పార్ధసారధి పోట్లూరి ….. 15 ఏళ్ల బాలుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని రష్యా బారి నుండి కాపాడాడు !
ఫిబ్రవరి 24 న రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ పేరిట ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టింది. ముందు కొద్దిపాటి సైన్యం ముందుకు కదలగా ఆకాశం నుండి వైమానిక దాడి తీవ్రంగా చేసింది రష్యా. ముందు ఉక్రెయిన్ పౌర విమానాశ్రయాలని టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. తరువాత మిలటరీ ఎయిర్ బేస్ లని వాటితో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని న్యూట్రలైజ్ చేసింది రష్యా. ఇదంతా ఉక్రెయిన్ పదాతి దళాలకి ఎయిర్ సపోర్ట్ ఇవ్వకుండా చేయడానికే చేసింది. ఫిబ్రవరి 28 రోజుకి ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ దాదాపుగా తుడుచిపెట్టుకొని పోయింది. మిలిటరీ కమ్యూనికేషన్ దాదాపుగా నాశనం అయిపోయింది. కేవలం లోకల్ వైర్లెస్ కమ్యూనికేషన్ మాత్రమే ఉక్రెయిన్ పదాతి దళాలకి అందుబాటులో ఉంది. ఇలాంటి సమయంలో రష్యన్ దళాలు ఎటువైపు నుండి ఎంత మొత్తంలో విరుచుకుపడతాయో తెలీని పరిస్థితి ఉక్రెయిన్ ఆర్మీ కమాండర్లకి.
ఆండ్రిల్ పోక్రసా [Andrii Pokrasa]!
Ads
ఆండ్రిల్ పోక్రసా అనే 15 ఏళ్ల బాలుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని తన ఇంటిలో సివిలియన్ డ్రోన్ తో సరదాగా ఆడుకుంటున్నాడు. స్కూళ్ళు లేవు, ఎప్పుడు మొదలవుతాయో తెలీదు పైగా టివి ప్రసారాలు, ఇంటెనెట్ లు లేవు కాబట్టి ఉన్నది ఒకే ఒక కాలక్షేపం డ్రోన్ ! ఆండ్రిల్ పోక్రసా తన ఇంటి బయటి ప్రదేశంలో డ్రోన్ ని ఎగురవేశాడు. తమ చుట్టుపక్కల ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో చూడాలని ఉత్సాహంతో మాత్రమే డ్రోన్ ని ఎగురవేశాడు కానీ రష్యన్ సైనిక దుస్తులతో ఇద్దరు తమ ఇంటికి సమీపంలోని ఒక భవనం పైన ఉండడాన్ని డ్రోన్ కెమెరాతో చూశాడు. వెంటనే డ్రోన్ ని కిందికి దింపి తన తల్లికి తెలియచేశాడు మన ఇంటికి దగ్గరలోనే ఇద్దరు రష్యన్ సైనికులు ఒక భవనం పైన ఉన్నారని. భయంతో ఆండ్రిల్ పోక్రసా తల్లి ఏం చేయాలో తోచక కాసేపాగి ఆండ్రిల్ పోక్రసా ని ఇంట్లోనే ఉండిపొమ్మని తాను ఇంటికి బయటి నుండి తాళం వేసి వెళ్ళిపోయింది. ఆండ్రిల్ పోక్రసా తల్లి ఉద్దేశ్యం ఏమిటంటే ఎవరన్నా ఉక్రెయిన్ సైనికులు కనపడితే రష్యన్ సైనికుల సమాచారం చెపుదామని, అదృష్టవశాత్తూ ఏకంగా ఒక ఉక్రెయిన్ ఆర్టీల్లరీ కమాండర్ వైర్లెస్ సెట్ లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు… అంతే… వెంటనే ఆ కమాండర్ కి విషయం తెలియచేసింది.
