పార్ధసారధి పోట్లూరి ,,,,,,,,,,, సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నది ! మీరు చదువుతున్నది నిజమే ! సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యధిక దేశాలకి ముడి చమురుని ఎగుమతి చేసే సౌదీ అరేబియా రష్యా నుండి ముడి చమురుని దిగుమతి చేసుకోవడం ఏమిటీ అని అనుకుంటున్నారా ? నిజం… రష్యా నుండి సౌదీ ముడి చమురుని దిగుమతి చేసుకుంటున్నది. అయితే గత ఆర్ధిక సంవత్సరంలోనే [2020-21] సౌదీ రష్యా నుండి ముడి చమురుని దిగుమతి చేస్కున్నది. కానీ గత ఏప్రిల్ నెల నుండి జూన్ నెల మధ్యలో గత సంవత్సరం దిగుమతి చేసుకున్న దానికంటే రెండింతల చమురుని దిగుమతి చేసుకున్నట్లు రాయిటర్ వార్తా సంస్థ తెలిపింది.
సౌదీ అరేబియాలో చమురు పుష్కలంగా చమురు ఉత్పత్తి అవుతుండగా రష్యా నుండి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నట్లు..? సౌదీ తాను ఒప్పందం చేస్తుకున్న దేశాలకి చమురుని ఎగుమతి చేస్తూనే, రష్యా నుండి చమురుని దిగుమతి చేసుకోవడానికి కారణం సౌదీ లోని విద్యుత్ కేంద్రాలకి వేసవి డిమాండ్ అధికంగా ఉంటుంది, సదరు విద్యుత్ కేంద్రాలు చమురుని వాడతాయి బొగ్గుకి లేదా సహజ వాయవుకి బదులుగా… దాంతో తన ఎగుమతులు తగ్గించకుండా లేదా వాటికి ఆటంకం కలగకుండా తన దేశ విద్యుత్ అవసరాల కోసం రష్యా నుండి చమురుని దిగుమతి చేసుకొని దానిని వాడుకుంటున్నది. సౌదీలోని చాలా విద్యుత్ కేంద్రాలు సహజ వాయువు సప్లై అయ్యే కేంద్రాలకి చాలా దూరంలో ఉంటాయి. వాటికి కేవలం చమురుని వాడి విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి.
2022 ఫిబ్రవరి 24 న రష్యా ఉక్రెయిన్ మీద స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టాక అమెరికాతో పాటు నాటో దేశాలు జపాన్ కూడా రష్యా మీద కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే… కానీ సౌదీ మాత్రం అమెరికా, నాటో ఆంక్షలని లక్ష్య పెట్టకుండా ముడి చమురుని దిగుమతి చేసుకుంటూ వస్తున్నది… పైగా గత సంవత్సరం కంటే రెట్టింపు చేసింది దిగుమతులని… 6,47,000 టన్నుల చమురుని రష్యా నుండి దిగుమతి చేసుకున్నది సౌదీ అరేబియా గత ఏప్రిల్ జూన్ నెలల మధ్య… రష్యా మరియు ఎస్టోనియా రేవుల నుండి సౌదీ తన చమురు టాంక్ లని పంపి చమురు తెచ్చుకుంటున్నది. మరోవైపు ఈజిప్ట్ కూడా రష్యా నుండి రోజుకి 70 వేల బారెళ్ళ చమురుని దిగుమతి చేసుకుంటుండగా సౌదీ ఈజిప్ట్ నుండి కూడా రష్యా చమురుని కొంటున్నది. రోజుకి 1 లక్ష 10 వేల బారెళ్ళ చమురుని ఈజిప్ట్ నుండి సౌదీ కొంటున్నది…
Ads
చమురు రవాణా చేసే ఆయిల్ టాoకర్ల ఇన్స్యూరెన్స్ ద్వారా అమెరికా ఆయా ఆయిల్ టాంకర్లు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నాయో తెలుసుకుంటున్నది. తన ఆంక్షలని కాదని ఏ దేశం అన్నా రష్యా నుండి చమురుని దిగుమతి చేసుకుంటే అమెరికాకి తెలిసిపోతుంది కానీ ఈజిప్ట్, సౌదీల విషయంలో మాత్రం అమెరికా ఆంక్షలని విధించలేకపోయింది.
అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడికి జరగని అవమానం జో బిడెన్ కి జరిగింది!
గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సౌదీ అరేబియా పర్యటన కోసం సౌదీ రాజధాని రియాధ్ చేరుకున్నప్పుడు జేడ్డ విమానాశ్రయంలో జో బిడెన్ కి స్వాగత పలకడానికి సౌదీ రాజు సల్మాన్ లేదా యువ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ లు కానీ ఎయిర్ పోర్ట్ కి రాలేదు. మక్కా ప్రావిన్స్ గవర్నర్ రీమా బిన్ బందర్ జో బిడెన్ కి స్వాగతం పలకడానికి వచ్చాడు. నిజానికి అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ మొదటిసారిగా సౌదీ వచ్చాడు కానీ సాధారణ స్వాగతం, అదీ ఒక ప్రావిన్స్ గవర్నర్ ని పంపించి సౌదీ రాజు తన ఉద్దేశ్యం ఏమిటో మొదట్లోనే చెప్పేశాడు. తన రాజసౌధం దగ్గర మాత్రమే సౌదీ రాజు జో బిడెన్ కి స్వాగతం పలకడానికి బయటికి వచ్చి లోపలకి తోడ్కొని వెళ్ళాడు.
