వెదర్ వార్ఫేర్… అనగా వాతావరణ స్థితిగతులను అనూహ్యంగా మార్చేసి, శత్రువుకు అపార నష్టం కలగజేయడం… వాతావరణనీతి అనండి… ఇది సిద్ధాంతరీత్యా సాధ్యమే, దాన్ని ఖండించాల్సిన పనిలేదు… వారుణాస్త్రం… మనం రామాయణ, భారత పురాణాల దగ్గర నుంచీ వింటూనే ఉన్న ఆయుధం… హఠాత్తుగా వర్షాన్ని, నీటిని, వరదను ప్రయోగించడం… ఇక అసలు విషయంలోకి వద్దాం… గోదావరి హఠాత్ భారీ వరదలు విదేశీ కుట్రల ఫలితమేమో అనే సందేహాల్ని తెలంగాణ సీఎం కేసీయార్ వ్యక్తపరిచాడు… గతంలో కూడా లేహ్, లడఖ్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి కుట్రలు జరిగినట్టు విన్నాననీ, ఇప్పుడు ఈ కోణంలో అధ్యయనం అవసరమనీ అన్నాడు…
కాస్త వెనక్కి వెళ్దాం… మోక్షగుండం విశ్వేశ్వరయ్య వారసుడు, అపర భగీరథుడిగా మస్తు భుజకీర్తులు తగిలించబడిన కేసీయార్… తనే గోదావరికి కొత్త నడకలు నేర్పాడని మీడియా పేజీల కొద్దీ, రోజుల కొద్దీ రాసి పడేసింది, కూసి పడేసింది, చూపి పడేసింది… ఇది ప్రపంచంలోనే పదో వింత అనీ కీర్తించింది… ఎవడైనా కాళేశ్వరం మీద వ్యతిరేక వ్యాఖ్య చేస్తే వాడసలు మనిషే కాదన్నట్టుగా చూసింది… యావత్ ఇంజనీరింగ్ ప్రపంచం అన్నీ మూసుకుని, గమనిస్తూ, లోలోపల కుమిలిపోయింది…
మొన్నటి వర్షాలకు అన్నారం, మేడిగడ్డ పంపు హౌజులు మునిగిపోయాయి… సమర్థకులు, రోజూ ఠానుల కొద్దీ భజనలు నింపే మేధావులు, రచయితలు, రాజుగారి కొలువు బానిసలు పంపు హౌజులు అంటేనే ముగినిపోవడానికి కదా అన్నట్టుగా మాట్లాడారు… అంతేతప్ప, ఎక్కడెక్కడ లోపభూయిష్టంగా డిజైనింగ్ జరిగిందో ఇక ఎవరూ మాట్లాడలేదు, మాట్లాడే స్థితీ లేదు… అత్యంత చైతన్యవంతమైన, పోరాటశీల తెలంగాణ కదా…!!
Ads
హఠాత్తుగా కేంద్రంతో ఉమ్మడి పోరాటం చేద్దాం అని కేసీయార్ దేశంలోని నాన్ బీజేపీ నాయకులు, ముఖ్యమంత్రులతో మాట్లాడాడట… ఓ నోట్ ప్రగతి భవన్ నుంచి లీకవుతుంది… జాతీయ, ప్రాంతీయ మీడియా మొత్తం కళ్లు మూసుకుని రాసేసింది… కానీ కేసీయార్‌తో ఫోన్ చేయించుకోవడిన లీడర్లలో మాత్రం ఒక్కరు కూడా స్పందించలేదు, నిజమే, కేసీయార్ కాల్ చేశాడు, మోడీపై ఇక యుద్ధమే అని ఎక్కడా చిన్న మాట కూడా మాట్లాడలేదు… ఓహో, కాళేశ్వరం వైఫల్యాలు, లక్ష కోట్ల ప్రాజెక్టు దుర్గతి ప్రజల్లో చర్చకు రాకుండా ‘‘భలే డైవర్షన్ టెక్నిక్’’ ప్రయోగించాడు కేసీయార్ అని మెచ్చుకున్నవాళ్లూ కనిపించారు…
ఫాఫం, గవర్నరమ్మ హెలికాప్టర్ అడిగినా ఇవ్వరు కదా… అందుకని రైల్లో బయల్దేరింది… ఇక తప్పదని రాజుగారు కూడా వరద ప్రాంతాల పర్యటనకు బయల్దేరారు… అదుగో, ఆ సందర్భంగా ఈ విదేశీ శక్తుల వరద కుట్రను ప్రస్తావించాడు… ఇంకేముంది..? మీడియా, సోషల్ మీడియాలలో ఇదే చర్చ… క్లౌడ్ బరస్టేనా..? అనగా మేఘాల్ని ఎవరైనా పగులగొట్టేస్తున్నారా..? నిజానికి జూలైలో ఈ స్థాయి గోదావరి వరదలు అసాధారణమేమీ కాదు… పంపు హౌజుల దగ్గరే తీసుకుంటే 1986లో రికార్డయిన వరదే ఇప్పుడు కూడా… భద్రాచలం దగ్గర 75.6 అడుగుల వరద కూడా అప్పుడు రికార్డయిందే… కాళేశ్వరం వద్ద 30 సెం.మీ వర్షం కూడా అసాధారణం ఏమీ కాదు… అసలు ఎన్నేళ్ల రికార్డులు చూసి, ఆయా పాయింట్లలో ‘‘గరిష్ట సంభావ్య వరద’’ను (Maximum Probable Flood) లెక్కకట్టారు..?
