పార్ధసారధి పోట్లూరి ………. సంక్షోభంలో ఉన్న శ్రీలంకని వదిలి అధ్యక్షుడు గోటబయ రాజపక్షే బతుకుజీవుడా అంటూ పారిపోయాడు ! సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజలని వాళ్ళ కష్టానికి వాళ్ళని వదిలేసి అధ్యక్షుడు గోటబయ రాజపక్షే పారిపోయాడు… గత వారం రోజులుగా ప్రజలు శ్రీలంక అధ్యక్ష భవనంతో పాటు ప్రధాని కార్యాలయం మీద దాడి చేసి అక్కడే ఉండి పోయారు. అప్పటికే రణీల్ విక్రమ సింఘే రాజీనామా చేసి వెళ్ళిపోవడం, మరోవైపు గోటబయ అధ్యక్ష భవనం హడావిడిగా ఖాళీ చేసి రహస్య ప్రాంతానికి వెళ్ళిపోవడంతో, ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా తప్పించుకున్నాడు.
గోటబయ చేసిన మరో తప్పిదం ఏమిటంటే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండా దేశం వదిలి వెళ్ళిపోవడం. ఇప్పుడు శ్రీలంకలో పరిపాలన చేయడానికి మంత్రులు అంటూ ఎవరూ లేకపోవడంతో సైన్యం దేశాన్ని తన అధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ సైన్యం మాత్రం ఏం చేయగలుగుతుంది ? అన్నీ సవ్యంగా ఉండి ఉంటే సైన్యం పరిపాలన చేయగలుగుతుంది కానీ లంక సెంట్రల్ బాంక్ లో డాలర్లు లేవు. ఇక పెట్రోల్, డీజిల్ నిల్వలు రేషన్ పద్ధతిలో ఇస్తున్నారు.
ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నా క్యూ ఉన్న వాళ్ళకి కనీసం 2 లీటర్ల పెట్రోల్ దొరకడానికి రెండు రోజులు పడుతున్నది. విద్యుత్ సరఫరా అయితే రోజులో కొన్ని గంటలు మాత్రమే సరఫరా అవుతున్నది. ఇక నిత్యావసర వస్తువుల ధరలు 300% పెరిగిపోయాయి. శ్రీలంక ద్రవ్యోల్బణం రేటు వచ్చేసి ప్రస్తుతం 54.6% గా ఉన్నది. ఈ పరిస్థితుల్లో సైన్యం దేశాన్ని అధీనంలోకి తీసుకున్నా పరిస్థితిలో మార్పు ఉండదు, పైగా విదేశీ సహయం చేయడాని ఏ దేశం కూడా ముందుకు రాదు సైన్యం చేతిలో అధికారం ఉంటే !
Ads
సహాయం చేయడానికి ప్రస్తుతం ఏ దేశం కూడా సిద్ధంగా లేదు శ్రీ లంకకి ! బహుశా శ్రీలంక ప్రతిపక్షం నుండి ఎవరినన్నా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే అదీ అంతర్జాతీయ ద్రవ్య నిధి షరతులకి ఒప్పుకుంటే తప్పితే బెయిల్ అవుట్ పాకేజీ ఇవ్వదు. శ్రీలంకకి నేడు ఈ దుస్థితి రావడానికి ప్రధాన కారణం కేవలం కుటుంబ రాజకీయాలే ! స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అయితే బండారు నాయకే కుటుంబము లేకపోతే రాజపక్ష కుటుంబాలే శ్రీ లంకని పరిపాలిస్తూ వచ్చాయి.
విదేశీ అప్పులు 54 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇవి ఇప్పటికిప్పుడు తీసుకున్నవి కావు. గత మూడు దశాబ్దాలుగా IMF తో పాటు ఆసియా డెవలప్ బాంక్ [ADB] ల నుండి తీసుకున్నవే. ఇక శ్రీలంక ప్రభుత్వ బాండ్ల ని ప్రతీ సంవత్సరం విదేశీ మార్కెట్లలో అమ్ముతూ వచ్చింది అదీ ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తామనే హామీతో… శ్రీలంక ప్రభుత్వ బాండ్లని ఎక్కువగా కొన్నవి యూరోపియన్ దేశాలు… వాటి కాల పరిమితి తీరిపోయి చాలా రోజులు అయిపోయాయి కానీ అసలుతో పాటు వడ్డీ కలిపి ఇవ్వాల్సి ఉండగా మళ్ళీ వాటినే మరింత ఎక్కువ వడ్డీ కి తిరిగి అమ్మింది శ్రీలంక ప్రభుత్వం. ఇదంతా జరగడానికి 30 ఏళ్లు పట్టింది.
Share this Article