దృశ్యం-2 సినిమా కావచ్చు… ఒకడిని నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ పునాదుల్లోనే పూడ్చేస్తాడు… తరువాత ఎప్పటికైనా బయటపడే ప్రమాదముందని గ్రహించి, ఓ స్మశానంలో అలాంటి ఒడ్డూపొడవు ఉన్న శవం ఎముకల్ని సేకరించి భద్రపరుస్తాడు… నిజంగానే తదుపరి దర్యాప్తులో ఒరిజినల్ శవం తాలూకు ఎముకలు తవ్వకాల్లో బయటపడతాయి… డీఎన్ఏ పరీక్షల కోసం ఓ మెడికల్ కాలేజీ మార్చురీకి వస్తాయి… అక్కడ సెక్యూరిటీని తన మనిషిగా చేసుకున్న హీరో ఓ రాత్రి వాడికి తప్పతాగించి, ఆ ఎముకల శాంపిల్‌ను తారుమారు చేస్తాడు…
అచ్చు అలాంటిదేమీ కాదు… కానీ కేరళకు చెందిన ఓ మంత్రిగారి కేసు ఇప్పుడు తాజాగా మళ్లీ చర్చల్లోకి, వార్తల్లోకి వచ్చింది… అది చదువుతుంటే దృశ్యం సినిమాలోని ఈ ఎపిసోడే గుర్తొచ్చింది… సినిమాటిక్ నేరగాథలు చదవడానికి ఆసక్తిగానే ఉంటాయి… పెద్ద పెద్ద లాయర్లు, భారీ ఫీజులు, ఏళ్ల కొద్దీ విచారణలు, కోర్టు ఖర్చులు, తిప్పట, ప్రయాస, పోలీసుల వేధింపులు… బయటపడటానికి నేరస్థులు చేసే ప్రయత్నాలు ఇంట్రస్టింగు… అయితే ఇది 32 సంవత్సరాల పాత కేసు… కానీ నేరస్థుడు మాత్రం ప్రస్తుతం మంత్రి… కేరళ రవాణా మంత్రి… పేరు ఆంటోనీ రాజు… అడ్వొకేట్ ఆంటోనీ రాజు అంటుంటారు…
Ads
అధికారంలో మంత్రిగా ఉన్నాడు గానీ లెఫ్ట్ పార్టీ కాదు… జనాధిపత్య కేరళ కాంగ్రెస్… ఆ పార్టీ దేశంలోకెల్లా గెలిచింది ఒకే ఒక అసెంబ్లీ సీటు… తిరువనంతపురం… ఇలాంటి చిన్నాచితకా పార్టీలు దేశంలో బోలెడు… అందులో ఇదొకటి… అధికార లెఫ్ట్ ఫ్రంట్‌లో ఇదీ ఉంది… నిజానికి గతంలో కేరళ కాంగ్రెస్ (ఎం) నుంచి పలువురు నాయకులు విడిపోయి ఈ దుకాణం పెట్టుకున్నారు… కేసీ(జే) అనడిగితే ఎన్నికల సంఘం కుదరదని చెప్పి ఇలా జేకేసీ అని ఖరారు చేసింది… ఒకడే ఆ పార్టీకి ఎమ్మెల్యే… ఆ ఒక్కడూ మంత్రి… సూపర్…
సరే, సాక్షాత్తూ ముఖ్యమంత్రే బంగారం స్మగ్లింగ్ కేసులో విమర్శల్ని ఎదుర్కుంటున్నాడు… మంత్రి అనగానెంత అంటారా..? అవును, ఇదీ స్మగ్లింగ్ బాపత్ కేసే… 1990లో… ఆండ్రూ సర్వెల్లి అనే ఆస్ట్రేలియన్ జాతీయుడు తన అండర్‌వేర్‌లో హషీష్‌తో పట్టుబడ్డాడు… పోలీసులు కేసు పెట్టారు… అప్పట్లో సెలిన్ విల్‌ఫ్రెడ్ అనే లాయర్ దగ్గర జూనియర్ లాయర్‌గా ఉండేవాడు… ఈ నిందితుడి తరఫున కోర్టుకు హాజరైంది కూడా ఆంటోనీయే… అసలు పోలీసులు సమర్పించిన ఆ డర్టీ డార్క్ బ్లూ అండర్ వేర్ అసలు నిందితుడిది కాదని, అసలు అంత చిన్న అండర్ వేర్ తనకు ఎలా ఫిట్టవుతుందనీ, ఇదంతా ఓ తప్పుడు కేసనీ వాదించాడు… తీరా పరిశీలిస్తే నిజమే… దాంతో సదరు ఆస్ట్రేలియన్ స్మగ్లర్‌ను వదిలేసింది కోర్టు…
కానీ దర్యాప్తు అధికారి జయమోహన్ వదలదలుచుకోలేదు… సాక్ష్యాలను తారుమారు చేశారనే 1994లోనే ఓ కేసు పెట్టి, కోర్టుకు వెళ్లాడు… 2006లో ఈ కేసులో చార్జిషీటు కూడా వేశారు… అప్పుడు పెద్ద చర్చ జరిగింది… అందులో సారాంశం ఏమిటంటే… ఈ ఆంటోనీ రాజు కోర్టు రూం ఇన్‌చార్జిగా వ్యవహరించే జోస్ అనే ఓ క్లర్కుకు లంచమిచ్చి, ఆ ఒరిజినల్ అండర్ వేర్ సైజు కుదించి, మళ్లీ కోర్ట్ రూంలో ఎప్పటిలాగే పెట్టి చేతులు దులుపుకున్నాడు… ఈ చిన్న పనితో కేసు గెలిచాడు… మరోవైపు ఇంకో పరిణామం జరిగిపోయింది…
ఈ కేసులో విడుదలయ్యాక సర్వెల్లి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు… ఓ హత్య కేసులో అరెస్టయ్యాడు… వాడి సహనిందితుడి పేరు పాల్… పోలీసులు ప్రశ్నిస్తుంటే, ఈ పాత కథ కూడా చెప్పుకొచ్చాడు వాడు… సర్వెల్లి జైలులో ఉన్నప్పుడు తన బంధువులు ఇండియా వెళ్లి, ఎలా కేసును ప్రభావితం చేశారో వివరించాడు… ఆ వివరాలన్నీ ఆస్ట్రేలియన్ నేషనల్ సెంట్రల్ బ్యూరో ఇండియాకు 1996లోనే పంపించింది… ఆంటోనీ బెయిల్ మీద ఉన్నాడు… ఆ కేసు ఎటూ కదలడం లేదు… గత ఎన్నికల ముందు అఫిడవిట్‌లో కేసు వివరాలు పేర్కొన్నాడు కూడా..!! తాజాగా ఒకాయన ఈ పెండింగ్ కేసు ఫాస్ట్ ట్రాక్‌లో విచారించాలని హైకోర్టుకు వెళ్లాడు… కోర్టు సానుకూలంగా స్పందించింది… ఇలా ఆ 32 ఏళ్లనాటి కేసు తెరమీదకొచ్చింది…!!
Share this Article