జో బిడెన్ సౌదీ పర్యటన ఉద్దేశ్యం అమెరికాకి చమురు ఎగుమతులని రెట్టింపు చేయమని అడగడానికి వచ్చాడు… అదే సమయంలో ఇజ్రాయెల్ తో దౌత్య, వాణిజ్య పరమయిన సంబంధాలని పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సౌదీ రాజుకి నచ్చ చెప్పడానికి వచ్చాడు. కానీ జో బిడెన్ మాత్రం మొదట్లోనే సందర్భం, సంబంధం లేని వ్యాఖ్యలు చేశాడు. మూడేళ్ళ క్రితం సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ అనే వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి హత్యకి కారణం సౌదీ యువరాజు అని అతని ముందే గట్టిగా ఆరోపణలు చేశాడు బిడెన్. కానీ జో బిడెన్ తన ఉద్దేశ్యాన్ని ఆ విధంగా చెప్పకుండా ఉండాల్సింది కానీ నోరు జారాడు.
ఒక అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ఉన్న వ్యక్తి మరో దేశపు రాజు ముందు వ్యక్తిగత ఆరోపణలు చేయడం దౌత్య పరంగా ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు… ఇదివరకే అమెరికన్ అధికారులు పత్రికా ప్రకటనలో సౌదీ రాజు జమాల్ ఖషోగ్గి హత్యకి కారణం అంటూ చెప్పేశారు… అది అక్కడితో ముగిసిన అధ్యాయం… కానీ తాము ఆంక్షలు విధించినా రష్యా నుండి చమురుని కొనుగోలు చేయడం మీద జో బిడెన్ తన అసహనాన్ని జమాల్ ఖషోగ్గి హత్య ఉదంతాన్ని సౌదీ రాజు ముందే ప్రస్తావించడం అనేది ఆత్మహత్యాసదృశం అనే చెప్పాలి…
అటు నాటో దేశాలతో పాటు ఇటు అమెరికాలో కూడా ఇంధనం ధరలు రెట్టింపు అయ్యాయి గత రెండు నెలలో… దీని మీద ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న తరుణంలో జో బిడెన్ ఏదో సాధిస్తాడు అని భావించిన అమెరికా ప్రజలకి తీవ్ర నిరాశ మిగిల్చాడు తన వాచాలత్వంతో ! అమెరికాకి చమురు ఎగుమతులని రెట్టింపు చేయాలి అన్న జో బిడెన్ విజ్ఞప్తిని ఏ మాత్రం లెక్క చేయలేదు సౌదీ రాజు… అసలు అమెరికాకి చమురు ఎగుమతి విషయాన్ని తన సమాధానాలలో ఎక్కడా ప్రస్తావించలేదు సౌదీ రాజు. ఇక ఇజ్రాయెల్ తో పూర్తి స్థాయి దౌత్య, వాణిజ్య సంబంధాలని మళ్ళీ కొనసాగించే విషయంలో సౌదీ ఆరేబియాకి ఎలాంటి అభ్యంతరాలు లేవు కాబట్టి దానికి జో బిడెన్ మధ్యవర్తిత్వం అవసరమే లేదు.
గతంలో డొనాల్డ్ ట్రంప్ సౌదీ పర్యటనకి వచ్చినప్పుడు రియాద్ విమానాశ్రయం లో సౌదీ మిలటరీ బాండ్ అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించింది… అలాగే సౌదీ రాజు, యువరాజుతో పాటు రియాద్ గవర్నర్లు కూడా ట్రంప్ కి స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వచ్చారు. ట్రంప్ తన పర్యటన ముగిసే రోజున సౌదీ రాజ కుటుంబం నుంచి ట్రంప్ తో పాటు అతని అధికారులకి విలువయిన కానుకల్ని ఇప్పించాడు. కానీ రెండేళ్లలో ఎంత మార్పు ? అమెరికా ఆంక్షలని లెక్క చేయకుండా సౌదీ రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఒక ఎత్తయితే అమెరికా అధ్యక్షుడుకి ఒక రాష్ట్ర గవర్నర్ చేత స్వాగతం చెప్పించాడు సౌదీ రాజు…
So, అమెరికా తన మునుపటి ప్రాభవాన్ని కోల్పోతున్నది అన్నదానికి జో బిడెన్ సౌదీ పర్యటన ఒక ఉదాహరణ ! ఇక ఇప్పటికే నాటో దేశాలలో అమెరికా వ్యూహకర్తల మీద అసహనం రోజురోజుకీ పెరిగిపోతున్నది. ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా రష్యా మీద ఏక పక్షంగా ఆంక్షలని విధించి తమ దేశాలలో ఇంధనం ధరల పెరుగుదలకి మరియు కొరతకి కారణం అయిన జో బిడెన్ అధికారగణం మీద తీవ్ర అసహనంగా ఉన్నాయి నాటో దేశాలు. ఇంతా చేస్తే రష్యన్ రూబుల్ ధర మునుపటిలాగే ఉంది! నాటో దేశాల వాటాని సౌదీ, ఈజిప్ట్, భారత్ లు భర్తీ చేస్తున్నాయి. రష్యా చైనాలని కట్టడి చేయగల సత్తా అమెరికాకి లేదని గ్రహించే జపాన్ మాజీ ప్రధాని షింజో అబే తమ దేశాన్ని అమెరికా మీద ఆధారపడకుండా ఉండాలి అనే ఆలోచన చేశాడు! జో బిడెన్ అధ్యక్షుడిగా ఉండాలా వద్దా అనేది అమెరికన్ ప్రజలు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది అమెరికాకి..!
Share this Article