సరిగ్గా తీయగలిగితే అద్భుతమైన దేశభక్తుని సినిమా అవుతుంది… కానీ తెలుగులో మాత్రం అస్సలు తీయవద్దు… పొరపాటున తెలుగు నిర్మాతలు, దర్శకులు ఈ కథను గనుక పట్టుకుంటే… ఈ కథానాయకుడిని కూడా బ్రిటిష్ సైన్యంలో ఒకడిగా చూపిస్తాడు ఓ రాజమౌళి… గుర్రాన్ని గాలిలో గిరగిరా తిప్పేస్తాడు… ఏ చిరంజీవో హీరో అయితే మరీ ఓవర్ ఇమేజ్ బిల్డప్పులతో, పిచ్చి స్టెప్పులతో సైరా నాశనం… స్మరణీయుడైన ఓ ధీరోదాత్తుడి కథకు నానా అవలక్షణాలూ పూసి మసకబారుస్తారు… ఇతర భాషల వాళ్లే బెటర్… అసలు వాళ్లో వీళ్లో దేనికి కన్నడిగులు బ్రహ్మాండంగా ఓన్ చేసుకోగల, చేసుకోదగిన కథ ఇది…
కథానాయకుడి పేరు సంగోళి రాయన్న… క్రాంతివీరగా పేరుపొందిన ఇతను కర్నాటక రాష్ట్రానికి చెందిన తిరుగుబాటు వీరుడు… సేమ్, అల్లూరి సీతారామారాజు తరహా… ఇంకాస్త ఎక్కువే… 1798లో ఆగస్టు 15న పుట్టాడు… మరోసారి ఆ జన్మదినం చదవండి… ఆగస్టు 15… ప్రస్తుతం కర్నాటకలో ఉన్న బెలగావి ప్రాంతం, సంగోళిలో పుట్టాడు… ఆజానుబాహుడు, దృఢకాయుడు, యుద్ధవిద్యలలో ప్రవీణుడు… అప్పటి కిత్తూరును పరిపాలించిన రాణి చెన్నమ్మ సైన్యంలో చేరి, త్వరత్వరగా సైన్యాధ్యక్ష పదవికి ఎదిగిపోతాడు… ఇదీ తన పరిచయం…
Ads
బ్రిటిషర్లు సగం సంస్థానాల్ని హస్తగతం చేసుకోవడానికి సాకులు సంతానం లేదా రాజభృతి… వాడు చెప్పిందే శాసనం కదా… సంతానం లేని కిత్తూరు చెన్నమ్మ శివలింగప్ప అనే బాలుడిని దత్తత తీసుకుంటుంది… దాన్ని బ్రిటిష్ వాడు అంగీకరించలేదు… ఆ సాకుతో కిత్తూరును ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు… యుద్ధానికి వస్తారు…
ఈ యుద్ధంలో సంగోళి రాయన్న ఎంత పోరాడినా ఫలితం దక్కదు… బ్రిటిష్ సైనిక బలగం ఎక్కువ… దాంతో రాయన్న, చెన్నమ్మ బందీలుగా చిక్కుతారు… రాయన్న పరాక్రమాన్ని మెచ్చి వదిలేస్తారు… తరువాత బ్రిటిషర్ల దోపిడీ ప్రారంభమవుతుంది… శిస్తులు పెంచి, జనం మీద పడతారు… రాయన్న అడవుల్లోకి వెళ్లి సొంతంగా సైన్యాన్ని నిర్మించుకుంటాడు… తిరుగుబాటుకు దిగుతాడు… తెల్లవారి తొత్తులుగా ఉండే జమీందార్లు మీద పడి, వాళ్లను దోచుకుని పేదలకు పంచిపెడుతుంటాడు… బ్రిటిష్ ఆఫీసులను తగులబెడతాడు… వాళ్ల ట్రెజరీలను ఊడ్చేస్తాడు…
ఈలోపు బ్రిటిష్ చెరలో ఉన్న చెన్నమ్మ కన్నుమూస్తుంది… రాయన్న దళాలు రగిలిపోతాయి… ఇంకాస్త సైన్యాన్ని అధికం చేస్తారు రాయన్న.. తిరుగుబాటు ఉధృతమవుతుంది… ఎప్పుడైనా బ్రిటిష్ వాడి సామర్థ్యం కోవర్టులు, ఇన్‌ఫార్మర్లే కదా… రాయన్న అనుచరుడిని ఒకడిని లోబర్చుకుని రాయన్నను పట్టుకుంటారు… తరువాత విచారణ జరుపుతారు… ఉరిశిక్ష విధిస్తారు… 1831 జనవరి 26న… మరోసారి చదవండి… జనవరి 26న ఓ మర్రిచెట్టుకు ఉరితీస్తారు…
రాయన్న అనుచరులు అక్కడే ఓ సమాధి నిర్మిస్తారు… ప్రజలు తనను పూజించడం ప్రారంభిస్తారు… తమ కోసం పోరాడి ప్రాణం వీడిన యోధులను దేవుళ్లుగా కీర్తించడం మనకు అలవాటే కదా… సమ్మక్క, సారలమ్మల కథ కూడా అదే కదా… ఆ సమాధి వద్ద మర్రిచెట్టుకు ఉయ్యాలలు కడితే రాయన్న వంటి కొడుకులు పుడతారని నమ్మకం అక్కడ… ఆ దగ్గరలోనే అశోకస్థంభం ఏర్పాటు చేశారు… సంగోళిలో ఓ గుడి కట్టారు… తరువాతకాలంలో… 2007లో… కిత్తూరు చెన్నమ్మ విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో ఆవిష్కరించారు…
రాయన్న పుట్టినరోజు మన స్వాతంత్ర్య దినం… తనను ఉరితీసిన రోజు మనం రిపబ్లిక్‌గా అవతరించిన దినం… 1967లోనే కన్నడ ఇండస్ట్రీ ఓ సినిమా తీసింది రాయన్నమీద… (లతామంగేష్కర్, తన చెల్లెళ్లు ఆశ, ఉషలతో కలిసి పాడిన ఏకైక సినిమా…) సంగోళి రాయన్న పేరిట 2012లో ఓ సినిమా తీశారు… టైటిల్ పాత్రను దర్శన్ పోషించగా, చెన్నమ్మ పాత్రలో జయప్రద మెరిసింది… 2016లో బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు రాయన్న పేరు పెట్టారు… అవునూ, పాన్ ఇండియా సబ్జెక్టు కదా… అదే కేజీఎఫ్ యశ్ ప్రధానపాత్రలో అదే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా తీస్తే ఎలా ఉంటుంది..?!
Share this Article