నిజానికి పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదు…. తెలంగాణ ప్రజల మూడ్ మీద ఆరా మస్తాన్‌రావు సర్వే నివేదిక వివరాలు చదువుతుంటే అది వాస్తవాలకు దూరంగా ఉన్నట్టు కూడా అనిపించలేదు… అంకెల సంగతి తరువాత, ప్రజల మూడ్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు తెలుసు… తెలుసు కాబట్టే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.., కాంగ్రెస్‌ను ఒక్క మాటా అనకుండా, ప్రజల వర్తమాన సమస్యల గురించి పట్టకుండా మోడీని కేసీయార్ రెండున్నర గంటలపాటు వాషింగ్ పౌడర్ నిర్మా సర్ఫ్‌తో కడిగినప్పుడే అర్థమైంది… ఎక్కడో బాగా తేడా కొడుతోందని…
హుజూరాబాద్ ఎన్నిక కేసీయార్‌ను నేల మీదకు దింపింది అనడంలో తప్పులేదు… ఆ స్థాయిలో ప్రలోభాలు, పథకాలు ప్రపంచంలో ఏ ఎన్నికలోనూ చూసి ఉండం, ఐనా ప్రజలు ఈటలకే జై అన్నారు… అది బలంగా తాకింది కేసీయార్‌కు… పీకే అన్నాడు, సర్వేలు అన్నాడు… తీరా అవీ టీఆర్ఎస్ వోట్ల పతనాన్నే సూచిస్తున్నాయి… జాతీయ పార్టీ అన్నాడు, ఇంకేదో అన్నాడు, అవేవీ వర్కవుట్ అయ్యేవి కావని తెలిసింది… వాట్ టు డు అనుకుని మథనంలో పడ్డాడు…
ఆరా మస్తాన్ సర్వేకు కాస్త క్రెడిబులిటీ ఉంది… ఆ వివరాల్లోకి ఓసారి వెళ్తే… టీఆర్ఎస్ పట్ల ఆదరణ 38.88 శాతానికి పడిపోగా, బీజేపీ బలం 30.48 శాతానికి పెరిగింది… కాగా కాంగ్రెస్ 23.71 శాతానికి పడిపోయింది… కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ బెల్టులో ప్లస్ హైదరాబాద్, రంగారెడ్డి బెల్టులో బీజేపీ బలం బాగా పుంజుకోగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ బెల్టులో ఇప్పటికీ కాంగ్రెస్ బలంగానే ఉంది… మెదక్, మహబూబ్‌నగర్ బెల్టులో మిక్స్‌డ్…
Ads
కొద్దిరోజులుగా పీకే సర్వే ఫలితాలు పత్రికల్లో సూచనప్రాయంగా వస్తూనే ఉన్నాయి… మొన్న ఆంధ్రజ్యోతిలో బీజేపీ అంతర్గత సర్వేలో 30 సీట్లు రానున్నట్టు రాశారు… నిజానికి ఈ ఆరా మస్తాన్ సర్వే చెప్పేది ఏమిటంటే..? ఇప్పటికీ జనాదరణ టీఆర్ఎస్ పట్ల ఉంది… కానీ బీజేపీ పెరిగింది… కాంగ్రెస్ కోల్పోతున్న వోట్లను బీజేపీ పెంచుకుంటోంది… ఏమిటీ కాంగ్రెస్ దురవస్థ..?
