ముందుగా నువ్వు ఇది చెప్పు రాహుల్… కేసీయార్ ఏమన్నాడు..? ముందస్తుకు నేను రెడీ అన్నాడు… డేట్ విపక్షాలనే చెప్పమన్నాడు… నువ్వు ఇనీషియేటివ్ తీసుకుని మీడియేట్ చేయి రాహుల్ అని నీకు కూడా చెప్పాడు… విపక్షాలు డేట్ చెబితే వెంటనే అసెంబ్లీని రద్దు చేస్తానన్నాడు… ఇదంతా ప్రెస్‌మీట్‌లో, లక్షల మంది ప్రజలు చూస్తుండగా, లైవ్‌లో చెప్పాడు కదా… మళ్లీ ఇదే కిరికిరి రాహుల్… తొండి, బభ్రాజమానం, భజగోవిందం…
ఉంటాదివయా, గిట్లుంటాదివయా… కేసీయార్ సవాల్ విసరగానే బండి సంజయ్ సై అన్నాడు… ఛలో, పోదాం పద యుద్ధానికి అనేశాడు… ఇక రేవంత్‌రెడ్డి అయితే కేసీయార్ తెలంగాణ బిడ్డే గనుక అయితే నాలుగు రోజుల్లో నిర్ణయం తీసేసుకో అని ఉల్టా సవాల్ విసిరాడు… వాళ్లిద్దరూ బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు… బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కూడా సై అన్నాడు… (కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఇంకా నిద్రలేచినట్టు లేదు…) సో, ఇప్పుడు స్పందించాల్సింది టీఆర్ఎస్ అధ్యక్షుడు… అంటే కేసీయార్… కానీ ఇప్పుడు ఏమంటున్నారు..?
Ads
కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ స్పందించాలి కదా… కానీ ఓ మంత్రి తలసాని స్పందించాడు… కేసీయార్ కావాలని తప్పించుకునే ప్రొటోకాల్ ఆహ్వానాలకు తలసాని వెళ్తుంటాడు కదా, నేనే నెంబర్ టూ అనుకున్నాడేమో బహుశా… ఓ ప్రెస్‌మీట్ పెట్టేసి… ‘‘పార్లమెంటును రద్దు చేయడానికి మోడీ సిద్ధమైతే మేం అసెంబ్లీని రద్దు చేస్తాం’’ అన్నాడు… మళ్లీ గిదేంది..? దానికీ దీనికీ గొళ్లెం ఏంది..? ఇదేనా ముందస్తు మీద పార్టీ విధానం..? అది ఓ మంత్రి చెబుతున్నాడా..? అంటే మీ సీఎం సవాల్ విసురుతాడు, ఓ మంత్రి దానికి భిన్నంగా ప్రకటనలు చేస్తాడు…
అందుకే రాహుల్… తరువాత నెలకో, రెండు నెలలకో మళ్లీ మీడియా ముందుకు వస్తాడు కదా కేసీయార్… అప్పుడు గట్టిగా అడుగు… సరేనా..? ఇంకా నయం… తలసాని బతికించాడు… ముందుగా పార్లమెంటు రద్దు చేయాలి దగ్గర ఆగాడు సంతోషం…, నాగాలాండ్ సర్కారును రద్దు చేయాలి, కశ్మీర్ 370 ఆర్టికల్ పునరుద్ధరించాలి, త్రిపుర అసెంబ్లీని రద్దు చేయాలి, గోవాలో రాష్ట్రపతిపాలన పెట్టాలి అనే షరతులు పెట్టలేదు…
ఇంకో మంత్రి ఉన్నాడు గంగుల… నిర్ణయం తీసుకోవల్సింది మోడీ అట… మోడీ డేట్ ప్రకటిస్తే కేసీయార్ రెడీ అట… ఆహా… ఏం మంత్రులను పెట్టుకున్నాడో కదా కేసీయార్… అసలే పీకే రిపోర్టులు తేడా కొడుతున్నయ్… లేటయ్యేకొద్దీ ఇంకా సర్కారుకు వ్యతిరేకంగా జనం భగ్గుమంటారనీ, ఇప్పటికే పరిస్థితి చేజారిపోతోందని అంటున్నాడట… మరి ముందస్తు నయమే కదా… ఇప్పుడే రద్దు చేస్తే గుజరాత్ ఎన్నికలతో… కాదంటే వచ్చే ఏప్రిల్‌లో కర్నాటకతో ఎన్నికలుంటయ్…
అసలు బీజేపీకి అన్నిచోట్ల అభ్యర్థులే లేరు అనేది టీఆర్ఎసే… ఎన్నికలకు ఇప్పుడు వెళ్లినా వందకు తక్కువ రావనే ధీమా చూపించేదీ టీఆర్ఎసే… మరెందుకు ఇలా ‘‘పార్లమెంటు రద్దు చేయాలె, మోడీ డేట్ చెప్పాలె’’ అని కొత్త కిరికిరి మాటలు..? రాహుల్, నువ్వయినా చెప్పొచ్చు కదా… ఏకనాథ్ షిండేల గురించి మరీ ఎక్కువ ఆలోచించి, మైండ్ ఖరాబ్ చేసుకోకుండా… ముందస్తుకు రెడీ అయిపోయి, బాగా ఎగురుతున్న బండి, రేవంతుల నోళ్లు మూయించాలని చెప్పు… గీ తలసానీ, గీ గంగుల, గీ ఎర్రబెల్లి కాదు… ఈసారి రెండున్నర గంటలు దాటి మూడున్నర గంటల ప్రెస్‌మీట్ పెట్టినా సరే, కేసీయారే క్లారిటీ ఇస్తే బెటర్ అని చెప్పు రాహుల్…
Share this Article