ఢిల్లీ… పందార రోడ్డు… ఉపప్రధాని అద్వానీ నివాసం… అందరూ నిద్రపోతున్న ఓ రాత్రివేళ… ఒక గుర్తుతెలియని ప్రైవేటు కారు అక్కడికి వచ్చింది… అద్వానీ మేల్కొనే ఉన్నాడు… ఎదురు చూస్తున్నాడు… అందులో వచ్చింది ఎవరో తెలుసా..? పాకిస్థాన్ హైకమిషనర్ అష్రాఫ్ క్వాజీ… తనను తీసుకువచ్చిన వ్యక్తి ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్… కాసేపటికి కారు వెళ్లిపోయింది… అంతా గప్‌చుప్…
ఒక్కసారి కాదు… 18 నెలల్లో కనీసం ఇరవై ముప్ఫయ్ సార్లు ఈ రహస్య భేటీలు జరిగాయి… నమ్మేట్టు లేదు కదా… కానీ నిజమే… జర్నలిస్టు వినయ్ సీతాపతి రాసిన జుగల్బందీ పుస్తకంలో బాగా ఆకర్షించిన పేజీలు ఇవే… ఈ పుస్తకం రిలీజై చాన్నాళ్లయింది… మోడీకి ముందు జనసంఘ్ పుట్టుక, భారతీయ జనతా పార్టీ అనివార్యత, వాజపేయి-అద్వానీ ద్వయం దాన్ని బలంగా నిర్మించిన తీరు, బీజేపీ జాతీయతావాదం, హిందూవాదానికి ఎదురైన చిక్కులు గట్రా విస్తారంగా రాసుకొచ్చాడు రచయిత… అది తన అధ్యయనం, విశ్లేషణ… ఆ కంటెంట్ విశ్వసనీయత, శైలి, నాణ్యత జోలికి పోవడం లేదు మనం…
వాజపేయి ప్రేమికురాలి కథనూ కాస్త వివరంగానే రాశాడు రచయిత… అదెప్పుడైనా చెప్పుకోవచ్చు… కానీ ఉపప్రధాని హోదాలో ఉన్న అద్వానీ అర్ధరాత్రిళ్లు, అదీ మనం సిగ్గుపడే కాందహార్ హైజాక్ ఉదంతం తరువాత నెలరోజుల నుంచే, ఆ శత్రుదేశపు హైకమిషనర్‌తో రహస్య భేటీలు వేయడం అనేదే ఆసక్తికరంగా అనిపించింది…
Ads
అబద్దాలు, కుట్రలు, యుద్ధాలు, హైజాకులు, ఉగ్రవాదం మాత్రమే ఇష్టపడే ఓ పొరుగు శత్రుదేశం అది… అద్వానీయేమో ప్రభుత్వంలో నెంబర్ టూ, అధికార పార్టీలో అత్యంత కీలకవ్యక్తి, ఎప్పుడూ పాకిస్థాన్‌ను పెద్ద బూచిగా చూపుతూ ఆ పేరు వింటేనే కస్సుమనే పార్టీ ప్రధాన నేత… అసలు ఎందుకు ఈ భేటీలు..? పాకిస్థాన్‌తో సంప్రదింపుల కోసం… అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను పిలిచి, రాజీలు-సంధి ప్రయత్నాలు చేసి, శాంతిని నెలకొల్పాలని ఆలోచన… అప్పట్లో ఆగ్రా భేటీల సంగతి తెలుసు కదా… దానికి పూర్వరంగం సిద్ధం చేసిందే అద్వానీ… నిజానికి వాజపేయి ఏదో తొందరపడి ముషారఫ్‌తో ఏదో ఒప్పందానికి రెడీ అవుతుంటే, అద్వానీయే అడ్డుపడ్డాడు అనేదే ఇన్నేళ్ల ప్రచారం… కానీ ఈ రచయిత కొత్త కథ చెప్పాడు ఈ పుస్తకంలో…
ఒక ఉపప్రధాని ఇంటికి అర్ధరాత్రి ఎవరో వస్తే, అక్కడి గన్‌మెన్ ద్వారా, ఇంటలిజెన్స్ వర్గాలకు, అక్కడి నుంచి వాజపేయికి సమాచారం వెళ్లదా..? ఇదీ ప్రశ్న… నిజమే, వెళ్లే ఉండవచ్చు, వాజపేయికి తెలిసే జరిగి ఉండవచ్చు… కానీ పాకిస్థానీ హైకమిషనర్‌తో రహస్య భేటీల సంగతి బయటికి తెలిస్తే అద్వానీ కెరీర్ అప్పుడే చిక్కుల్లో పడి ఉండేది… వీహెచ్ఫీ, ఆర్ఎస్ఎస్ అస్సలు సహించేవి కాదేమో… (ఓసారి పాకిస్థాన్ వెళ్లినప్పుడు జిన్నా మీద నాలుగు మంచి మాటలు మాట్లాడినందుకే అద్వానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది…)
మరి ఈ క్వాజీకి, కరణ్ థాపర్‌కూ దోస్తీ ఏమిటీ అంటే..? కరణ్ తండ్రి, క్వాజీ మామ ఇంగ్లండ్‌లో కొలీగ్స్… కరణ్ థాపర్ అద్వానీ కుటుంబానికి కూడా సన్నిహితుడు… అలా ఓ మధ్యవర్తి దొరికాడు… సరే, కారణాలేవైనా వాజపేయి, ముషారఫ్‌ల ఆగ్రా భేటీ అడ్డంగా ఫ్లాపయింది… దాన్నలా వదిలేస్తే… పార్లమెంటు మీద దాడి తరువాత సరిహద్దుల్లో ఆరు లక్షల సైన్యాన్ని ఇరువైపులా మొహరించారు… పాకిస్థానీ సైనికులు భారతీయ సైనికుల్లా వేషాలు వేసుకుని, సరిహద్దు దాటి, కాలూచక్ సైనిక ఆవాసాన్ని చుట్టుముట్టి, 30 మందిని కాల్చారు… మహిళలు, పిల్లలు కూడా మృతుల్లో ఉన్నారు… భారతీయ సైనిక కుటుంబాలు ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నాయి… కానీ వాజపేయి, అద్వానీ పాకిస్థాన్ మీద దాడికి సిద్ధపడలేదు…
ఇదే క్వాజీని దేశం విడిచివెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది… ఇదే అద్వానీ మళ్లీ క్వాజీని తన ఇంటికి రహస్యగా పిలిపించుకుని, సాదరంగా వీడ్కోలు ఇచ్చాడు… ఇది బయటికి పొక్కినా రచ్చ రచ్చయి ఉండేది… ఈ వీడ్కోలు సమయంలో అద్వానీ, క్వాజీ కన్నీటి ఆలింగనాల వేళ అద్వానీ భార్య కమల కూడా అక్కడే ఉంది… అద్వానీ చేసింది మంచో చెడో వదిలేయండి… కానీ ఆ యుద్ధ ఉద్రిక్తతల నడుమ దేశ ఉపప్రధాని అన్నిసార్లు శత్రుదేశపు హైకమిషనర్‌ను అన్నిసార్లు తన అధికార నివాసంలో రహస్యంగా కలుసుకోవడం విస్మయకరమే… ఈ తెగువ, ఈ చొరవ, ఈ తెగింపును పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసే విషయంలో అద్వానీ ఎందుకు కనబర్చలేకపోయాడు..? ఇదీ ప్రశ్న… దానికి వాజపేయి పడనిస్తే కదా… ఇదీ సింపుల్ ఆన్సర్..!!
Share this Article