనేం చెప్పగలను, ఏం ఊరడించగలను..? ఈ తండ్రికి ఏం చెప్పగలను… నేను గాయపడితే అక్కున చేర్చుకోవాల్సిన నా కుటుంబమే నన్ను బలితీసుకుంటే…? ఇదుగో ఈ ఫీలింగ్స్, ఈ పాత్రపోషణ నిజంగా నాకు భారంగానే సాగింది… ఎమోషన్స్ ఆపుకోవడం చాలాసార్లు కష్టమయ్యేది కూడా…’’
‘‘నిజానికి ఇదేమీ ఫిక్షన్ కాదు, సొసైటీలో జరుగుతున్నదే… మన జీవితంలో మన అనుకున్నవారే, మనం ఏమాత్రం ఊహించని వ్యక్తులే మనల్ని ఎక్కువ గాయపరుస్తారు, మన ఎమోషన్స్‌తో ఆడుకుంటారు, ట్రాజెడీ అదీ…
ఉంది, మా కులంలోనూ ఈ సమస్య ఉంది… ఇతర కులాలతో పోలిస్తే కాస్త తక్కువే కావచ్చు… చాలామంది మా బడగ కులానికి చెందని వాళ్లను పెళ్లి చేసుకున్నారు… కానీ వాళ్లు తమ స్వస్థలాల్లో ఉండటం లేదు, కాబట్టి పెద్ద ప్రెజర్ కులం నుంచి ఎదురు కావడం లేదేమో… మా కులానికి చెందని వాళ్లను చేసుకుంటే ఇక కులం బహిష్కరిస్తుంది, శుభ, అశుభకార్యాలకూ పిలవరు… చివరకు అంత్యక్రియలకు కూడా రానివ్వరు… మనం పుట్టి పెరిగిన చోట ఈ హఠాత్ అంటరాని వైఖరిని జీర్ణించుకోవడం కష్టం అవుతుంది… అన్ని కులాల్లోనూ ఉన్న సంస్కృతే కదా ఇది అంటాడు మా నాన్న కూడా… అమాయకుడు…
ఒక అమ్మాయి తన కులేతరుడిని పెళ్లి చేసుకుంటే ఆ కులాన్ని ఓన్ చేసుకోవాలి, పిల్లలు ఆ కుల సంస్కృతితో పెరగాలి… కానీ అలా ఎందుకు…? వేర్వేరు కుల సంస్కృతులతో పెరిగితే తప్పేమిటి..? కానీ అలా జరగదు… ఇవన్నీ రియాలిటీలే… చివరకు ఈ సినిమా కథలో నా పాత్ర పెద్ద సోదరిని నా తప్పు కారణంగా భర్త వదిలేస్తాడు…’’
‘‘నా ఆలోచనల్లో నన్ను బాధించే ఒక అంశం… ఓ మహిళ బిడ్డగానో, భార్యగానో, గరల్ ఫ్రెండ్‌గానో, తల్లిగానో మాత్రమే ఉండాల్సి వస్తోంది… తను తనలాగే ఎందుకు ఉండలేకపోతోంది..? ఎందుకు ఉండకూడదు..?
నిజానికి ఇలాంటి పాత్రల్ని మా పేరెంట్స్ ఇష్టపడరు… కాళి సినిమాలో ఓ కారులో విలన్ బంధించిన సీన్ చూసి నాన్న దాదాపు ఏడ్చేశాడు… ఇలాంటి పాత్రలు వద్దంటాడు… నా నిజజీవితంలో నేను ఆనందంగా ఉన్నా… కానీ ఈ పాత్రలేమో ఇలా…
ఆరేళ్లు మెడిసిన్ చదివాను… కానీ ఏం లాభం..? నాలుగేళ్లుగా మళ్లీ ఆ పుస్తకాలు ముట్టలేదు… వైద్యవృత్తి చేయాలంటే ఓ పరీక్ష పాసవ్వాలి… ఇన్నాళ్లూ నెగ్లెక్ట్ చేశాను… ఈ కరోనా దుర్దినాల్లో సొసైటీకి ఓ వైద్యురాలిగా నేనేమీ చేయలేకపోయాను… నన్ను ఆ ఫీలింగ్ చాలా బాధపెట్టింది… వెంటనే పరీక్ష రాశాను… ఈసారి ఏ విపత్తు వచ్చినా ఓ డాక్టర్‌గా నేను ఈ సొసైటీకి సేవ చేయగలగాలి… అంటే విపత్తు రావాలని కాదు, వచ్చినా సరే అని ప్రిపేర్డ్‌గా ఉండటానికి…!’’
Share this Article