పార్ధసారధి పోట్లూరి ………. సెంట్రల్ చైనా నగరం అయిన Zhengzhou లో ప్రజలు భారీగా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. చైనాలోని నాలుగు గ్రామీణ బాంకులలో భారీగా అవకతవకలు జరగడంతో ప్రజలు తమ సేవింగ్స్ అక్కౌంట్స్ మరియు డిపాజిట్స్ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగా, వాటిని ఇవ్వడానికి సదరు బాంకులు తిరస్కరించాయి… నిధుల లభ్యత లేని కారణంగా డబ్బు డ్రా చేయకుండా ఫ్రీజ్ చేయబడడం వలన కావొచ్చు !
సమస్యకి బీజం 2011 లోనే పడ్డది! 2011 లో చైనాలోని వివిధ బాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, అడిగినంత నగదు లభ్యత లేని కారణంగా ప్రజలు తమ డబ్బుని విత్ డ్రా చేసుకోలేరని, కొంచెం సమయం ఇస్తే మీ డబ్బుని దశల వారీగా వెనక్కి తీసుకోవచ్చని అధికారులు నచ్చచెప్పడంతో అప్పట్లో పెద్దగా గొడవలెవీ జరగకుండానే ఆ సమస్య సద్దు మణిగింది. కానీ అప్పట్లోనే సమస్య మూలాలేంటో తెలిసినప్పటికీ దానిని కప్పి పుచ్చి కాలం గడిపేశారని తెలుస్తున్నది…
మళ్ళీ 2022 ఏప్రిల్ నెలలో ప్రజలు తమ డబ్బుని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, నగదు లేని కారణంగా మీరు మీ డిపాజిట్స్ కానీ లేదా సేవింగ్స్ అక్కౌంట్స్ నుండి కానీ డబ్బులు తీసుకోలేరు అంటూ చెప్పారు అధికారులు. దాంతో ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడంతో కోవిడ్ ఇంకా పూర్తిగా పోలేదని, ప్రజలు గుంపులు గుంపులుగా చేరి ప్రదర్శన చేస్తే కోవిడ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉందని పోలీసులు పదే పదే హెచ్చరికలు చేయడంతో ప్రజలు వెనక్కి వెళ్లిపోయారు… కానీ ఈ నెల 10 తారీఖు ఆదివారం మరియు సోమవారం రోజున చైనా సెంట్రల్ బాంక్ ముందు నిరసనకి దిగారు.
Ads
ప్రభుత్వం పోలీసులని నేరుగా రంగంలోకి దింపితే విమర్శలు వస్తాయనే భయంతో పోలీస్ డ్రెస్ లేకుండా కేవలం తెల్ల చొక్కాలతో పోలీసులు ఆందోళనకారులని రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి అంబులెన్స్ లలో నగరం బయటికి తీసుకెళ్ళి వదిలేశారు. అయితే ఈ దృశ్యాలని అక్కడ ఆందోళన చేస్తున్న ప్రజలు మొబైల్ ఫోన్లతో వీడియో తీసి, దానిని వీబో [చైనాకి చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్] లో పోస్ట్ చేయగానే క్షణాలలో లక్షలలో వాటిని షేర్ చేశారు ప్రజలు… అంటే అక్కడి ప్రభుత్వం మీద ప్రజలలో ఆగ్రహం ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
1. సెంట్రల్ చైనాలోని Zhengzhou నగరంలోని చైనా సెంట్రల్ బాంక్ ముందు నిరసనకారులు ధర్నాకి దిగారు.
2. ప్రజల కధనం ప్రకారం హేనాన్ ప్రావిన్స్ లోని నాలుగు గ్రామీణ బాంకుల్లో గత ఏప్రిల్ నెలలో ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రకటన చేస్తే ప్రజలు లక్షల సంఖ్యలో తమ పొదుపు సొమ్ముని ఆయా బాంకుల్లో డిపాజిట్ చేశారు… అయితే ఇదంతా థర్డ్ పార్టీ app ద్వారా ఆన్లైన్ లో ప్రజలు డిపాజిట్ చేశారు.
3. ఈ సొమ్ముని Lu Yi [లు యి] అనే వ్యక్తి హేనాన్ న్యూ ఫోర్చ్యూన్ గ్రూప్ [Henan New Fortune Group] అనే సంస్థని నిర్వహిస్తున్నాడు… ఈ Henan New Fortune Group కి నాలుగు గ్రామీణ బాంకుల్లో షేర్లు ఉన్నాయి… పెద్ద మొత్తంలో. Lu Yi అనే వ్యక్తి నాలుగు గ్రామీణ బాంక్ అధికారులకి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి, థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా ప్రజల నుండి ఎక్కువ వడ్డీ ఆశ చూపించి వసూలు చేశాడు. అలా సేకరించిన డబ్బుని Henan New Fortune Group లోకి మళ్లించాడు… అక్కడ నుండి దేశంలోని వివిధ సంస్థలలోకి డబ్బుని మళ్లించాడు… సమస్య ఎక్కడ నుండి వచ్చింది అంటే ఎక్కువ వడ్డీ ప్రకటన ఆయా బాంకుల పేరుతో ఉండగా, థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా డిపాజిట్ చేయమని అడిగాయి బాంకులు.
