మన చిరకాల మిత్రదేశం రష్యా మనకు దూరం జరుగుతోందా..? మన శత్రుదేశం చైనాకు దగ్గరవుతోందా..? మనం అమెరికా కూటమికి చేరువయ్యేకొద్దీ రష్యా మనల్ని వదిలించుకుంటోందా..? ప్రస్తుతం కేవలం తన ఆయుధ అమ్మకాలకు మాత్రమే ఇండియా ఉపయోగపడుతోందా..? అందులోనూ చైనాకు అనుచిత మద్దతునిస్తూ, ఇండియాను మోసగిస్తోందా..? మన విదేశాంగ విధానానికి సంబంధించి ఇవి కీలకప్రశ్నలే… మొన్నటికిమొన్న సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరీ పెరగకుండా రష్యాయే మధ్యవర్తిత్వం వహించి, వేడి చల్లార్చిందనే ప్రచారం ఉంది… పైన ప్రశ్నలన్నీ ఊహాజనితాలే అంటారు చాలామంది…
కానీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అండ్ బ్యాచ్ దీన్ని అంగీకరించరు… నో, రష్యాను నమ్మడానికి లేదు అంటున్నారు బలంగా… లాయర్ కదా, తన వాదనకు తగిన కారణాలు కూడా చూపిస్తాడు కదా…
Ads
మనం చైనాకు దీటుగా… కొన్ని సందర్భాల్లో చైనాకు మింగుడపడని రీతిలో సరిహద్దుల్లో బలాల్ని మొహరించాం… ఆయుధసంపత్తిని తరలించాం… చురుకైన బలగాలను సిద్ధంగా ఉంచాం… చైనావాడు ఒకటి కొడితే మనం పది కొట్టడానికి రెడీ అంటున్నాం… కానీ క్షిపణుల సంగతేమిటి..? అణ్వస్త్రాలను మోసుకొచ్చే క్షిపణుల్ని మనం ప్రయోగిస్తే వెంటనే గగనంలోనే వాటిని కూల్చేయడానికి చైనాకు రష్యా ఇచ్చిన ఎస్-400 సిస్టం రెడీగా ఉంది… ఆల్రెడీ మన లడఖ్ సమీపంలో టిబెట్లో మొహరిస్తున్నాడు.,. మరి మనం..?
ఇక్కడే ఉన్నది చిక్కు… మనం కూడా రష్యా నుంచే ఇలాంటి క్షిపణి నిరోధక వ్యవస్థనే కొన్నాం… 5.6 బిలియన్ డాలర్లు… నిజానికి అవి కొనొద్దు, వాటిల్లోని ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అన్నీ చైనాలో తయారైనవే… వాటిని మనం నమ్మలేం అని సుబ్రహ్మణ్యస్వామి తదితరులు రెండేళ్ల క్రితమే గోల చేశారు… కానీ మోడీ హెలికాప్టర్లు, రైఫిల్స్తోపాటు ఈ ఎస్-400 కూడా కొనేశాడు… అంతేకాదు, 40 శాతం పేమెంట్స్ కూడా జరిగిపోయినయ్…
చైనా నిజానికి దాదాపు ఫ్రీగా రష్యా నుంచి తీసుకున్నట్టే లెక్క… 2014లోనే ఏవో పాత బకాయిల కింద జమకట్టేసి, ఈ సిస్టమ్స్ తెచ్చేసుకుని, టెస్ట్ ఫైర్ కూడా చేసుకుని, పరీక్షించుకుని… ఇండియా సరిహద్దుల్లోకి పంపిస్తోంది… మరి మనకు కూడా సప్లయ్ చేయాలి కదా… 2020 మధ్యలోనే సప్లయ్ జరగాలి… జరగలేదు… తాజాగా రష్యా మాటల్ని బట్టి 2021 చివరకు గానీ సప్లయ్ చేసే స్థితి లేదని బీజేపీలోనే ఓ సెక్షన్ సందేహం…
ఈమధ్యలో అమెరికాకు కోపమొచ్చింది… రష్యా నుంచి వాటిని కొనద్దు అని చెబుతున్నా కొన్నావు కాబట్టి నీమీద ఆంక్షలు తప్పవు అంటోంది… ట్రంపు పోయాడు, బైడెన్ వస్తున్నాడు… ఏ దేశంతో ఏం సంబంధాలుంటాయో తెలియదు… ఒకవేళ అమెరికా కస్సుమన్నా సరే రష్యాకు నష్టం ఏమీ లేదు… ఆల్రెడీ 40 శాతం పేమెంట్స్ ఇచ్చేశాం కదా… ఉంటేగింటే నష్టం మనకే… ఆమధ్య రాజనాథ్సింగ్ వెళ్లి ఏదో చర్చలు జరిపి వచ్చాడు గానీ పెద్ద వర్కవుట్ అయినట్టు లేదు… రష్యా ఎందుకిలా చేస్తున్నట్టు..? మోడీ విదేశాంగవిధానం భారీగా తేడా కొట్టేస్తోందా..?!
Share this Article