ఎంతసేపూ మల్లారెడ్డి మీద పడి ఏడుస్తారు గానీ… ఓ వింత సక్సెస్ స్టోరీకి తను హీరో అని గుర్తించరెందుకో..? చదువురాని వాడినని దిగులు చెందకుండా… ఒక తక్షశిల వంటి ఘన విద్యాశ్రమాన్ని నిర్మించి… ఏటా వేల మంది చెక్కీ చెక్కీ, సమాజం మీదకు వదులుతున్న ఓ నిస్వార్థ సమాజసేవకుడిపై నిందలు వేయడం కరెక్టేనా..? అసలు ఆయన మూడు ఆశ్రమాలకు వెళ్తే… ఏ ఆశ్రమంలో ఏం బోధిస్తారో తనకే అర్థం కాదు… అంత పెద్ద క్యాంపసులు, అన్ని వేల మంది విద్యార్థులు…
ఏదో న్యాక్ అట… మల్లారెడ్డి కాలేజీపై అయిదేళ్లు బహిష్కరణ పెట్టేసిందట, ఏ గ్రేడ్ ఇవ్వడానికి తిరస్కరించిందట… అరె, ఆఫ్టరాల్ న్యూస్ అది… ఆయన తెల్లటి చొక్కా మీద కనిపించని ఓ ఇంకు మరక… అంతే… ఎందుకో తెలుసా..?
Ads
ఆయనకున్న అనేకానేక కాలేజీల్లో వీళ్లు బ్యాన్ పెట్టిన కాలేజీ ఏమిటో… నిజానికి మల్లారెడ్డే గుర్తుపట్టడు… మీకు తెలుసా..? ఆయనకున్న మైసమ్మగడ్డ, ధూలపల్లి, కొంపల్లి క్యాంపసుల్లో ఏయే కాలేజీలున్నాయో… అరె, అదొక యూనివర్శిటీ బాస్… 50 గ్రాడ్యుయేట్ కోర్సులు, పీజీ కోర్సులు బోధిస్తుంటారు… 30 వేల మంది పిల్లలు, రెండు వేల మంది బోధకులు… ఫార్మసీ, మేనేజ్మెంటు, ఇంజనీరింగు, మెడికల్, డెంటల్ వాట్ నాట్… దేనికి గిరాకీ ఉంటే ఆ కాలేజీ తెల్లారేసరికల్లా నెలకొల్పగల అద్భుత సామర్థ్యం ఆయన సొంతం…
- Malla Reddy College of Engineering & Technology
- Malla Reddy Institute of Technology & Science
- Malla Reddy College of Engineering
- Malla Reddy Institute of Engineering and Technology
- Malla Reddy Institute of Technology
- Malla Reddy Engineering College for Women
- Malla Reddy College of Engineering for Women
- Malla Reddy Institute of Management
- Malla Reddy College of Pharmacy
- Malla Reddy Institute of Pharmaceutical Sciences
- Malla Reddy Pharmacy College
- Malla Reddy Institute of Medical Sciences
- Malla Reddy Medical College for Women
- Malla Reddy Institute of Dental Sciences
- Malla Reddy Dental College for Women
అసలు ఆయన ఈ కాలేజీలకు పర్మిషన్లు తెచ్చుకునేటప్పుడు ఎందరిని ఎన్నిరకాలుగా సంతృప్తిపరిచాడో తెలుసా మీకు..? ఎంత ఖర్చు పెట్టి ఉంటాడో తెలుసా..? ఇప్పుడు ఆయన మీద పడి ఏడుస్తున్నారు..? టీఆర్ఎస్లో ఆయన పోస్టులు, పొజిషన్లు కూడా పుణ్యానికి వచ్చాయా..? మల్లారెడ్డి ఏదీ పుణ్యానికి తీసుకోడు…! సో, ఆయన బండారం బద్ధలైంది, టీఆర్ఎస్ ఏం చర్య తీసుకుంటుంది అనే ప్రశ్నలకు ఏమాత్రం విలువ లేదని గమనించగలరు…
ఏ కాలేజీ ప్లాన్ ఏమిచ్చాడో, గ్యారంటీ డీడీలను ఎలా మాయచేసేవాడో, ఎఐసీటీఈ, ఎంసీఐ తదితర ఉన్నతాధికారులను ఎలా బోల్తా కొట్టించేవాడో హైదరాబాద్ అకడమిక్ సర్కిళ్లలో కథలుకథలుగా చెప్పుకుంటారు… అదంతా ఆయన గారి సక్సెస్ స్టోరీ… మేనేజ్మెంట్ కెపాసిటీ… కాలేజీలో ఫంక్షన్ పెట్టి, బాగా డబ్బులున్న అత్తామామల్ని చూసుకుని పట్టేయండోయ్ అని పిలుపునిచ్చిన ఏకైక విద్యావేత్త సారు గారు…
ప్రాక్టికాలిటీకి నిలువెత్తు రూపం సారు… ఎవడో ‘న్యాక్’ లేని న్యాక్ వాడు ఏదో నిర్ణయం తీసుకున్నాడని ఇన్నేసి మాటలంటారా..? ఛస్, గొప్పవాళ్లను ఈ దుష్ట సమాజం ఎప్పుడు గుర్తించింది కనుక..!! ప్చ్, ఆయనే గనుక ఈ తొక్కలో విద్యారంగంలోకి రాకుండా… ఏ ప్రైవేటు బ్యాంకింగ్ వైపో వెళ్లి ఉంటే ఈపాటికి… నాసామిరంగా… ఐనా లేటయితేనేమిటీ అంటారా..? అంతే… సార్, మీరు ఈ పత్రికల రాతలు గట్రా పట్టించుకోకండి, మన తదుపరి ప్రణాళికల వైపు వెళ్లిపోదాం… ఒక చైతన్య, ఒక నారాయణ, ఒక మల్లారెడ్డి…. పాతకాలంలో ఒక తక్షశిల… ఒక నలంద… దట్సాల్… అవసరమైతే మనమే ఓ ‘ప్రైవేటు న్యాక్’ పెట్టి మనమే అందరికీ గ్రేడులిద్దాం…
Share this Article