ఇంతలో ఎంత మార్పు..? టికెట్ల ధరల మీద లొల్లి చేసిన ఇండస్ట్రీ ఇప్పుడు తనంతటతానే తగ్గించుకుని, రేట్లు తగ్గించాం, గమనించండహో అని ప్రచారం చేసుకుంటోంది… సింపుల్‌గా చెప్పాలంటే… బాబ్బాబూ, థియేటర్లకు రండి ప్లీజ్ అని ప్రేక్షకుడి కాళ్లు పట్టుకుంటోంది… టికెట్ల ధరల దెబ్బ అలా పడింది మరి..! ఇక్కడ కూడా ఎంత దరిద్రం అంటే… ఈ పరిణామానికి కారణం ఓటీటీ అంటూ ఆ ప్లాట్‌ఫామ్‌ను బదనాం చేస్తున్నారు… అంతేతప్ప థియేటర్ల దోపిడీ మీద చర్చ లేదు, ప్రక్షాళన లేదు, దిద్దుబాటు లేదు…
ఓ చంటిపాపతో ఓ మహిళ సినిమా థియేటర్‌కు వెళ్లింది… అక్కడికి వెళ్లిన ఖర్చు, కాలుష్యం దెబ్బ, టైమ్ బొక్క, ట్రాఫిక్ నష్టం మన్నూమశానం అలా వదిలేయండి… గేటు దగ్గర వాడు మంచినీళ్ల సీసా తీసుకుపోనివ్వడు… పాల సీసా పట్టుకుపోనివ్వడు… మరి పాప ఏడిస్తే..? 50 రూపాయలు పెట్టి ఆ దోపిడీ క్యాంటీన్లో మినరల్ వాటర్ తీసుకోవాలి… మరి పాలు..? ఆకలితో ఏడిస్తే ఏడ్చాడు చంటోడు… మరి సినిమాకు ఎవడు రమ్మన్నాడు..? పార్కింగ్ దగ్గర అదే దందా… అనేక థియేటర్లలో కనీసం యూరినల్స్ కూడా సరిగ్గా మెయింటెయిన్ చేయరు… ఇక క్యాంటీన్ ధరలు సరేసరి… ఇప్పుడు చెప్పండి, జనం థియేటర్‌కు ఎందుకు రావాలి..?
సరే, వస్తారు… ఏముంది ఈ దిక్కుమాలిన సినిమాల్లో… చెత్త చెత్త కథలు, హీరోల జేబులు నింపే నీచస్థాయి ప్రజెంటేషన్లు… ఇప్పుడు అర్థమైందా జనం థియేటర్లకు ఎందుకు రావడం లేదో… ఓటీటీల మీద పడి ఏడవడం దేనికి..? ఇప్పుడు వాళ్లూ సినిమాకు ఇంత అని అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు కదా… అందుకే ఏ పైరసీ సైట్ల వైపో జనం మళ్లుతున్నారు… జనం వాట్సప్ గ్రూపుల్లో షేర్లు చేసుకుని మరీ చూస్తున్నారు… ఒకవేళ ఓటీటీలో రేటు పెట్టి టైమ్ కొనుక్కున్నా బెటరే కదా… 48 గంటలపాటు వెనుకకూ ముందుకూ తోస్తూ, లాగుతూ సినిమా చూడొచ్చు… మన ఇల్లు, మన ఇష్టం, మన అరచేతిలో థియేటర్…
Ads
ఆ ఊపిరాడని థియేటర్ల నుంచి విముక్తి దొరుకుతున్నప్పుడు… ఆ ఇరుకు జైళ్లలోకి మళ్లీ రమ్మంటే ఎలా..? కొన్నాళ్లు ఆగితే ఓటీటీలో ఫ్రీగానే చూడొచ్చు… అంతెందుకు టీవీల్లోనూ చూడొచ్చు… ఇదొక అనివార్యత ఓటీటీతో సహజీవనం తప్పదు… కొన్నేళ్లకు థియేటర్ ఉండకపోవచ్చు కూడా… మరీ హైఫై కొత్తరకం, కొత్త ఫీల్ ఇవ్వగల థియేటర్లు, ఆ రేంజ్ సినిమాలు వస్తే తప్ప… ఉదాహరణకు అవతార్-2
నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఇప్పుడు మాటమార్చి, ఓటీటీలను తిట్టేస్తున్నారు కదా… థియేటర్లలో రిలీజయ్యాక నెలకు గానీ ఓటీటీలో రిలీజ్ చేయొద్దు అని ఉచితాభిప్రాయం పడేస్తున్నారు కదా… నిజానికి ప్రతి నిర్మాత ఫస్ట్ ఆలోచిస్తున్నది ఓటీటీ రేటు గురించే… అది గ్యారంటీ సొమ్ము… కరోనా కాలంలో బోలెడుమంది నిర్మాతల్ని ఆదుకున్నవి ఓటీటీలే… కొందరు హీరోలు ధైర్యంగా, నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసేశారు…
కరోనా భయం పోయాక కూడా ఓటీటీలో రిలీజ్ చేసినవాళ్లున్నారు… థియేటర్ల బెదిరింపులకు కూడా భయపడలేదు… ష్… థియేటర్లలో గనుక డిజాస్టర్ అయిపోతే, నిర్మాతకు నాలుగు డబ్బులు సమకూర్చేది ఓటీటీలు, టీవీలు… అవే లేకపోతే ఇండస్ట్రీకి మనుగడ లేదు… థియేటర్లకు జనం ఎగబడతారనే భ్రమల్లో బతకకండి..!! పోనీ, ఓటీటీలను తిట్టేస్తూ, థియేటర్ల మీద తెగ ప్రేమ ఒలకబోసే నిర్మాతలో, దర్శకులో ధైర్యంగా ఓ ప్రకటన చేయగలరా..? నా సినిమాను ఓటీటీకి ఇవ్వను అని… అది మాత్రం చేతకాదు, ఎందుకంటే గట్టెక్కించేది ఆ డబ్బే కాబట్టి..!!
అన్నట్టు… చెప్పడం మరిచేపోయాను… విరాటపర్వం సినిమా మల్టీప్లెక్సులో అయితే 150 ప్లస్ టాక్స్ అట… సింగిల్ స్క్రీన్ అయితే 100 ప్లస్ టాక్స్ అట… ఏదో ప్రెస్మీట్లో నిర్మాత చెబుతున్నాడు… తప్పదు… రేట్లు తగ్గిస్తే తప్ప ఎవడూ థియేటర్‌కు రాడు… అది విరాటపర్వం అయినా సరే, కురుక్షేత్రమైనా సరే…!! రండి బాబూ రండి, ఆలసించిన ఆశాభంగము, చౌక రేట్లకే సినిమా…!!
Share this Article