మరీ ఖగోళ భాషలో వద్దు గానీ, మామూలు భాషలో చెప్పుకోవాలి ఈ విషయాన్ని… అంతకుముందుగా మనం తెలుగు మీడియా సంయమనాన్ని అర్థం చేసుకోవాలి… ఎందుకంటే ఏ టీవీ సుమనుడో, ఇంకా ఏ యూట్యూబరో ఎవడో దిక్కుమాలినోడిని పట్టుకుని ఇంటర్వ్యూ పేరిట ప్రపంచంలోని దరిద్రమంతా మన బుర్రలకు ఎక్కించడం పరిపాటి అయిపోయింది కదా… ఈ విషయం మాత్రం అర్థం కాలేదో, దీన్ని ఎలా పెంటపెంట చేయొచ్చో అర్థం కాకపోవడం కూడా కారణమో ఏమో, దీని జోలికి పోలేదు… టీవీ9కి కూడా కృతజ్జతలు, రుధిరాన్ని రంగంలో దింపనందుకు…
విషయం ఏమిటంటే..? పాశ్చాత్య మీడియా రకరకాల కుట్ర సిద్ధాంతాలను రచిస్తూ ఉంటుంది… పోతారర్రేయ్, మొత్తం నాశనమైపోతార్రోయ్… అదుగో భూగోళం పని ఇక మటాష్… ఇక జీవజాలం మొత్తం ఢమాల్ అని రకరకాల సైంటిఫిక్ పదాల్ని పొదిగి మరీ భయపెడుతూ ఉంటుంది… ఎలాగంటే… అదుగో కరోనా నాలుగో వేవ్, అయిదో వేవ్, చచ్చిపోతార్రా, వెంటనే ఇంకో డోస్ గుచ్చేసుకొండిరా అని కొందరు ప్రచారాలు చేస్తూ ఉంటారు కదా, అలాగే అన్నమాట…
అచ్చం అలాగే… అఫెలియాన్ ఫెనామినా అని ఓ కుట్ర సిద్ధాంతాన్ని పట్టుకొచ్చారు ఈమధ్య… అంటే సూర్యుడికీ భూమికీ నడుమ దూరం పెరుగుతుంది… ఇక ఉష్ణోగ్రతలు పడిపోయి, చలి పెరిగిపోయి, జలుబు, దగ్గు గట్రా పట్టేసి, జనం చచ్చిపోతారు… కొత్త దుప్పట్లు కొనుక్కొండి, విటమిన్లు తీసుకొండి, హీటర్లు సరిచూసుకొండి అన్నట్టుగా రాసిపారేసింది పాశ్చాత్య కాన్‌స్పిరసీ మీడియా… (కుట్ర పాత్రికేయం)… సోషల్ మీడియాలో రకరకాల ఫేక్ కథనాలు వస్తుంటాయి కదా, ఇదీ అలాంటిదే…
Ads
సూర్యుడి చుట్టూ భూమి తన వాలును బట్టి దీర్ఘ వర్తులాకారంలో తిరుగుతూ ఉంటుంది… ఈక్రమంలో కొన్నిసార్లు కాస్త దూరంగా, ఇంకొన్నిసార్లు కాస్త దగ్గరగా వస్తూపోతూ ఉంటుంది… దూరం వెళ్తే 9.45 కోట్ల మైళ్లు… దగ్గరగా వస్తే 9.14 కోట్ల మైళ్లు… దూరం వెళ్తే అఫెలియాన్, దగ్గరకొస్తే పెరిహెలియాన్ అంటుంటారు… ఇదీ సైంటిఫిక్ వివరణ…
ఇప్పుడు ప్రచారం ఏమిటంటే జూలై వచ్చేసింది కదా, ఇక అఫెలియాన్ నెలరోజులపాటు ప్రపంచాన్ని వణికించబోతోంది అనే కుట్ర ప్రచారం… హమ్మయ్య, థాంక్ గాడ్… మన మందబుద్ధులకు అర్థం కానట్టుంది… ఎవరూ కంపు కంపు చేయలేదు… ఇంగ్లిషు, హిందీల్లో అక్కడక్కడా ఈ వార్తలు కనిపించినట్టున్నాయి… వాట్సప్ గ్రూపుల్లో కూడా…!! బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్టు అనికేత్ సూలే వివరణ ఇస్తూ… ‘ఈ దూరం, ఈ దగ్గర అనేది నేచురల్ ఫెనామినా… సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులేమీ ఉండవు… ఫ్లూ, జలుబులు ఏమీ పెరగవు, నష్టాలేమీ ఉండవు’ అని వివరించాడు… కనుక భయపడనవసరం లేదని మనవి… టీవీ రుధిరమా, క్షమించు, నీకు భలే చాయిస్ మిస్సయిపోయింది…!!
Share this Article