ప్రెస్ క్లబ్బుల్లో ఓ సౌలభ్యం ఉంటుంది… జర్నలిస్టులు కాని వాళ్లు కూడా కార్పొరేట్ సభ్యత్వం తీసుకోవచ్చు… తద్వారా వాళ్లు క్లబ్బు యాక్టివిటీస్ వరకూ జర్నలిస్టులు అయిపోవచ్చన్నమాట… అయితే వోటు హక్కులు, పోటీచేసే అవకాశాలు ఉండవు… ఏదో నాలుగు పెగ్గులు, నాలుగు లెగ్గు పీసులు… బిర్యానీ పార్శిళ్లు… అంతే… అయితే కులసంఘాల్లో కూడా అలా ఎవరైనా మంచి స్పాన్సరర్లు దొరికితే… కులంలో చేర్చేసుకోవచ్చా..?
ఈ ప్రశ్న ఇప్పుడు తెలుగు వైశ్య సంఘాలను కుదిపేస్తోంది… దీనికి కారకుడు టీజీ వెంకటేష్… గతంలో తనకు వైశ్య కులసంఘాల పెద్దరికం ఏమీ లేదు… కానీ చిచ్చు పెట్టడంలో మొనగాడు… ఒక వాట్సప్ మెసేజ్ చదివాక లక్షల మంది వైశ్య కులస్థులకు బుర్ర తిరిగిపోయింది… పవన్ కల్యాణ్‌కు కూడా ఇప్పుడు వైశ్యుడేనట… ఇది చదవండి…
Ads
వరల్డ్ ఆర్య వైశ్యమహాసభ అట… ఇదెక్కడిది..? దానికి సమాధానం ఏమీలేదు, సింపుల్… తనే పెట్టేశాడు ఓ సంఘాన్ని… ఈమధ్య చాలామంది పెట్టేస్తున్నారు కదా… ఎవరికి వాళ్లే వైశ్యకులపెద్దలు… ఆర్య వైశ్య మహాసభ అనేది గతంలో చాలా బలమున్న సంఘం… ప్రస్తుత నాయకుల క్రియారాహిత్యం, స్వార్థపోకడలు, ఎట్సెట్రా కారణాలతో అది ఏనాడో బలహీనపడింది… దాని అనుబంధ సంఘాలూ అంతంతమాత్రమే అయిపోయాయి…
ఏ కులసంఘాలలో లేని విధంగా ప్రపంచంలోనే మొదటిసారి వివిధ కులనాయకులకు ప్రపంచ వైశ్య సంఘాలలో అవకాశం ఇస్తున్నాడట… ఆహా… ఏం సంస్కరణ..? ఎంత గొప్ప ఆలోచన..? (అసలు ఆయన గారి ప్రపంచ ఆర్య వైశ్య మహాసభలో సభ్యులెవరు అని మాత్రం ఎవరూ అడక్కండి, పాపాన పడిపోతారు… ఎవడు గుర్తించేది ఏముంది..? ఆయనే పెట్టేస్తాడు, ఆయనే గుర్తిస్తాడు…) ప్రపంచ స్థాయిలో నాయకత్వ అవకాశాలు కూడా అత్యంత ఔదార్యంతో ఇచ్చేస్తున్నాడట… ప్రపంచ వైశ్యులెవరూ ఇదేం ఖర్మరా బాబూ అని కన్నీళ్లు పెట్టుకోకండి, తను ఇంకా బాగా ఉద్దరించబోతున్నాడు…
మోడీ నాయకత్వం వర్ధిల్లాలట… పవన్ కల్యాణ్ (WAM… అనగా వరల్డ్ ఆర్య వైశ్యమహాసభ) నాయకత్వం వర్ధిల్లాలట… బీజేపీ జిందాబాద్ అట… అసలు ఇలాంటి పెడపోకడలకు అవకాశమిస్తున్న ఏపీబీజేపీ దరిద్రాన్ని ఏమనాలి..? అసలు ఈ పైత్యానికి పేరుందా..? ఎస్, ఆర్య వైశ్యమహాసభ నాయకుల అసమర్థత, స్వార్థ పోకడలతో వైశ్యసంఘాలు నిర్వీర్యం అయిపోయిన సంగతి తెలిసిందే… ఆమధ్య రోశయ్య అంత్యక్రియల సందర్భంలో ఈ నాయకుల దౌర్భాగ్య ప్రవర్తనను ‘ముచ్చట’ సవివరంగా వెల్లడించింది…
పెడపోకడలకు పోతున్న ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ (ఇది టీఆర్ఎస్ సానుకూల సంస్థ), ప్రపంచ ఆర్య వైశ్యమహాసభ (WAM, ఇది బీజేపీ సానుకూల సంస్థ)లను బహిష్కరించామని తాజాగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు… అయ్యా, మీరే సక్కగుంటే ఈ పిందెలు ఎందుకు పుట్టుకొచ్చేవి మహాశయా..? తప్పుకుని, కొత్త వాళ్లకు పగ్గాలు ఇవ్వొచ్చు కదా… ఇవ్వరు, వేలాడుతూనే ఉండాలి…
17న శంషాబాద్‌లో నిర్వహించే WAM సమావేశానికి తమకు ఏ సంబంధమూ లేదని ఆయన ఖండిస్తున్నాడు సరే… టీజీ వెంకటేష్ జనసమీకరణ చేస్తాడు, సభ నిర్వహిస్తాడు… జై వైశ్యసంఘం, జైజై పవన్ కల్యాణ్ నినాదాలూ హోరెత్తవచ్చు… ఫాఫం, వైశ్య జాతి ఎంత ఖిన్నపడి, ఎంత ఖేదపడి, ఎంత బాధపడితే ఎవరికేం పడుతుంది..? ఏదీ, అందరూ ఒక్కసారి నినదించండి… జై వైశ్య సంఘటన, జైజై పవన్ కల్యాణ్…!! అన్నట్టు, టీజీ వెంకటేష్‌కు ఓ సలహా… కరోనా అనంతరం చాలామందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి… చికిత్సలు కూడా ఉన్నాయి…
ఏపీబీజేపీకి ఎలాగూ ఓ సోయి లేదు, అందులో ఎవరికీ చటాక్ గుజ్జు లేదు కాబట్టి వాళ్లను ఏమీ అనడానికి లేదు…!! పోనీ, ఓ ప్రతిపాదన… నిన్ను కాపు కులసంఘాల్లో చేర్చుకోమని అడిగి చూడు ఒక్కసారి… కాస్త రక్షణ ఏర్పాట్లు చూసుకుని మరీ అడుగు, పర్లేదు…!! పవన్ కల్యాణ్ గతంలో ఏదో సందర్భంలో నేను రెల్లి కులస్థుడిని అని అత్యంత సంస్కరణయుతంగా ప్రకటించినట్టు గుర్తు… ఇప్పుడు వైశ్యకులస్థుడు కూడా…!!
Share this Article