అసలు పంపు హౌజులు రివర్ బెడ్‌కు ఎంత దూరంలో ఉంటే బెటర్..? రిటైనింగ్ వాల్ ఎందుకంత సులభంగా కొట్టుకుపోయింది..? అసలు కాళేశ్వరం డిజైనింగులోనే ఉన్న నష్టదాయక అంశాలేమిటి..? ఒక్క ఇంజినీరూ మాట్లాడటం లేదు… ఇక వెదర్ వార్ఫేర్ దగ్గరకొద్దాం…
- క్లౌడ్ సీడింగ్… ఇది మనకు తెలిసిన పదమే… వైఎస్ పీరియడ్‌లో ఓ స్కాం అని కూడా తెలుగుదేశం గగ్గోలు పెట్టింది… విమానాల ద్వారా మేఘాల్ని చల్లబరిచే రసాయనాల్ని మేఘాలపై జల్లి వర్షింపజేయడం… అది ఎక్కడా అంత పెద్దగా సక్సెస్ కాలేదు… ఐనా ఇది వెదర్ వార్ఫేర్లో పనిచేయదు…
- క్లౌడ్ బరస్ట్… ఇదీ మనం వింటున్నదే… రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్ ఎక్కడ కొంప ముంచుతాయో అన్నట్టుగా కురిసిన భారీ వర్షాలు చూశాం… క్యుములోనింబస్ మేఘాలు కుండబోతగా ఒకేచోట టీఎంసీల కొద్దీ నీటిని వర్షించడం క్లౌడ్ బరస్ట్… ఒక కి.మీ. పరిధిలో కొన్ని గంటల్లో 11 సెం.మీ వర్షం కురిస్తే అది క్లౌడ్ బరస్ట్… గోదావరి పరీవాహకప్రాంతంలో ఇదేమీ కనిపించలేదు…
- ఫ్లాష్ ఫ్లడ్… ఎగువ వర్షాలు, వరదలతో డిశ్చార్జ్ మార్గాలు కనిపించక ముంచెత్తడం… అదీ లేదు ఇక్కడ …
పాకిస్థాన్ ఓ తుఫాల్ కేసు… వాడికి క్లౌడ్ బరస్ట్ చేసేంత తెలివి లేదు… చైనా వాడికి ఉంది… వాడు బ్రెయిన్ కంట్రోల్ వెపన్స్ దగ్గర నుంచి వెదర్ వార్ఫేర్, బయాలాజికల్ వెపన్స్ దాకా ఏదైనా చేయగలడు… కరోనా ఆ క్రమంలో పుట్టిందే అనే వాదన తెలుసు కదా… అయితే సింధు మీద ప్రయోగించి చూడాలి… కానీ అది తన రోగ్ ఫ్రెండ్ పాకిస్థాన్‌కే నష్టం… ఇక హిమాలయ పాదాల దగ్గర పారే నదులు ఉప్పొంగేలా, ఆ ప్రాంతాల మేఘాల్ని బరస్ట్ చేయాలి… బ్రహ్మపుత్ర, గంగ వంటివి… వాటికి ఈమధ్యకాలంలో అసాధారణ, అనూహ్య వరదలేమీ చూడలేదు…
క్లౌడ్ బరస్ట్… 1) అందుబాటులో ఉన్న మేఘాలనే బరస్ట్ చేయడం… 2) ఎక్కడెక్కడో ఉన్న క్యుములోనింబస్ మేఘాల్ని లాక్కొచ్చి, బరస్ట్ చేయడం… మరి చైనావాడు తన సరిహద్దుల్లో ఉన్న నదుల మీద ప్రయోగాలు చేయకుండా… దేశంలో ఇంకెక్కడా ప్రయత్నించకుండా… కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులకే ఎందుకు టార్గెట్ చేసినట్టు..? ఇక్కడ జగన్, కేసీయార్ వంటి ఉద్దండులు ఉన్న నిజాన్ని విస్మరించాడా..? జిన్‌పింగ్‌కు కళ్లుమూసుకుపోయాయా..? సబ్జెక్టు నాలెడ్జి ఉండి, నిశితంగా, సహేతుక, పదునైన విమర్శలు చేయగల విపక్షాలు లేకపోవచ్చు… ప్రజలు ‘డైవర్షన్ వార్ఫేర్’కు లోనైపోవచ్చు… కేంద్రంలో పిరికి పాలకులు ఉండవచ్చు… కానీ మా ప్రాంతీయ పాలక ప్రభువులు ఇట్టే నీ కుట్రలను పసిగడతారు జిన్‌పింగ్… తిప్పికొడతారు… బహుపరాక్… హాఁ…. అంతే… నీ త్రీగార్జెస్ డ్యామ్ జాగ్రత్తరోయ్… అన్నట్టు… కొంపదీసి ఏలియెన్స్ కుట్రలు ఏమైనా గోదావరి వరదలకు కారణమా..?!!
Share this Article