నిజానికి ఆలోచన మంచిదే… అభినందనీయం… టీనేజీలోనే బాలికలకు ఆత్మరక్షణకు ఉపయోగపడే మార్షల్ ఆర్ట్స్ ప్రభుత్వం తరఫున నేర్పించడం అనేది మంచి సంకల్పం… ఎలాగూ భట్టీయం, మార్కులు, ర్యాంకులు, ఫీజులు, దోపిడీ తప్ప ఇంకేమీ పట్టని ప్రైవేటు స్కూళ్లు ఇలాంటివేమీ చేయలేవు… వాటికిి పాఠ్యపుస్తకాలు తప్ప ఇంకేమీ కనిపించవు… మన దిక్కుమాలిన సినిమాలు, మన చెత్తా హీరోల కథలు, మన టీవీ సీరియళ్ల పైత్యం పుణ్యమాని ప్రతి పోరడూ చిన్న వయస్సు నుంచే రోమియాలుగా మారి, అదే హీరోయిజంగా… ఆడపిల్లల వెంటపడటం, కాదంటే వేటకొడవళ్లు, కత్తులు, యాసిడ్లు…
ఎస్, ఈ స్థితిలో ఆడపిల్లకు తనే స్వీయ రక్ష… చిన్నప్పటి నుంచీ అలా తీర్చిదిద్దాలనే తెలంగాణ పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీదేవసేన నిర్ణయం మంచిదే… ఒక బాలికకు మార్షల్ ఆర్ట్ నేర్పిస్తే, అది ప్రధానంగా తనలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది… స్పాంటేనియస్‌గా స్పందించి, తనను తాను రక్షించుకోవడం ఎలాగో ఆ విద్య బోధిస్తుంది… అది అంతిమంగా జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఉపకరిస్తుంది…
Ads
సదరు ఐఏఎస్ అధికారిణి పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వ హైస్కూళ్లలో పిల్లలకు మార్షల్ ఆర్ట్ బోధించేలా చర్యలు తీసుకుంది… ఇప్పుడు తనే స్కూల్ ఎడ్యుకేషన్ చూస్తున్నది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ బాలికలకు కలరిపయట్టు అనే యుద్ద విద్యను వచ్చే విద్యాసంవత్సరం నుంచి నేర్పించాలని ఓ నిర్ణయం తీసుకుంది… అయితే..?
ఈ కలరిపయట్టు ఎందుకు..? ఈ ప్రశ్న ఒకసారి శ్రీదేవసేన వేసుకోవాలి… ఎందుకు అంటే అవసరం లేదని కాదు, ఆ విద్యే ఎందుకు అని..! ఎస్, ఈ కేరళ యుద్ధవిద్యకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది… ఇది అభ్యాసకులకు యుద్ధవిద్యనే కాదు, హీలింగ్ టెక్నిక్స్, ఆయుర్వేద, ఆత్మజ్ఞాన వంటి బోలెడు ఉపయుక్త అంశాల్ని బోధిస్తుంది… అయితే ప్రధానంగా ఇది యుద్ధవిద్య… ఆయుధధారులకు అనువైన విద్య… చేతిలో డాలు, కత్తి…
బాలికలకు ప్రధానంగా నేర్పించాల్సింది ఖాళీ చేతులతో కనీసం నలుగురైదుగురిని ఎదుర్కొని, మట్టి కరిపించగల విద్య… కలరిపయట్టులో కూడా ఖాళీ చేతులతో అభ్యాసం ఉంటుంది కానీ అది ఓ దశ దాటాక..! హైస్కూల్ దాటేలోపు బాలికలకు నేర్పించాల్సిన దశలు ఎన్నో ముందుగా గుర్తించాలి… నిజానికి ఆత్మరక్షణకు బాగా ఉపయోగపడే మార్షల్ ఆర్ట్స్‌లో మనకు ప్రధానంగా తెలిసినివి, మన చుట్టూ చాలామంది శిక్షకులు దొరికేవి… కరాటే, టైక్వాండో, కుంగ్ ఫు, జుడో వంటివి…
ఎంఎంఏ అని ఓ ఆర్ట్ ఉంది… అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్… ఈమధ్య బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది… అన్నిరకాల మార్షల్ ఆర్ట్స్‌లోని కీలక పట్లు ఇందులో పొందుపరిచారు… అలాగే బ్రెజిలియన్ జియు-జిట్సు… అసలు ప్రపంచంలోకెల్లా డెడ్లీయెస్ట్ మార్షల్ ఆర్ట్‌గా పేర్కొనే క్రవ్ మాగా… ఇది ఇజ్రాయెలీ యుద్ధవిద్య… ఇవన్నీ ఖాళీ చేతులతోనే ప్రత్యర్థిని కిందపడేయగలవు… అవసరమైతే చంపేయగలవు… సో, అమ్మా.., ఇదే ప్రశ్న… కలరిపయట్టు మాత్రమే దేనికి..?!
Share this Article