నిజమే… ఎవరూ ఊహించలేకపోయారు… బీజేపీ తెలివిగా ఏకనాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేస్తుందని..! పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులే తెల్లమొహాలు వేశారు… ఢిల్లీలో పెద్ద పెద్ద పేర్లున్న, చేయి తిరిగిన బడా జర్నలిస్టులు సైతం బీజేపీలో ఏ నమ్మకమైన సోర్సూ లేక కళ తప్పారు, కలం తప్పారు… స్ట్రాటజీలు, పొలిటికల్ సీక్రెసీ మెయింటెయిన్ చేయడంలో బీజేపీ రాటుదేలిపోయింది… ఏకనాథ్ షిండే సీఎం అనగానే బీజేపీ బయటి నుంచి మద్దతు అని కొత్త విశ్లేషణలు రాస్తూ వెళ్లారు… కాసేపటికి అదీ తప్పని తేలిపోయింది… అనూహ్యంగా ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అని తెరమీదకు వచ్చింది కొత్త వార్త… మళ్లీ ఇప్పుడు మరిన్ని భిన్న విశ్లేషణలు కుమ్మేస్తున్నారు…
నిజం చెప్పాలంటే… బీజేపీ అగ్రనాయకత్వం ఏం ఆలోచిస్తున్నదో బీజేపీలోనే చాలామంది ముఖ్యులకు తెలియదు… తెలిస్తే జరిగే నష్టాలు ఎలాంటివో హైకమాండ్‌కు తెలుసు… అవునూ, ఇంతకీ బీజేపీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది..? అవును మరి… వరుస పరిణామాలు, మోడీషా ఆలోచనల సరళి, గత అనుభవాల నేపథ్యంలో మనమూ ఓసారి విశ్లేషించుకోవాలి… అంతకుమించి గత్యంతరమూ లేదు…
దానికిముందు కొన్ని వైఫల్యాలు చెప్పుకోవాలి… నేను తోపు, నేను తురుం అని చెప్పుకునే శరద్ పవార్ టోటల్ ఫెయిల్యూర్… హోం తన పార్టీ పరిధిలోనే ఉన్నా సరే, శివసేనలో అంతర్గతంగా ఏం జరుగుతుందో వాసన పట్టలేకపోయాడు… పోలీస్ ఇంటలిజెన్స్ అట్టర్ ఫ్లాప్… తన కోవర్టు సంజయ్ రౌత్ శివసేనలో కీలకస్థానంలో ఉన్నా, అంతఃపురానికి నమ్మిన బంటుగా నటిస్తున్నా… ఎంతసేపూ ఆదిత్య ఠాక్రే, సంజయ్ శివసేన సీనియర్ నాయకుల మీద పెత్తనాలకు దిగారు తప్ప లోలోపల రగులుతున్న అసంతృప్తిని పసిగట్టలేకపోయారు… కాంగ్రెస్ క్యాంపు మరీ దివాలా స్థితిలో ఉన్నట్టుంది… కోట్లకుకోట్లు కుమ్మేసిన శివసేన అధికారిక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జాడలేదు ఇన్నిరోజులూ… ఫాఫం… కొందరు ఇంకా తనను గుడ్డిగా నమ్ముతున్నారు…
Ads
నిజానికి బీజేపీలో ఓ భయం కూడా ఉంది… ఫడ్నవీస్, షిండే మంచి దోస్తులే… ఐనా సరే, రెండేళ్ల క్రితం చేతులు కాలిన చేదు అనుభవం బీజేపీకి గుర్తుంది… అజిత్ పవార్‌ను ఎన్సీపీ క్యాంపు నుంచి లాగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, నాలుగు రోజులు కూడా నిలబడలేదు… అజిత్ పవార్ భయంతో వాపస్ పారిపోయాడు… ఆ దెబ్బకు బీజేపీ ఇక ఏ పొలిటికల్ డ్రామాలు ఆడకుండా రెండేళ్లు సైలెంటుగా ఉండిపోయింది… ఇప్పుడూ అంతే… సర్కారు ఉంటే ఉండనివ్వు, పోతే పోనివ్వు అన్నట్టుగా షిండేను ముందు పెట్టి నడిపిస్తోంది…
బయటి నుంచి మద్దతునిస్తే ఫాయిదా ఏమీ లేదు… అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్ర… రాబోయే ఎన్నికలకు సాధనసంపత్తి సమకూర్చగల రాష్ట్రం… ఎందుకు వదులుకుంటుంది బీజేపీ… అందుకే ప్రభుత్వంలో చేరింది… ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినా సరే, 106 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా సరే, తనను డిప్యూటీ సీఎంగా ఒప్పించింది… 48 మంది లోకసభ ఎంపీలు, 19 మంది రాజ్యసభ సభ్యులు… పొలిటికల్‌గా కీలకమైన రాష్ట్రం తనకు… బీజేపీకి బలం ఉన్నదే పశ్చిమం వైపు… తూర్పు, దక్షిణం ఇప్పటికీ అందని ద్రాక్షలే… అందుకే మహారాష్ట్ర మీద ఈ కాన్సంట్రేషన్… పైగా హిందుత్వ పునాదులున్న రాష్ట్రం…
వీలయితే, షిండే గనుక చెప్పినట్టు వ్యవహరిస్తే మొత్తం శివసేన పార్టీని, ఎన్నికల గుర్తును కూడా ఠాక్రే గుప్పిట్లో నుంచి లాక్కునే ప్రయత్నాలు జరుగుతాయి… ఆ తరువాత అనుకూలిస్తే ఆ శివసేన విలీనమూ తప్పదు… దేశంలో రెండు హిందుత్వ శక్తులు ఉండకూడదు… ఉంటే గింటే అది బీజేపీ మాత్రమే ఉండాలి… మహారాష్ట్రలో ప్రాబల్యాన్ని స్థిరీకరించుకోవాలి… ఎలాగూ ఠాక్రేకు పార్టీ పునర్నిర్మాణ సామర్థ్యం లేదు… తను శ్రేణులను ఉత్తేజపరచలేడు… సో, బీజేపీ సోకాల్డ్ శరద్ పవార్, సంజయ్ రౌత్ ఎట్సెట్రాల అంచనాలకు అందని కొత్త వ్యూహంతో కదులుతోంది…!! అందులో మొదటిది శివసేనను నిర్వీర్యం చేయడమే ప్రథమం..!! సరే, మొత్తానికి రాజమాత లేదా రాజపత్ని కావాలనుకున్న రష్మి ఠాక్రే కల నెరవేరింది…!!
Share this Article