హఠాత్తుగా ఓ సీరియల్ ఆపేస్తున్నారు… జస్ట్, 720 ఎపిసోడ్స్‌తో ఓ తెలుగు సీరియల్ ముగిస్తున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది… అసలు కనీసం ఒక వేయి ఎపిసోడ్స్ అయినా పూర్తిగాక ముందు సీరియల్ ఆపేయడం అంటే ఎంత నామోషీ… ఎంత నామర్దా… ఏమో మరి ఏమైందో… అవసరమైతే ఓ పదేళ్లపాటు, మూడు వేల ఎపిసోడ్స్ వరకైనా సరే, లాగీ లాగీ, పీకీ పీకీ ప్రేక్షకుల్ని చావగొట్టగల సమర్థులకు టీవీ ఇండస్ట్రీలో కొరత లేదు… అఫ్‌కోర్స్, అలాంటోళ్లే నిలదొక్కుకోగలరు…
ఆ సీరియల్ పేరు మనసిచ్చిచూడు… మాటీవీలో వస్తుండేది… చిత్రం ఏమిటంటే..? కథ ఇప్పుడిప్పుడు రక్తికడుతోంది… లేడీ విలన్ కేరక్టర్ చంద్ర ఓ కొత్త ప్లాన్ విసిరింది హీరోయిన్ భాను మీద… అలాంటిది అకస్మాత్తుగా సీరియల్ చివరి అంకం, అందరూ కలిసిపోయారు అంటూ ఓ శుభం కార్డు కూడా చూపించేస్తున్నారు ఇప్పుడు…
పారితోషికం, డేట్ల విషయంలో సర్దుబాట్లు లేకపోతే, సంబంధిత నటీనటులు మానేస్తే… అకస్మాత్తుగా సీరియళ్లలోకి కొత్త నటుల్ని తెచ్చిపెడతారు… నాలుగు రోజులకే ప్రేక్షకులే అలవాటైపోతారు… లేదంటే ఆ పాత్రనే చంపేస్తారు… మరీ కాదంటే ఏ దేశాటనకో వెళ్లిపోయినట్టు ట్విస్ట్ ఇచ్చి పడేస్తారు… స్క్రిప్ట్ రచయిత ఇష్టం… బుర్రకు ఏది తోస్తే అది… ప్రేక్షకులే హౌలాగాళ్లు కదా వాళ్ల దృష్టిలో… కార్తీకదీపం సంగతి తెలుసు కదా… మొత్తం ఒక తరాన్ని ప్రమాదంలో చావగొట్టేసి, కొత్తవాళ్లతో కొత్త జనరేషన్ అంటూ సీరియల్‌ను ఇంకా ఇంకా సాగదీస్తూనే ఉన్నారు… దాదాపు ప్రతి సీరియల్‌లోనూ ఈ దరిద్రం తప్పదులే గానీ…
Ads
మనసిచ్చిచూడు సీరియల్‌కు రేటింగ్స్ లేకపోవడం వల్ల హఠాత్తుగా ఆపేస్తున్నారు, వంటలక్క అని మరో సీరియల్ వేస్తున్నారు, జూన్ నాలుగు (నేడే) చివరి ఎపిసోడ్ అని ఎడాపెడా యూట్యూబర్లు రాసేస్తున్నారు… కానీ తప్పు… ఈ సీరియల్‌కు రేటింగ్స్ ఉన్నాయి… మాటీవీలో ఆడ్ టైంలో… మధ్యాహ్నం రెండున్నర గంటలకు… ఎంతలేదన్నా 4, 5 జీఆర్పీలు సాధిస్తోంది… దీంతోపాటు కేరాఫ్ అనసూయ కూడా… ఆపేయటానికి ఇంకేదో కారణం ఉండవచ్చు… కానీ కథను మెల్లిగా, లాజిక్‌గా ఓ కొలిక్కి తీసుకురాకుండా సడెన్‌గా ఎండ్ కార్డ్ వేయడం ఓ మూర్ఖత్వం…
ఆమధ్య కస్తూరి అనే సీరియల్ కాస్త బాగుండేది… (వేరే సీరియళ్ల దరిద్రంతో పోలిస్తే…) మెయిన్ లీడ్‌గా కన్నడ టీవీ నటి ఐశ్వర్య ప్లజెంటుగా కనిపించేది… దాన్ని ఏ ప్రకటన లేకుండా ఆపేశారు… నిజానికి మనసిచ్చిచూడు సీరియల్ కథ, కథనం, కేరక్టరైజేషన్, మన్నూమశానం… అంతా చెత్తే… కాకపోతే ప్రధానపాత్ర భాను దీనికి బలం… పాత్ర కూడా కాదు, ఆ పాత్ర పోషించిన కీర్తి భట్… బెంగుళూరు అమ్మాయి… కన్నడంలో సినిమాలు, సీరియళ్లు చేసేది… ఓ ప్రమాదంలో ఒకేసారి తల్లిదండ్రులు, అన్నయ్యను పోగొట్టుకుని ఒంటరిదైంది… ఓ పాపను పెంచుకుంటోంది…
మంచి డాన్సర్… ఇప్పుడు కార్తీకదీపంలో లీడ్ రోల్ చేస్తోంది… నిజానికి ఆమెలోని డాన్సర్‌ను ఎక్స్‌పోజ్ చేసిన పాత్ర రాలేదు ఆమెకు… యావరేజ్ లుక్ అయినా సరే, ఆమె నటనే ఇన్నాళ్లూ ఈ మనిసిచ్చిచూడు సీరియల్‌కు బలం… మరో అమ్మాయి పేరు అనూష… ఎక్కువ డిటెయిల్స్ తెలియవు కానీ హీరోకు సవతి అక్క చంద్ర పాత్రలో చేసింది… భలే చేసింది… ఈ సీరియల్ ఒరిజినల్ తెలుగు కాదు… (అన్నీ ఎత్తుకొచ్చే కథలు, కన్నడ తారలే కదా మన సీరియల్స్ అంటే…)… దీని ఒరిజినల్ తమిళం… పేరు Eeramana Rojave… Jeeva Hoovagide పేరిట కన్నడంలో కూడా రీమేక్ చేశారు… పాపులర్ సీరియల్ కాబట్టే ప్రస్తుతం హిందీలో Woh Toh Hai Albelaa పేరిట ప్రసారం అవుతోంది…! (అన్నీ స్టార్ గ్రూపు చానెళ్లే…)
Share this Article