గొప్పవాళ్లు కాబట్టే అలా పెళ్లీపెటాకులు లేకుండా ఉండగలిగారా..? లేక వైవాహిక బంధంలో ఇరుక్కోలేదు కాబట్టే గొప్పవాళ్లు అయ్యారా..? మరి మిగతా గొప్పవాళ్ల సంగతేమిటి..? ఒకటికాదు, ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లు కూడా గొప్పవాళ్లు అయ్యారు కదా… పోనీ, ఏ పెళ్లిబంధంలో ఇరుక్కోకపోయినా గొప్పవాళ్లు కాలేకపోయిన వారి సంగతేమిటి..? అన్నీ పిచ్చి లేపే ప్రశ్నలు కదా…… నిన్న రిలీజ్ అయిన తెలుగు కొత్త సినిమా ‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ నిర్మాత గానీ, హీరో గానీ, దర్శకుడు గానీ ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేరు… చెప్పాలనే ఉద్దేశమూ వాళ్లకు లేదు… అదొక టైంపాస్ పల్లీబఠానీ సినిమా… ఇక దాని గురించి వదిలేద్దాం… కానీ ఆ సినిమా కథలోని ఓ కంటెంటు గురించి చెప్పుకోవాలి మనం…
ఏ బాదరబందీ లేకుండా ఒంటరిగా ఉండటం..! దీన్ని జపాన్‌లో ఒహిటోరిసమ అంటారు… అదొక కల్ట్ అవుతున్నది కొన్నేళ్లుగా…! సమూహంలో బతకడం కాదు, వివాహ బంధాల్లో ఇరుక్కోవడం కాదు… జస్ట్, ఒక్కరే… ఒంటరిగా ఉండాలి, బార్ వెళ్తే ఒంటరిగా మందు… హోటల్‌కు వెళ్తే ఒక్కరే తినడం… టూర్లకు కూడా ఒక్కరే వెళ్లిపోవడం… తను, తన సంచీ, తన క్యాష్ కార్డు… అంతే… ఎక్కడో దిగాలి, దొరికింది తినాలి, తాగాలి, చూడాలి, తిరగాలి… వచ్చేయాలి… వీలయితే ఆ కొద్దిరోజులూ ఫోన్ ఆఫ్… పూర్తిగా తను, తన ప్రపంచం…
Ads
పెళ్లి వద్దు, పిల్లలు వద్దు… నిజానికి ఈ ధోరణి జపాన్ సంప్రదాయ ధోరణి కాదు… జపాన్ సంస్కృతి సమూహంలో బతకమని చెబుతుంది… కలిసి తినాలి, కలిసి తాగాలి, కలిసి ఉండాలి, కలిసి తిరగాలి… కానీ మార్పు వస్తోంది… అదుగో అందులో నుంచి పుట్టుకొచ్చిందే అ ఒహిటోరిసమ…
అంటే సోలో బ్రతుకు… ఎందుకీ ధోరణి పెరుగుతోంది..? కారణం… ఒత్తిడి… మంచి కొలువు, మంచి జీతం, మంచి సంబంధం, మంచి బతుకు, మంచి జీవనభాగస్వామి, మంచి పిల్లలు… వీటిపై సామూహిక ఒత్తిడి పెరుగుతోంది… దాన్నుంచి తప్పించుకోవడానికి ఒంటరితనం అలుముకుంటోంది… జపాన్‌లో పిల్లలు పుట్టడం చాలా తగ్గిపోయింది… ఒక్కసారి నెట్లోకి వెళ్తే ఈ పరిణామాలపై బోలెడు వార్తలు, వ్యాసాలు, సర్వేలు కనిపిస్తయ్…
బహుశా సాయిధరమ్ తేజ నటించిన సినిమాను జపాన్ భాషలోకి అనువదించి… పెళ్లి, దాని అవసరం గట్రా నీతిబోధకు ఉపయోగిస్తే బెటరేమో… హహహ… జాగ్రత్తగా గమనిస్తే జపానే కాదు… చాలా దేశాల్లోనూ ఈ ధోరణి పెరుగుతోంది… చివరకు వయస్సు పెరిగిన దశలోనూ ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడుతున్నారు… మానవ సంబంధాల్లో కృతిమత్వం పెరుగుతూ, రక్తబంధాల్లోని గాఢత కూడా పలుచబడిపోతూ… చివరకు మనుషులు ఈ కొత్త ధోరణిని ఆశ్రయిస్తున్నారు…
ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే ఉందాం, ఒంటరిగానే వెళ్లిపోదాం… మధ్యలో ఏర్పడే బంధాలు జస్ట్, ఆర్థిక, అవసరార్థం బంధాలే… అంటున్నారు లక్షల మంది… వాళ్ల దాకా వీళ్ల దాకా ఎందుకు..? కుటుంబవ్యవస్థకు చాలా పెద్దపీట వేసే మన దేశంలో కూడా ఇలాగే కదా… సింగిల్ పర్సన్స్ బాగా పెరుగుతున్నారు… సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ కాదు… సింగిల్ పర్సన్స్…
అప్పట్లో ఓ సినీకవి చెప్పాడు కదా… అనుబంధం, ఆత్మీయత అంతా బూటకం… ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అని…! ఈ కరోనా పుణ్యమాని మనిషి చుట్టూ గిరిగీసుకుని, అంటీముట్టనట్టుగా… జాగ్రత్తగా బతకడం అలవాటైంది చాలామందికి… ఒంటరిగా బతికేయగలం అనే ధీమాను కల్పించింది కరోనా… ప్రత్యేకించి సామాజిక భీమా, రక్షణ, ఆరోగ్యధీమా కల్పించే దేశాల్లో ఈ ఒంటరి బతుకులు ఎక్కువవుతున్నయ్…
1995లో 25 శాతం ఒంటరిగా నివసించే ఇళ్లు ఉంటే, ఇప్పుడవి 35 శాతానికి పెరిగాయి జపాన్‌లో… ఇంకా పెరగబోతున్నాయి… ఫలితంగా వినియోగ సంస్కృతి కూడా మారుతోంది… రెస్టారెంట్లలో ఒక్కరే కూర్చుని ఏకాంతంగా కాలం గడపడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు… హాటళ్లలో సింగిల్ బెడ్రూంలు పెరుగుతున్నయ్… ఇంటికే అవసరమైనవి డెలివరీ చేసే సర్వీసులు పెరుగుతున్నయ్… కొత్తగా కడుతున్న ఫ్లాట్లు కూడా సింగిల్ లైఫ్‌కు తగినట్టు ఉంటున్నయ్…
అయితే… మనిషి సంఘజీవి… ఒక స్పర్శ, ఒక సమూహం, ఒక ఉద్వేగం… పదిమందితో కలిస్తేనే ఆనందం రెట్టింపు అవుతుంది… విషాదం సగం అయిపోతుంది… అవసరానికి మేమున్నామనే ధీమా బతుకు మీద అంతులేని పాజిటివిటీని పెంచుతుంది… సోలో బ్రతుకు అంటే… బాదరబందీ తెంపేసుకుని, ఒంటరిపక్షిలాగా బతకడంకన్నా… ఒక తోడు ఉండటం మానసిక, శారీరక ఆరోగ్యానికే కాదు… సామాజిక స్వస్థతకు మంచిది అని బోధించేవాళ్లూ ఉన్నారు… ప్రస్తుతానికి ఆ నీతిబోధలు ఎవరికీ ఎక్కడం లేదు… రేపటి గురించి చెప్పలేం…!!
Share this Article