కొన్నిసార్లు ప్రభుత్వ నిర్ణయాలు, వాటి వేషాలకంటే… వాటికి డప్పుకొట్టే వార్తలు, వాటిని పబ్లిష్ చేసే పత్రికలు, వాటి ఓనర్ల మీద జాలి ఎక్కువగా కలుగుతుంది… ఈనాడు వంటి మెగా పత్రికలు సైతం తాము ఏం రాస్తున్నామో, పాఠకులకు ఏం చెబుతున్నామో కూడా వదిలేసి, పాలకుల సొంత పత్రికలను మించి బాకాలు ఊదుతున్న తీరు జాలి గొలిపేలా ఉంటుంది… పాఠకులకు ద్రోహం చేస్తున్నామనే చింత కూడా రామోజీరావు వంటి మహా మెగా సూపర్ ప్రఖ్యాత ప్రసిద్ధ ప్రముఖ పాత్రికేయుడికి లేకపోవడం కడుంగడు విచారకరం…
జాగ్రత్తగా చదవండి… తెలంగాణ సోనా అన్నం తిన్నాక రక్తంలో అంతకుముందు ఉన్న గ్లూకోజ్ శాతంకన్నా 10 శాతం తగ్గిందట… టైప్-2 మధుమేహాన్ని నియంత్రించడానికి ఈ బియ్యం ఉపయోగపడుతున్నదని వెల్లడైందట… అదీ వినియోగదారులు చెప్పారట… అలా అని ఏదో దిక్కుమాలిన సర్వే చెప్పిందట… వీళ్లు రాసేశారుట… ఇంతకన్నా దరిద్రం, దుర్మార్గం ఉందా..? ఎవడిని మోసం చేయడానికి ఈ వార్త..? పైగా బ్రౌన్ బియ్యం, తృణధాన్యాలకన్నా ఆరోగ్యకరమట… హవ్వ… కొంచెం కొంచెం ఇన్సులిన్ రిలీజ్ చేస్తుందని రాయలేకపోయారా అదే చేత్తో…?!
Ads
నిజమా..? తెలంగాణ సోనా బియ్యంతో వండిన అన్నం తింటే రక్తంలో గ్లూకోజ్ శాతాలు పడిపోతాయా..? ఒక్క డాక్టర్‌తో గానీ, ఒక్క పౌష్టికాహార నిపుణుడితో గానీ ఈ మాట అనిపించగలదా ఈనాడు..?
నిజమే కావచ్చు… ఇతర సన్నరకాలతో పోలిస్తే ఈ బియ్యం గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువే… (దీన్ని కూడా సరిగ్గా రాయలేని దురవస్థ ఈనాడుది… గ్లైసీమిక్స్ అని గీకిపారేసింది…) ఈ జీఐ ఎంత తక్కువ..? కేవలం అయిదు పాయింట్లు తక్కువ… అంటే ఇతర బియ్యంతో పోలిస్తే, తిన్న వెంటనే రక్తంలో కలిసే టైం తక్కువ… మెల్లిగా రక్తంలోకి ఆ గ్లూకోజ్ చేరుతుంది… అంతేతప్ప ఇతర రకాల్లాగా వేగంగా రక్తంలో కలవదు… అదీ అర్థం,,.
అంతేతప్ప, రక్తంలోని గ్లూకోజ్ తగ్గిపోదు… అది మధుమేహ నియంత్రణేమీ కాదు… ఈ డప్పు వార్తకు నాలుగు కాలాల స్పేస్… ఏదైనా నాలుగు కాలాలు నిలిచే పాత్రికేయం అంటే ఇది కాదు రామోజీరావు గారూ… కొడితే చంద్రబాబు డప్పు కొడుతున్నారు, మీ స్వార్థం, మీ ప్రయోజనాలు మీవి… ప్రజలను దారుణంగా మోసగించే వార్తలయినా సరే, దానికి మీ అవసరాలు కారణం కావచ్చు… కానీ ఇలాంటి వార్తలు, స్టోరీలకు కారణం ఏమిటి..?
ఈ సన్నాలను డెవలప్ చేసింది ఓ యూనివర్శిటీ… తను డప్పు కొట్టుకుంటాడు, అది ప్రభుత్వ యూనివర్శిటీ అయినా సరే, ప్రజలను మోసం చేసే ఓ ప్రచారం చేస్తోంది… ఆ వర్శిటీ బాధ్యులను ఆ దేవుడు సుగర్ వంటి వ్యాధుల నుంచి రక్షించుగాక… క్షమించుగాక… ఐఎస్బీ వంటి బిజినెస్ స్కూల్ ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీ రచించిందట, దానికి తొక్కలో ఓ సర్వే నివేదిక అని పేరు పెట్టి జనాన్ని మోసగించాలా..?
పైగా ప్రోత్సాహకాలు ఇచ్చి, దుకాణదారులతో అబద్ధాలు చెప్పించి, ఈ సన్నాల్ని ప్రమోట్ చేస్తారట… వాడెవడో ఏదో స్ట్రాటజీ రచించారు సరే, మీకెందుకు ఇది మంచి వార్తగా కనిపించింది..? కనీసం పబ్లిష్ చేసేటప్పుడు ఇది అవసరమా, లేదా అని ఆలోచించే బుర్రలే లేకుండా పోయాయా మీ వ్యవస్థలో..? ఈనాడును ఏలుతున్న కోటరీ పెద్దలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొండి… మీలో కొందరు సుగర్ పేషెంట్లే కదా… ఈ తెలంగాణ సన్నాలు తిని మాత్రమే మీరు మీ రక్తంలోని సుగర్ తగ్గించుకోగలరా..? ఈ అన్నం తిన్న ప్రతిసారీ 10 శాతం సుగర్ లెవల్ తగ్గేపక్షంలో రోజుకు నాలుగుసార్లు దీన్ని తిని, సుగర్ కంట్రోల్ చేసుకుంటారా..? మరీ పాత్రికేయం, అదీ ఈనాడు వంటి పత్రిక మరీ ఈ లెవల్‌కు దిగజారిపోవడం అవసరమా..? టైప్-2 మధుమేహం సైడ్ ఎఫెక్ట్స్లాగా…!!
చివరగా……. ఈ సన్నాల రుచి అమోఘం, వోకే… తక్కువ నీరు చాలు, వోకే… తక్కువ పంటకాలం, వోకే… కానీ దిగుబడుల మాటేమిటి…? ప్రభుత్వం చెప్పగానే సాగు చేసి, ధర సరిగ్గా దక్కని రైతుల ఘోష మాటేమిటి..? ఈ కోణం మన పత్రికలో ఎందుకు కనిపించదు పెద్ద సారూ..?
Share this Article