4. ప్రస్తుతం హేనాన్ ప్రావిన్స్ లోని ప్రజలే కాదు, చైనా దేశవ్యాప్తంగా ప్రజలు Zhengzhou నగరంలోని చైనా సెంట్రల్ బాంక్ ముందు నిరసన చేయడానికి వచ్చారు. ఆన్లైన్ డిపాజిట్ కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజలు నాలుగు గ్రామీణ బాంకుల్లో డిపాజిట్ చేశారు తమ డబ్బుని…
5. Zhengzhou నగర పోలీస్ కమీషనర్ గత ఏప్రిల్ నెల నుండి ఈ స్కామ్ మీద దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే చాలా మంది బాంక్ అధికారులని సర్వీస్ నుండి తొలగించి అరెస్ట్ చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నదని, ఈ విషయం ప్రజలకి తెలియచేసినా వివిధ ప్రాంతాల నుండి ప్రజలు Zhengzhou నగరంలోని ప్రవేశించి ధర్నాకి దిగారని, దాంతో చేసేది లేక పోలీసులని సివిల్ డ్రస్ లో పంపించి వాళ్ళని వెనక్కి పంపడానికి ప్రయత్నించాల్సి వచ్చింది అని వివరించారు…
6. చైనాలోని బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం బాంకులో ఎంత డబ్బు డిపాజిట్ చేసినా ఒకవేళ ఏదన్నా కారణం చేత బాంక్ మూతపడితే గరిష్టంగా 5,00,000 యువాన్లు మాత్రమే వెనక్కి ఇవ్వగలుగుతాయి.
7. ఆదివారం రోజున ఆందోళన చేయడానికి వచ్చిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. వీళ్ళంతా గరిష్టంగా 50 లక్షల యువాన్ల నుండి 80 లక్షల యువాన్ల వరకు ఆన్ లైన్ లో డిపాజిట్ చేసినవారే ! వీళ్ళకి తెలుసు బాంకులు మూత పడితే లేదా నష్టపోతే తిరిగి వెనక్కి వచ్చేది 5 లక్షల యువాన్లు మాత్రమే అని… అందుకే చైనా సెంట్రల్ బ్యాంక్ ముందు ఆందోళన చేయడానికి వచ్చారు. 5 లక్షల యువాన్ల కంటే తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంది.. కానీ వాళ్ళంతా రోడ్ల మీదకి రాలేదు ఎందుకంటే తాము డిపాజిట్ చేసిన మొత్తంలో కనీస డబ్బు తమకి వెనక్కి వస్తుందని భరోసా !
8. కోవిడ్ వల్ల చైనాలోని చాలా సంస్థలు నష్టాలలో ఉన్నాయి. కొన్ని సంస్థలు మూత పడగా మరికొన్ని ఇలాంటి మోసాలకి పాల్పడి ఎలాగయినా నిలదొక్కుకోవాలనే ఆశతో ఉన్నాయి…
9. చైనాలో ఏదన్నా బ్యాంక్ మోసం జరిగితే మూడు నెలలలోపే విచారణ జరిగి దోషులకి శిక్ష పడుతుంది కానీ ఈ సారి అలా చేయలేకపోతున్నది చైనా అని అభిజ్ఞ వర్గాల భోగట్టా ! ఏదన్నా తీవ్రమయిన చర్య తీసుకోవాల్సి వస్తే దాదాపుగా సగం చైనా సంస్థలు శాశ్వతంగా మూత పడతాయనే భయం ఉండడం వలన జాప్యం జరుగుతున్నది…
10. మరోవైపు కోవిడ్ వల్ల చైనా సంస్థలు విదేశాలలో పెట్టుబడులు పెట్టి, అక్కడ పనులు ఆగిపోవడం వలన చైనా సెంట్రల్ బాంక్ నుండి తీసుకున్న అప్పుని సకాలంలో చెల్లించలేకపోవడంతో ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ కూడా నగదు నిల్వల కొరతని ఎదుర్కుంటున్నది…
చైనాకి సంబంధించి ఎలాంటి విషయాలు బయటికి రావు దాదాపుగా. కానీ ఎన్నాళ్ళని రహస్యంగా ఉంచగలదు? Zhengzhou నగరంలోని చైనా సెంట్రల్ బాంక్ ముందు జరిగిన దృశ్యాలని, ప్రజలే కావాలని ఇతర దేశాలకి తెలియాలనే ఉద్దేశ్యంతోనే వివిధ రూపాలలో దేశం బయటికి పంపించారని తెలుస్తున్నది. అలా బయటికి వచ్చినవే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూడగలుగుతున్నాము… కానీ చైనాలో సోషల్ మీడియా మీద కఠిన నిఘా ఉంటుంది… 90% వీడియొ, ఫోటోలని వెంటనే డిలీట్ చేసింది వీబో నుండి… కానీ కొన్ని వేరే మార్గాల ద్వారా ప్రపంచానికి తెలిసాయి…
Share this Article