కేసీయార్ తెలివైనోడు… ఏదో ఎత్తుగడ లేనిదే ఏమీ మాట్లాడడు… గోదావరకి భారీ వరదలు అనేవి విదేశీకుట్ర, క్లౌడ్ బరస్ట్ అని చెబుతున్నాడు… స్టడీ చేస్తున్నామన్నాడు… గతంలో లేహ్, లడఖ్ ప్రాంతాల్లో ఈ ఉదాహరణలు ఉన్నాయన్నాడు… అంటే ఏమిటి..? ఏమీలేదు… ప్రఖ్యాత సాగునీటి ఇంజనీర్ కదా, తను వార్ ఎక్స్‌పర్ట్ కూడా… పైగా వెదర్ వార్ మీద, బయలాజికల్ వార్‌ఫేర్ మీద కూడా మంచి నాలెడ్జి ఉన్నవాడు… సో, అన్నీ తెలిసే ఉంటాయి… ఇదే అనుకుంటున్నారు మీరు కూడా… కానీ సోషల్ మీడియా వేరేరకంగా అనుకుంటోంది…
చంద్రబాబు, జగన్, కేసీయార్… కుర్చీ మీద పాలకుడు ఎవరైనా గానీ, రాష్ట్రం ఏదైనా గానీ…. కేంద్రాన్ని ఆదానీ శాసిస్తున్నట్టు మేఘా కృష్ణారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల కంట్రాక్టు పనుల్ని, ప్రభుత్వాల్ని శాసిస్తున్నాడు… నిర్దేశిస్తున్నాడు… ఇప్పుడు విదేశీ కుట్ర అని కేసీయార్ గోదావరి వరదల మీద ముద్ర వేయడం కూడా మేఘాను గట్టెక్కించడానికే అనే చర్చ నడుస్తోంది… ఆ పదం విలువ కొన్ని వందల కోట్లు అట…
టెక్నికల్‌గా ఆ చర్చలోకి వెళ్తే… అసలు కాళేశ్వరం డిజైన్లలో భారీలోపాలున్నాయి… బ్యారేజీ స్థలాల ఎంపికలే లోపభూయిష్టం అనే చర్చ చాన్నాళ్లుగా నడుస్తూనే ఉంది… భారీ అవినీతి అని కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలే తప్ప ఎప్పుడూ టెక్నికల్‌గా కౌంటర్ చేసిందీ లేదు… ఏ కోర్టులోనో విచారణకు నిలబెట్టిందీ లేదు… దర్యాప్తుల జాడ కూడా లేదు… ఉండదు… అఫ్‌కోర్స్, ఇక్కడ ఎంత తన్నుకున్నా ఢిల్లీలో మోడీ, షా కేసీయార్‌కు రహస్య స్నేహితులే అనే గుసగుస కూడా ఉందిగా…
Ads
పంపుహౌజులు మునిగిన ప్రాంతాల్లో ఇప్పుడు వచ్చిన వరద 26 లక్షల క్యూసెక్కులు… మరి 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది… అంటే ఇప్పటి వరదల్ని అనూహ్యమనో, అసాధారణమనో ముద్ర వేయటానికి లేదు… గరిష్ట వరదను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా పంపుహౌజుల నిర్మాణ స్థలాల్ని, బ్యారేజీల నిర్మాణ స్థలాల్ని ఎంపిక చేశారని లెక్క… అంటే డిజైన్ల లోపాలు… నిజానికి సీడబ్ల్యూసీ అంచనా ప్రకారం గోదావరిలో గరిష్ట సంభావ్య వరద 50 లక్షల క్యూసెక్కులు…
1986లో ఈ పంపు హౌజుల లోకేషన్‌లో 107.5 మీటర్ల దాకా వరద రాగా, మరి 105 మీటర్లకే ఎందుకు కాళేశ్వరం పంపు హౌజులను పరిమితం చేశారు..? కాంక్రీట్ సేఫ్టీ వాల్స్ కూడా ఎందుకు కొట్టుకుపోయాయి..? సాధారణ వరదల్లోనూ బ్యాక్ వాటర్ ఎదురుతన్ని, వరద తీవ్రత ఎక్కువగా ఉండే అఫ్లక్స్ ఎఫెక్ట్‌ను అసలు ఏ ఇంజనీరైనా పరిగణనలోకి తీసుకున్నాడా..? లక్ష కోట్ల ప్రాజెక్టు మీద, తెలంగాణ జీవనప్రదాయినిగా ముద్రవేసిన ప్రాజెక్టు మీద ఇంత నిర్లక్ష్యమా..?
ఇప్పుడు మరో పదం చర్చలోకి వచ్చింది… ఫోర్స్ మెజూర్… నష్టం జరగడానికి కాంట్రాక్టరుకు సంబంధం లేని ఘటనలను “ఫోర్స్ మెజూర్ ఘటనలు” (Force Majeure Events) అంటారు. తీవ్రమైన వరదలు, భూకంపాలు, తుఫానులు, టెర్రరిస్ట్ చర్యలు, యుద్దాలు మొదలైనవి ఫోర్స్ మెజూర్ ఘటనల కిందికి వస్తాయి. ఈ కారణాల వల్ల కాంట్రాక్టరు కట్టిన నిర్మాణాలకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే, దానికి కాంట్రాక్టరు బాధ్యుడు కాదు. ఆ నష్టాన్ని కాంట్రాక్టరు భరించడు… సో, ఒకసారి విపత్తు అనీ, విదేశీ కుట్ర అనీ ముద్ర వేస్తే మేఘాను గట్టెక్కించినట్టేనని కేసీయార్ భావన అనేది సోషల్ మీడియా విమర్శ…
ఒకసారి బాస్ ఈమాటన్నాక ఇక వ్యతిరేకంగా ఎవరూ రిపోర్ట్ ఇవ్వరు… కథ ఒడిశింది… పోనీ, ఎవరైనా ఏ సుప్రీంకోర్టు దాకా వెళ్తే మంచి చర్చ జరుగుతుంది అనుకుంటున్నారా..? పోయేవాళ్లెవరు..? అందరూ మీడియా వేదికల మీద తన్నుకునే వాళ్లే తప్ప కాంక్రీట్ కౌంటర్ల జోలికి పోయేదెవరు..? పోనీ, దేశంలోకెల్లా అతిపెద్ద లిటిగెంట్ సుబ్రహ్మణ్యస్వామి బెటర్ అంటారా..? ఫాఫం, ఆయన కూడా జగన్ ఫోల్డ్‌లోనే ఉన్నాడు, టీటీడీ- ఆంధ్రజ్యోతి కేసు వేశాడు కదా… జగన్ ఫోల్డ్ అంటే మేఘా… మేఘా అంటే కేసీయార్… ఖేల్ ఖతం… అఫ్‌కోర్స్, మేఘాకు కేంద్రంలోనూ ‘‘మాంచి సంబంధాలు’’ ఉన్నాయి కదా ఇప్పుడు… అసలే అది కార్పొరేటు కంట్రాక్టు కంపెనీల ప్రియమైన సర్కారు మరి…!!
Share this Article