గుడ్లగూబలో అదృష్టదేవత!
————————
హమ్మయ్య!
గుడ్లగూబ ఎదురొస్తే, కనిపిస్తే అపశకునం అన్న అపప్రధను తొలగించడానికి ఇన్ని యుగాల్లో సరయిన ప్రయత్నాలేవీ జరగలేదు. తొలిసారి హైదరాబాద్ పాత బస్తీలో ఒక ఆసామి గుడ్లగూబల్లో శుభ లక్షణాలను, శుభ శకునాలను పట్టుకోగలిగాడు. కానీ విధి విచిత్రమయినది. అతను లోకానికి గుడ్లగూబ ద్వారా అనేక శుభాలను, అదృష్టాలను మూటగట్టి ఇవ్వాలనుకుంటే- పోలీసులు అతడి గూబ గుయ్యనిపించి అరెస్టు చేసి గూట్లో తోశారు.
Ads
మనసు అనే సాఫ్ట్ వేర్ ఇన్ బిల్ట్ గా ఉండడం వల్ల మనిషికి ఆ పేరు వచ్చింది. పాశం అంటే తాడు. పాశంతో కట్టేసి ఉంటాయి కాబట్టి జంతువులకు పశువులు అన్న పేరు వచ్చింది. పక్షం అంటే వైపు, రెక్క, భాగం, పదిహేను రోజులు అని అర్థం. రెండు వైపులా రెక్కలు- పక్షం ఉన్నాయి కాబట్టి పక్షి అయ్యింది.
మానవనాగరికత ఎంతగా అభివృద్ధి చెందినా- మన పశు ప్రేమ, పశు ప్రవృత్తి, పశు హింస, పాశవికత మాత్రం తగ్గదు. రాజుల్లో గొప్పవాడు రాజసింహమై జంతువుగా మారిపోతాడు. పులిగా మారి పంజా విసరాలి. కుక్కలా మారి విశ్వాసంగా పడిఉండాలి. గొడ్డుగా మారి చాకిరి చేస్తూ ఉండాలి. పిల్లిలా కళ్లు మూసుకుని పాలు తాగకూడదు. ఆకలయినా సింహంలా గడ్డి మేయకూడదు. ఎద్దులా మొద్దు కాకూడదు. దున్నపోతు మీద వానకురిసినట్లు కదలకుండా ఉండకూడదు. నక్కతోక తొక్కి అదృష్టాన్ని వెతుక్కోవాలి. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకనపెట్టుకుని వెళ్లకూడదు. చిలుకా గోరింకల్లా హాయిగా ఉండాలి. పురివిప్పిన నెమలిలా నాట్యం చేయాలి. ఊసరవెల్లిలా రంగులు మార్చకూడదు. చిలుక పలుకుల్లా కిలకిలా మాట్లాడాలి. చిలుక కొరికిన పండును వెతికి మరీ తినాలి. గద్దలా తన్నుకుపోకూడదు. దేన్నయినా విహంగ వీక్షణంగా చూడాలి.
గుడ్లగూబ అదృష్టాన్ని కూడా పాతబస్తీ ఆసామి గూబవిహంగ వీక్షణంగానే చూసినట్లున్నాడు. పోలీసుల విహంగ వీక్షణం మరోలా ఉండి దొరికిపోయాడు. గుడ్లగూబ కళ్లతో ఎలా చూస్తున్నాడో…చూడు …అన్నది నిందార్థం.
తమిళనాడులో కొందరికి అమావాస్య పరమ శ్రేష్ఠమయిన దినం. మనకేమో మంచిది కాదు. మంగళకరమయిన మంగళ అని పేరు పెట్టుకున్న మంగళవారం మనకు మంచిది కాదు. అలాంటప్పుడు అమంగళవారం అని పేరెందుకు మార్చలేదో?
రోజులో శనిని ఆవాహన చేసుకున్న శనివారం మాత్రం మంచిరోజు అయ్యింది.
చైనా కప్ప ఇండియా అంతటా బెక బెక అదృష్టం. చైనా లాఫింగ్ బుద్ధ మన దేశమంతా పకపకా అదృష్టం. నిమ్మకాయ, మిరపకాయ, నల్లతాడు అదృష్టమే అదృష్టం. ఈ అదృష్ట సంకేతాల పద్దులో తాజాగా గుడ్లగూబ కూడా కలవబోయి ఆగిపోయినట్లుంది.
ఒకవేళ- పోలీసులు గుడ్లగూబలను అడ్డుకోకపోయి ఉంటే- హైదరాబాద్ లో కొన్ని లక్షల ఇళ్లల్లో గుడ్లగూబలు గుడ్లు పెట్టి అదృష్టాన్ని పొదుగుతూ ఉండేవి. జనం రాత్రీ పగలు గుడ్లగూబలను చూసుకుంటూ హాయిగా కాలం గడుపుతూ ఉండేవారు.
దురదృష్టం!
గుడ్లగూబలు అరెస్ట్ అయ్యాయి!
ఇప్పుడు పోలీసుల అదృష్టం పండుతుందేమో?
ఏమో?
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article