కొద్దిసేపు ఆ కమాండర్ ఆండ్రిల్ పోక్రసా చెప్పిన విషయాన్ని నమ్మలేదు. ఎందుకంటే కీవ్ నగరంలోకి ఒక్క రష్యన్ సైనికుడు కూడా చొరబడలేదు అని సదరు కమాండర్ నమ్మకం. అంతే కాదు, యుద్ధం మొదలయిన వారం రోజులలో రష్యన్ పదాతి దళాలు కీవ్ నగరానికి 12 కిలోమీటర్ల అవతలనే నిలిపివేయగలిగింది ఉక్రెయిన్ సైన్యం… అలాంటిది ఇద్దరు రష్యన్ సైనికులు కీవ్ నగరం నడిబొడ్డున ఉన్న భవనం దాకా ఉక్రెయిన్ సైనికులని తప్పించుకొని ఎలా రాగలుగుతారు అనే సందేహంతో నమ్మలేదు. కానీ ఆండ్రిల్ పోక్రసా తల్లి చాలా ధృఢంగా తన కొడుకు చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడంతో సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటి లోపల ఆండ్రిల్ పోక్రసా ని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశాడు. ఆండ్రిల్ పోక్రసా తాను డ్రోన్ కెమెరాతో తీసిన ఫోటోలని ఆ కమాండర్ కి చూపించాడు. ఆ ఫోటోలని చూసి షాక్ అయిన కమాండర్ మళ్ళీ డ్రోన్ ని ఎగురవేసి ఆ రష్యన్ సైనికులు ఇంకా అక్కడే ఉన్నారేమో చూడమనీ అడిగాడు. ఆండ్రిల్ పోక్రసా ని. ఆండ్రిల్ పోక్రసా మళ్ళీ డ్రోన్ ని గాల్లోకి ఎగురవేసి అదే భవనం మీదకి కెమెరా ఫోకస్ చేశాడు లైవ్ లో. ఆ సమయంలో ఇద్దరు రష్యన్ సైనికులు పొంచి వుండి వైర్లెస్ సెట్ లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు.
వెంటనే ఆ ఉక్రేనియన్ కమాండర్ తన సైనికులకి బిల్డింగ్ వివరాలు చెప్పి ఆ భవనం చుట్టుముట్టాలని, రష్యన్ సైనికులని చంపవద్దని, ప్రాణాలతో బంధించమని ఆదేశాలు ఇచ్చాడు. పది నిముషాలలో ఉక్రెయిన్ సైనికులు రష్యన్ సైనికులని బందీలుగా పట్టుకున్నారు.
ఇద్దరు రష్యన్ సైనికులని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి విచారించగా దిగ్భ్రాంతి కొలిపే నిజం బయట పడ్డది. నిజానికి కీవ్ రాజదానికి దారి తీసే అవుటర్ రింగ్ రోడ్డు అక్కడికి దాదాపుగా 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ అడపాదడపా రష్యన్ సైనికులతో కాల్పులు జరుగుతున్నాయని తెలుసు… కానీ అక్కడికి కొద్ది కిలోమీటర్ల దూరంలో దాపుగా వేలాది రష్యన్ దళాల వాహన శ్రేణి దాదాపుగా 24 కిలోమీటర్ల వరకు రోడ్డు మీద ఉన్నాయని చెప్పారు పట్టుబడిన రష్యన్ సైనికులు… ఆ వాహన శ్రేణికి ముందు ఒక ప్లటూన్ కీవ్ లోకి ప్రవేశించి మిగతా దళాలకి దారి చూపాలని ప్లాన్, అందుకే అవి అక్కడ వేచిఉన్నాయని రష్యన్ బందీలు తెలిపారు.
విషయం ఉక్రెయిన్ ఆర్మీ జెనెరల్స్ తెలిసింది. ఎలా ? అంత పెద్ద సైన్యాన్ని కీవ్ లోకి రాకుండా అడ్డుకోవడం ఎలా ? ఉక్రెయిన్ యుద్ధ వ్యూహ నిపుణులు ఈ పరిస్థితి నుండి ఎలా గట్టెక్కాలా అని తలలు పట్టుకొని ఆలోచిస్తుండగా ఒక జెనెరల్ సలహా ఇచ్చాడు. ఒకసారి రష్యన్ వాహన శ్రేణిలో ఏఏ వాహనాలు ఉన్నాయో తెలుసుకుంటే వ్యూహం రచించవచ్చు అని… కానీ అంత దూరం వెళ్ళి ఆ పనిని చేయడానికి తమ వద్ద ఎలాంటి విమానాలు కానీ, హెలికాప్టర్లు కానీ లేవు. ఇప్పుడు ఎలా ? వెంటనే పట్టుబడిన ఇద్దరు రష్యన్ సైనికుల ఫోటోలు తన డ్రోన్ ద్వారా తీసిన ఆండ్రిల్ పోక్రసా ని కమాండ్ సెంటర్ కి పిలిపించారు. అక్కడ నుండి ఉక్రెయిన్ ఔటర్ రింగ్ రోడ్ నుండి రష్యన్ సరిహద్దులకి దారి తీసే రోడ్ మీదకి నీ డ్రోన్ ని పంపి ఫోటోలు తీయగలవా అని అడిగారు. కానీ అది మిలటరీ గ్రేడ్ డ్రోన్ కాదు కాబట్టి దాని పరిధి కొద్ది కిలోమీటర్లు మాత్రమే ఉందని చెప్పాడు ఆండ్రిల్ పోక్రసా.