ప్రధాన కారణాలు కొన్ని… 1) కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినా సరే వాళ్లు కేసీయార్ క్యాంపులో చేరిపోతారు 2) కలిసికట్టుగా కేసీయార్‌ను దింపేసే ఐక్యత ఈ నాయకుల్లో లేదు 3) కేసీయార్‌ను గద్దె దింపాలంటే అది బీజేపీకే సాధ్యం…. అయితే ఈ అంకెల్లో మార్పులు బోలెడు ఊహించుకోవాలి మనం… ఈ సర్వే మొదటి దశ అప్పుడెప్పుడో నవంబరులో జరిగింది… తరువాత దశ మార్చిలో జరిగింది… ఇప్పటికి బీజేపీ బలం పెరగొచ్చు లేదా టీఆర్ఎస్ బలమే పెరిగి ఉండవచ్చు… పైగా ఆదరణను వోట్లలోకి కన్వర్ట్ చేసుకోవడమే పెద్ద టాస్క్… ఒకటిన్నర శాతం జగన్ బదులు చంద్రబాబును కుర్చీ ఎక్కించిన తీరు చూశాం కదా… సీట్ల సంఖ్యను చాలా ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి…
కాకపోతే కేసీయార్ జాతీయ పార్టీ ఆలోచనను అటకమీద పారేసి, సొంత రాష్ట్రంలో చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో పడ్డాడా అనేది ఓ పెద్ద ప్రశ్న… తను మోడీని తిట్టేకొద్దీ బీజేపీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిపోతోంది… కౌంటర్ ప్రొడక్ట్… ప్రజల అసంతృప్తి కారణాల్లో కుటుంబ పాలన అనేది ఓ ముఖ్య కారణం… ఎస్, బీజేపీకి కూడా తెలుసు… అందుకే అన్నీ వదిలేసి మొన్నటి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ‘‘పరివార్‌వాద్’’ అంశాన్నే పదే పదే చర్చల్లోకి తీసుకొచ్చింది…
సో, కేటీయార్‌ను ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేనట్లే… బీజేపీ మరింత బలంగా కుటుంబపాలన అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోబోతోంది… ముందస్తు మీద సీరియస్ ఆలోచన సాగుతోంది… కాలహరణం జరిగేకొద్దీ బీజేపీ పుంజుకుంటుందనేది ఆందోళన… అయితే ఇల్లలకగానే పండగ అయిపోతుందా..? లేదు… లేదు… బీజేపీకి నిజంగానే 30-40 స్థానాలకు మించి బలమైన అభ్యర్థులు లేరు… సో, కేసీయార్ టికెట్లు నిరాకరించే నాయకులే బీజేపీకి దిక్కు కాబోతున్నారు… అంటే వలసవాదమే దిక్కు… ఇది ఒరిజినల్ బీజేపీ సంప్రదాయ నేతలకు చెంపపెట్టు వంటి పరిణామం…
సరే, రాజకీయాల్లో అంతిమంగా కుర్చీలు, నంబర్లాటలో ప్రధానం అనుకున్నా సరే… బీజేపీకి కేసీయార్ వ్యతిరేక వోటు చీలిపోవడమే ప్రధాన సమస్య… బీఎస్పీ, వైఎస్సార్టీపీలు కూడా దానికే ఉపయోగపడతాయి… టీఆర్ఎస్‌కు ఓ పది సీట్లు తక్కువ పడ్డా సరే, మజ్లిస్ ఉండనే ఉంది… (కాకపోతే ఇంకా నెత్తి మీద ఎక్కుతుంది…) మరీ అవసరమైతే కాంగ్రెస్ నుంచి లాగిపారేయగలడు కేసీయార్… సో, బీజేపీకి ఎవరైనా ఏకనాథ్ షిండే దొరికితే తప్ప దానికి కుర్చీ దక్కదు… పైగా బీజేపీలోనే కేసీయార్ వీరాభిమానులు ఉన్నారుగా… వాళ్లను కట్ చేయగలదా బీజేపీ హైకమాండ్..?
కేసీయార్ ఎదుట ఈ కుప్పిగంతులు కుదరవు… బలంగా తనకు ఎదురొడ్డి, మాటకుమాట దీటుగా బదులివ్వగల కేరక్టర్ కావాలి… ఖమ్మం, రంగారెడ్డి వంటి జిల్లాల్లో కొందరు డైలమాలో ఉన్నారు… వాళ్లు ఇప్పుడు బీజేపీ వైపు నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది… అయితే వాళ్లతో సంప్రదింపులు జరిపి, బీజేపీ దొడ్లోకి తీసుకొచ్చే నాయకత్వం కావాలి… అయితే ఒక్కటి మాత్రం నిజం… కేసీయార్ అనాలోచితంగా కాంగ్రెస్‌ను తొక్కీ తొక్కీ… బీజేపీ ఎదుగుదలకు స్వయంగా ఊపిరిపోశాడు… ఏమో, అవసరమైతే రేప్పొద్దున మళ్లీ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తాడేమో కుర్చీ నిలుపుకోవడానికి…! ఇదీ కాలమహిమ..!!
Share this Article