సాఫీగా నడిచే వ్యవహారాల్లో అనవసరంగా వేలు పెట్టి కెలకొద్దు… కెలికితే అది కార్తీకదీపం సీరియల్ అవుతుంది… నిజం… ఎన్నాళ్లుగానో ఎప్పుడూ తెలుగు టీవీ టాప్ ప్రోగ్రాముల జాబితాలో నంబర్ వన్ ప్లేసులో కనిపించేది… సదరు దర్శకరత్నం దాన్ని పీకీ పీకీ, ఇటూఅటూ ఎటెటో తిప్పి, ప్రాణంగా నిలిచిన పాత్రల్ని చంపిపాతరేసి… కొత్తవాళ్లను తీసుకొచ్చి ఓ సీక్వెల్ తరహా ప్రయోగం మొదలుపెట్టాడు… అది ఎదురుతన్నింది… మొదటిసారిగా కార్తీకదీపం సీరియల్ తన నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది…
ఒకప్పుడు 17, 18 దాకా రేటింగ్స్ పొందిన ఈ సీరియల్ అంటే సగటు తెలుగు మహిళకు అభిమానం… ఇప్పుడదే సీరియల్‌ను ఎహెఫోవయ్యా అని తిరస్కరించేస్తున్నారు… మొదటిసారి పదిలోపు రేటింగ్స్‌కు పడిపోయింది… పాపం శమించుగాక, ఇంకా పడిపోబోతోంది… ఎందుకంటే, దాన్ని ఏం చేయాలో, ఎలా నడపాలో దర్శకుడికి అర్థం కావడం లేదు కాబట్టి… ఆల్‌రెడీ సీరియల్ గతుకుల బాటలోకి ప్రవేశించింది కాబట్టి…
Ads
చూశారు కదా తాజా బార్క్ రేటింగుల్లో టాప్ తెలుగు టీవీ ప్రోగ్రాముల జాబితాను… కార్తీకదీపాన్ని తొక్కేసి ఇంటింటి గృహలక్ష్మి టాప్ ప్లేసులోకి వెళ్లింది… అంటే, అదేమీ చూడదగిన సీరియల్ అని కాదు అర్థం… కాకపోతే కార్తీకదీపం బోల్తాకొట్టింది కాబట్టి ఇది ఫస్ట్ ప్లేసులోకి వెళ్లింది… అంతే… ఎన్టీవీ ఫస్ట్ ప్లేసులో ఉంది అంటే అర్థం, ఎన్టీవీ బాగుంటుందని కాదు… ఇన్నాళ్లూ ఎవరికీ అందనంత జీఆర్పీలతో ఓ వెలుగు వెలిగిన టీవీ9 దెబ్బతిన్నది కాబట్టి, ఆ వెనుకే తచ్చాడే ఎన్టీవీ టాప్‌లోకి వెళ్లిపోయింది… అదే తేడా… సరే, టీవీ9 పతనావస్థకు అరయగ కర్ణుడీల్గె అన్నట్టుగా బోలెడు కారణాలు…
నిజానికి ఇప్పుడు రేటింగ్స్ డేటా కరెక్షన్ జరుగుతోంది… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదంతా ఓ దందా… మార్కెటింగ్ ఏజెన్సీలు, చానెళ్లు, ప్రముఖ కంపెనీలు అన్నీ కలిపి నడిపించే ఓ ఆట… మరి వేల కోట్ల యాడ్స్ డబ్బు కదా… కాజేసే పన్నాగాల్లో ఈ రేటింగ్స్ దందాలు కూడా ఉంటుంటయ్… ముంబై పోలీసులు చెప్పగలరు, కానీ చెప్పనివ్వరు కదా… అన్నట్టు మాటీవీ కార్తీకదీపం సరే, జీవాడి సీరియళ్లు కూడా అంతేనా..? అంతేకదా… చూడండి…
ఒకప్పుడు జీటీవీ అనగానే త్రినయని, ప్రేమఎంతమధురం గుర్తొచ్చేవి… మూఢనమ్మకాలు, జోస్యాలు, తాంత్రికపూజలు, చేతబడులు, హత్యలు, హత్యాకుట్రలు, పునర్జన్మలు గట్రా దట్టించి వదిలేవాళ్లు… కానీ చూసీ చూసీ ప్రేక్షకులకు చిరాకెత్తింది… పోపోరా, నీ పైత్యం అని ఛీత్కరిస్తున్నారు… ఆషిక పడుకోన్ ప్లజెంట్ అప్పియరెన్స్ ఆ త్రినయని సీరియల్‌కు బలం… అదొక్కటీ నిలబెడుతోంది… దరిద్రమైన కథనం… ప్రత్యేకించి అందులోని హీరో కేరక్టరైజేషన్ బహుశా ప్రపంచ టీవీ చరిత్రలోనే ఎవరికీ చేతకానంత నాసిరకం…
సేమ్, ప్రేమ ఎంత మధురం… నిన్నో మొన్నో రాజమండ్రిలో ఏదో మీటింగు పెట్టినట్టున్నారు జీవాళ్లు… మాటీవీతో పోటీపడరా మగడా అంటే ఈ పబ్లిక్ వేషాలు ఎక్కువ వీళ్లకు… ఆ వేదిక మీద సదరు సీరియల్ హీరో రెండేళ్లు పూర్తి చేశాం, థాంక్స్ అని ఏదో చెబుతున్నాడు… అసలు రాజనందిని పాత్రను ప్రవేశపెట్టకుండా రెండేళ్లు సాగపీకారంటే మీరు గ్రేటోయ్… జెమిని, ఈటీవీ సీరియళ్ల గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి, అవి ఒకప్పటి దూరదర్శన్ సీరియళ్లకు తాతలు కాబట్టి వాటి ప్రస్తావన ఇక్కడ అనవసరం… అవునూ, టీవీ9ను తొక్కేశాం అని ఎన్టీవీ క్యాంప్ చెబుతుంది కదా… మరి హైదరాబాద్‌లో ఇప్పటికీ టీవీ9 మాత్రమే టాప్… ఎన్టీవీ దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతోంది… అదెలా..?!
Share this Article