ఇక అప్పుడు ఉక్రేనియన్ జెనెరల్స్ ఆండ్రిల్ పోక్రసా ని ఉక్రెయిన్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలోని ఒక ఉక్రెయినియన్ అవుట్ పోస్ట్ కి తీసుకెళ్లారు. అక్కడ నుండి డ్రోన్ ని పంపి ఫోటోలు తీయగలవో లేవో చూడమని అడిగారు. ఆండ్రిల్ పోక్రసా వెంటనే తన డ్రోన్ ని ఆకాశంలోకి పంపాడు అలా అది ఎగురుతూ ఎంత వరకు తన కంట్రోల్ లో ఉంటుందో చూశాడు. అదృష్టవశాత్తూ ఆ డ్రోన్ రష్యన్ వాహన శ్రేణి రోడ్డు పైన ఉన్న ప్రాంతానికి వెళ్ళింది. వెంటనే ఉక్రెనేయన్ కమాండర్లు ఆండ్రిల్ పోక్రసా కి సూచనలు ఇస్తూ ఆ మిలటరీ వాహన శ్రేణి లో ఉన్న ఒక్కో వాహనాన్ని చూపిస్తూ దానిని ఫోటో తీయమని, అలాగే ఆ ఫోటోలో GPS కోఆర్డినేషన్ ని ఉంచమన్నారు. ఆ ఫోటోలు తీయగానే వెంటనే తమ ఫీల్డ్ కమాండర్లకి ఆ ఫోటోలు పంపించి వాటి మీద దాడి చేయమని ఆదేశాలు ఇచ్చారు.
ఆండ్రిల్ పోక్రసా ని ఫోటోలు తీయమని అడిగాక కేవలం ఆ వాహన శ్రేణి మధ్యలో ప్రతీ పది వాహనాల మధ్య ఒక ఆయిల్ టాoకర్ ఉండడం గమనించారు… వాటినే ఫోటోలు తీయించి అక్కడికి దగ్గరలోనే ఉన్న తమ సైనికులకి సమాచారం ఇచ్చి మరీ వాటిని ధ్వంసం చేశారు. మొదట ఆయిల్ సప్లై మీద దెబ్బ కొట్టింది ఉక్రెయిన్… వెంటనే రష్యన్ దళాలు తేరుకునే సమయం ఇవ్వకుండా అదే వాహన శ్రేణిలో ఉన్న ఆహార పదార్ధాలని తీసుకువస్తున్న ట్రక్కుల్ని టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేసింది ఉక్రెయిన్. రెండు రోజుల వ్యవధిలో దాదాపుగా 70 ట్రక్కులని ధ్వంసం చేయగలిగింది ఉక్రెయిన్ సైన్యం.
మరో వైపు రష్యన్ ఆర్టిలరి ఇంటెలిజెన్స్ ప్లటూన్ ఈ వాహన శ్రేణి కంటే ముందు వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది కానీ వాళ్ళకి తమ వెనుక జరుగుతున్న విషయం తెలీదు… ఆ ఇంటెలిజెన్స్ ప్లటూన్ ని కూడా ధ్వంసం చేయగలిగింది ఉక్రెయిన్… డీజిల్, స్పేర్ పార్టులు, ఆహారం, మందులు ఉన్న ట్రక్కులు నాశనం అవడంతో దాదాపుగా నాలుగు రోజులు 24 కిలోమీటర్ల పొడవున రష్యన్ దళాలు అలానే నిలిచిపోయాయి.
