ఏదో తెలుగు సినిమా… భార్య మెడలో మంగళసూత్రం లేకపోవడాన్ని గమనించిన భర్త ‘ఏమైంది’ అని అడుగుతాడు… ఆమె చాలా తెలివిగా ‘మీరు కలకాలం చల్లగా ఉండాలని ఫ్రిజులో పెట్టానండీ’ అంటుంది… భర్త విపరీతంగా హర్ట్ అయిపోతాడు… ఒకవేళ ఆమె ఆ తాళిని బ్యాంకు లాకర్‌లో పెట్టేసి, చిరకాలం మీరు భద్రంగా ఉండాలని అక్కడ దాచిపెట్టానండీ అని చెబితే..? అప్పుడేమైపోవాలి ఆ మొగుడు…?
మద్రాస్ హైకోర్టు తాజా తీర్పు ఒకటి చదవగానే చకచకా ఇవే గుర్తొచ్చాయి… కేసు ఏమిటంటే..? శివకుమార్ అనే భర్త… ఈరోడ్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్… భార్యాభర్తల నడుమ గొడవలు… మనస్పర్థలు… విడాకులకు అప్లయ్ చేశాడు… చాలా ఏళ్లయింది లెండి… మన న్యాయవ్యవస్థ ఎంత వేగంగా కేసులు డిస్పోజ్ చేస్తుందో తెలుసు కదా…
ఫ్యామిలీ కోర్టు ఆయనకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించలేదు… నా కళ్ల ముందే తాళిని తీసిపారేసింది, మనసుకు కష్టంగా ఉంది, మా బంధాన్ని తెంచేసుకోవడమే కదా ఆమె ఉద్దేశం, ఇంతకుమించిన సాక్ష్యం ఏం కావాలి అంటాడు సదరు ప్రొఫెసర్ లాయర్… కానీ ఫ్యామిలీ కోర్టు వినిపించుకోలేదు… విడాకులకు నో అనేసింది… 2016లో…
Ads
కేసు హైకోర్టుకు వచ్చింది… మన న్యాయ అవస్థ పుణ్యమాని వాయిదాలు పడీ పడీ చివరకు తీర్పు దగ్గరకు వచ్చింది… భర్త చచ్చిపోయాకే తాళిని తీసేస్తారు… అది వివాహబంధం కొనసాగింపుకు ఓ సూచిక… దాన్ని తీసేసిందీ అంటే, అది ఒకరకంగా భార్య క్రూరత్వం… భర్తను హర్ట్ చేయడం… సో, విడాకులకు వోకే అనేసింది కోర్టు…
హిందూవివాహచట్టం ప్రకారం తాళి తప్పనిసరి కాదనీ, దాన్ని తొలగించడం అనేది పెద్ద సమస్యే కాదని ఆమె తరఫు లాయర్ వాదించాడు… కానీ కోర్టు ససేమిరా అనేసింది… వివాహానికి సంబంధించిన తంతులో తాళి కట్టడం కూడా ఓ భాగం… కట్టకపోవడం వేరు, కట్టాక దాన్ని తీసేయడం అంటే సదరు వివాహ బంధాన్ని తిరస్కరించడమే కదా అనేది కోర్టు వ్యాఖ్య…
‘‘ఆమె తన తాళిని బ్యాంకు లాకర్‌లో పెట్టింది… ఆమే అంగీకరిస్తోంది… భర్త బతికి ఉండగా, సంసారబంధం కొనసాగింపును కోరుకునే భార్య ఎందుకలా చేస్తుంది..?’’ అనడిగింది కోర్టు… ‘‘భర్త బతికి ఉండగానే తాళిని తీసిపడేయడం అంటే అది భర్తను తిరస్కరించడమే, ఒకరకంగా క్రూరత్వం’’ అని అభిప్రాయపడింది…
‘‘తాళి తీసేయడం అనేది భౌతికంగా చూస్తే పెద్ద విషయం కాదు, కానీ ఉద్దేశాలను బహిర్గతం చేస్తుంది… ఒకవైపు ఆ సంసారం అక్కర్లేదనే తన ఉద్దేశాల్ని బయటపెడుతూ, మరోవైపు విడాకులకు నిరాకరించడం ఏమిటి..?’’ అని ప్రశ్నించింది… ‘‘తన భర్తకు వుమెన్ కొలీగ్స్‌తో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ బదనాం చేసింది… పోలీసుల ఎదుట కూడా అదే చెప్పింది… ఇదంతా భర్తకు మానసిక వ్యధ కాదా..? మరి విడాకులు ఎందుకు మంజూరు చేయకూడదు..?’’ ఇదీ కోర్టు అంతిమ అభిప్రాయం…
నిజానికి వాళ్లు 2011 నుంచి విడిగా ఉంటున్నారు… భర్తతో తిరిగి కలిసి ఉండటానికి ఆమె ఏమీ ప్రయత్నించలేదు… కానీ విడాకులకు అంగీకరించదు… 2008లో పెళ్లయితే ఆ సంసారం సజావుగా సాగిందే తక్కువ… సో, ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆయనకు విడాకులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది… జస్ట్, పదేళ్ల జాప్యం… ఇంకెవర్నీ చేసుకోలేడు, ఆమె వదలదు… ఎందుకో తెలియదు… చివరకు మద్రాస్ హైకోర్టు ఆమె నుంచి అతనికి విముక్తిని ప్రసాదించింది… ఎహె, తాళిని తీసేస్తే క్రూరత్వంగా చిత్రీకరిస్తే ఎలా అంటారా..? అదొక్కటే కాదు, దాని చుట్టూ ఆమె గత వైఖరులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది… ఇక్కడ తాళి అనేది ఇష్యూ కాదు… ఆమె ప్రదర్శించిన వైఖరే ప్రధానం అయ్యింది…!!
Share this Article