ఇదే మరి అతి అంటే…! మరీ ప్రోమోల పైత్యం పెరిగిపోతోంది… ప్రేక్షకులను పిచ్చోళ్లను చేయడానికైనా ఓ పరిమితి ఉండాలి… ఒక షోకు ప్రచారం కోసం, ఒక ప్రోగ్రామ్‌కు హైప్ కోసం ప్రేక్షకులను మిస్‌లీడ్ చేసే ప్రోమోలు ఇప్పుడు కామన్… ప్రోమోలు చూసేవాడికి కూడా అర్థమైపోతుంటుంది… (జనాన్ని హౌలాగాళ్లను చేసేలా ప్రోమోలు కట్ చేసే ఎడిటర్లకు ఇప్పుడు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్)…
మొన్నామధ్య ఏదో ఈటీవీ షోకు సంబంధించి రష్మి హఠాత్తుగా స్పృహతప్పి ఆటోరాంప్రసాద్‌పై పడిపోయినట్టుగా చూపించారు… ఒకవేళ నిజంగానే జరిగినా అదెందుకు ప్రసారం చేస్తారు..? అలాగే పూర్ణ ఎవరో కమెడియన్‌తో నన్ను టచ్ చేస్తావా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్న సీన్ మరొకటి… ఇక్కడా సేమ్, అది నిజంగా జరిగితే, అది ప్రోమోలోకి రాలేదు… ప్రోమోలోకి వచ్చిందంటేనే అది ఫేక్ అని అర్థం…
పోనీ, ఇదంతా టీవీ కార్యక్రమాల దరిద్రం అనుకుందాం… చివరకు ఓటీటీలకు కూడా ఈ పైత్యం అవసరమా..? ఆహా ఓటీటీ వాడు తను టీవీ చానెల్ నడిపిస్తున్నానని అనుకుంటున్నాడేమో… చిన్నాచితకా ప్రోమోల్ని కట్ చేయించి యూట్యూబులో పెట్టేస్తుంటాడు… లేకపోతే ఓటీటీకి ప్రచారం ఎలా మరి..? ఇతర టీవీ మ్యూజిక్ షోలతో పోలిస్తే తెలుగు ఇండియన్ ఐడల్ షో కాస్త పద్ధతిగా ఉందని అనుకుంటున్నాం కదా… దానికీ ఈ తిక్క ప్రోమోల పైత్యం, ప్రాంక్ వైరస్ అంటించేశారు…
Ads
తాజా ప్రోమో అయితే చిల్లర… చిల్లరన్నర… ఉషా ఉతుప్‌ను గెస్టుగా పట్టుకొచ్చారు… ఆమెనూ ఈ ప్రోమోల్లో భాగం చేశారు… మొన్ననేమో ఆమె వాగ్దేవి పాటకు పెదవివిరవడం, వెంటనే థమన్ ఆమెకు పూర్తి కౌంటర్‌గా మాట్లాడటం, ఉషా ఉతుప్ పిచ్చిదానిలా చూస్తుండటం ఒక ప్రోమో… ఇప్పుడు తాజాగా మరొకటి వదిలారు… అదీ ఆమెపైనే…
ఎప్పటిలాగే శ్రీరాంచంద్ర ఏవో పిచ్చి కవితల్ని చదవడానికి ఉపక్రమిస్తాడు… ఈసారి ఉషా ఉతుప్ మీద… ‘‘ఉషా ఉతుపక్కా’’ అనేసి, వెంటనే గారూ అని యాడ్ చేశాడు… మీ వాయిస్ గంభీరం, మీ పాట అమృతం, మీరు మైక్ లేక పాడితే కీచురాళ్లు, అది వినిపిస్తుంది కొన్ని మైళ్లు… అంటూ ఏదో కూశాడు… వెంటనే ఉషా ఉతుప్ మొహం అదోలా పెట్టి, గంభీరం అంటే నన్ను మగ అంటున్నారా..? కోల్‌కత్తా నుంచి వచ్చింది ఇవి వినడానికా..? నేను వెళ్లిపోవడం మంచిది అంటూ పైకి లేచింది…
వెంటనే శ్రీరాంచంద్ర వెళ్లి ఆమె కాళ్లపై పడ్డాడు… ఇంత అవసరమా..? ఆమెకు గంభీరం అనే పదానికి అర్థం తెలియదా..? బెంగాలీ, హిందీల్లో కూడా గంభీర్ అనే పదం ఉంది కదా… ఇది జరుగుతుంటే ఆ పక్కనే ఉన్న థమన్ గానీ, నిత్య గానీ కనీసం కుర్చీల్లో నుంచి లేవలేదు… ఎవరో ప్రొడక్షన్ టీం వ్యక్తి వచ్చి ఏదో సర్దిచెబుతున్నాడు… ఒకవేళ ఇదంతా నిజమే అయినా సరే, అది ప్రోమోగా యూట్యూబులోకి ఎక్కదు… ఎక్కిందంటే ప్లాన్డ్ ప్రోమో అనే కదా అర్థం… ఒకవైపు బాలయ్యకు తీసుకొచ్చి, దునియా హంగామా క్రియేట్ చేస్తూ… మంచి వ్యూస్ సంపాదిస్తూ… మరోవైపు ఈ చిల్లర ప్రోమోలు అవసరమా వీళ్లకు..?
అప్‌డేట్ :: అసలు ఒరిజినల్ షో చూస్తే, ఓ ప్రోమో కథేమిటో తెలుస్తుంది కదాని… ఓటీటీ ఓపెన్ చేసి, చూస్తే మరింత చీప్ అనిపించింది… ప్రోగ్రాం డైరెక్టర్లు వేసిన ప్రాంక్ ప్లాన్‌లో భాగంగానే ఉషా ఉతుప్ అలా యాక్ట్ చేసింది… శ్రీరామచంద్ర నిజంగా పిచ్చోడయ్యాడు… ‘ఎహె పోవోయ్ శ్రీరామచంద్ర, నామీద నిజంగానే జోకులు వేసినా, నేను హాయిగా స్వీకరిస్తా…’ అని నవ్వుతూ చెబుతుంటే… ఎడ్డిమొహం వేయడం శ్రీరామచంద్ర వంతయింది..!!
Share this Article