రష్యన్ దళాలు ఎన్ని రోజులు శ్రమ పడ్డా కీవ్ ని మాత్రం చేజిక్కించుకోలేక పోయాయి. ఆండ్రిల్ పోక్రసా తన డ్రోన్ తో చేసిన విన్యాసాలు తమ రాజధానిని కాపాడగలిగాయి !
ఒక సివిలియన్ డ్రోన్ తో 15 ఏళ్ల కుర్రాడు ఎలా తమని రక్షించాడో ప్రత్యక్షంగా చూసిన మిలటరీ వ్యూహకర్తలు వెంటనే కీవ్ నగరంలో ఉన్న స్టోర్స్ ని తెరిపించి అక్కడ ఉన్న అన్ని ద్రోన్లని స్వాధీనం చేసుకున్నారు… ఆ స్టోర్స్ యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ దగ్గర ఉన్న ఎక్కువ దూరం ప్రయాణించగలిగిన ద్రోన్లని ఉక్రెయిన్ మిలటరీకి ఇచ్చేశారు.
సివిల్ డ్రోన్ల ని కొద్ది పాటి మార్పులు చేసి అవి గ్రనేడ్స్ మోసుకువెళ్ళే విధంగా మార్పులు చేసి, తరువాత వాటిని యుద్ధంలో వాడి కీవ్ ని రక్షించుకోగలిగింది! ఇదంతా చూస్తే యుద్ధ సమయంలో ముందు ముందు యువకుల పాత్ర ఎలా ఉండబోతున్నదీ అర్ధం అవుతున్నది. మరీ ముఖ్యంగా మిలటరీ గ్రేడ్ డ్రోన్స్ కాకుండా సివిలియన్ డ్రోన్స్ తో కూడా యుద్ధం చేయవచ్చు అని నిరూపించాడు 15 ఏళ్ల ఆండ్రిల్ పోక్రసా అనే కుర్రాడు ! ఆండ్రిల్ పోక్రసా [Andrii Pokrasa] ఉక్రెయిన్ హీరో ! ఈ మాట అన్నది ఉక్రెయిన్ డ్రోన్ రెజిమెంట్ కమాండర్ అయిన యూరిల్ కసజానోవ్ [Yurii Kasjanov]. ఉక్రెయిన్ సైన్యంలో ఉన్న ఒకే ఒక్క డ్రోన్ రెజిమెంట్ కి కమాండర్.
తన తల్లితో కలిసి పోలాండ్ వెళ్ళి అక్కడ 9వ తరగతిలో చేరి తన విద్యని కొనసాగిస్తున్నాడు ఆండ్రిల్ పోక్రసా. ఒక హాలీవుడ్ సినిమాకి కావాల్సిన ఉత్కంఠ పరిచే సన్నివేశాలు ఉన్నాయి కదూ ! బహుశా ఇప్పటికే ఈ యదార్థ గాధ తో స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉండి ఉండవచ్చు ఎవరో ఒకరు ! త్వరలో ఆండ్రిల్ పోక్రసా పేరుతో హాలీవుడ్ సినిమా మనం చూడబోతున్నాం అంటే అతిశయోక్తి కాదు!
15 ఏళ్ల నుండి 24 మధ్య ఉండే యువకులలో చేతులు చాలా చురుకుగా పనిచేస్తాయి అందుకే చాలా చిన్నదిగా ఉండే సివిలియన్ డ్రోన్ రిమోట్ ని చాలా చాకచక్యంగా ఆపరేట్ చేయగలుతారు. ముందు ముందు ఇలాంటి కుర్రాళ్ల రిక్రూట్ మెంట్ మిలటరీ డ్రోన్ రెజిమెంట్ లో జరిగినా ఆశ్చర్యపోవక్కరలేదు. ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ లో AI [Artificial Intelligence ] పాత్ర ఎక్కువగా ఉంది. ఈ రంగంలో చైనా అమెరికా కంటే చాలా చాలా ముందు ఉంది అని చెప్పక తప్పదు. మొత్తానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆధునిక యుద్ధ పోకడలు ఎలా ఉండబోతున్నాయో ప్రపంచానికి తెలియచెప్పింది. మనుషుల పాత్ర అత్యల్పంగానూ ఆధునిక టెక్నాలజీ అధికంగానూ ఉండబోతున్నది…
Share this Article