ఒక్కటే సూత్రం…. రాజకీయాల్లో ఇలా జరగాలని ఏదీ ఉండదు… ఇలా జరగొద్దని అసలే ఉండదు… సబ్ చల్తా… బయటికి కనిపించే సీన్లు వేరు… తెర వెనుక జరిగేవి వేరు… తెల్లారిలేస్తే మోడీ, మమత డిష్యూం డిష్యూం… రెండు పార్టీలు తన్నుకుంటాయి… కార్యకర్తలు ఒకరినొకరు నరికేసుకుంటారు… వందల మంది కార్యకర్తలు కుటుంబాలతో సహా అస్సోం పారిపోతారు… కానీ ఏ సందర్భం వస్తే… మోడీ భాయ్, మమత బెహన్… అంతే…
మొన్నామధ్య అస్సోం సీఎం సమక్షంలో మమత తన గవర్నర్‌తో భేటీ అయిన దృశ్యం చూశాం కదా…. అదేమిటి..? ఎక్కడో డార్జిలింగులో వీళ్లు భేటీ వేయడం ఏమిటి అనుకున్నాం కదా… ‘ముచ్చట’ ఆ సందేహాలపై ఓ కథనం ఇస్తూ రెండు పార్టీల నడుమ ఏదో రహస్య అవగాహన ఉందని చెప్పింది… లేకపోతే బెంగాల్ గవర్నర్, మమత, అనగా ఉప్పూనిప్పూ కలిసి చాయ్ తాగడమేమిటి..?
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక మీద, తదుపరి కాంగ్రెస్‌కు తొక్కేసే ఆపరేషన్ మీద బీజేపీ, టీఎంసీ నడుమ రహస్య అవగాహన నడుస్తోంది… మమతకు పెద్దగా సైద్ధాంతిక నిబద్ధతలు ఏమీ ఉండవు… ఎహె, ఆమెకు అసలు సిద్ధాంతాలంటేనే పడదు… రేప్పొద్దున అవకాశమొస్తే తను ప్రధాని కావాలి… బీజేపీ గాకుండా విపక్షాలు గనుక మంచి సీట్లు సాధిస్తే ప్రధాని కుర్చీ వైపు రాహుల్ కన్నా ముందు తనే పరుగు తీసే స్థితిలో ఉండాలి… సో, మోడీ ఆలోచించే కాంగ్రెస్ ముక్త భారత్‌కు సపోర్ట్ చేయాలి… అదీ కథ…
Ads
ఎవరి స్వార్థం వాళ్లది… మమత ఆశలు చూసి బీజేపీ నవ్వుకోవచ్చుగాక… కానీ ఆమె భ్రమల్లో ఆమెను ఉంచాలి… అది బీజేపీ స్ట్రాటజీ… కొందరు మాట్లాడితే బీజేపీతో వీరావేశంతో ఫైట్ చేస్తున్నట్టు బయటికి కనిపిస్తారు… కానీ లోలోపల మోడీషా రహస్య స్నేహితులు అన్నమాట… సో, ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో విపక్షాలు తమను విశ్వాసంలోకి, పరిగణనలోకి తీసుకోలేదనే సాకుతో మమత ఎహెఫో, తొక్కలో విపక్ష ఐక్యత అనేసింది…
కానీ బీజేపీ అభ్యర్థికి బాహటంగా మద్దతివ్వలేదు… రాజకీయం… అందుకని వోటింగుకు దూరం ఉంటామని ప్రకటించింది… ఇంకేముంది..? సచ్చింది గొర్రె… శరద్ పవార్ ఎవరెవరినో కూర్చోబెట్టి మార్గరెట్ అల్వా అభ్యర్థిత్వం ప్రకటించాడు కదా… అది యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వంకన్నా అట్టర్ ఫ్లాప్ కాబోతుందని లెక్క… మార్గరెట్ మీద కాంగ్రెస్‌కు, ప్రత్యేకించి సోనియాకు ప్రేమ ఏమీ ఉండదు… వాళ్లకు పడదు… ఎలాగూ నవీన్ పట్నాయక్ తదితరులు మళ్లీ బీజేపీ అభ్యర్థికే జై అంటారు…
ఆప్ సరేసరి… మార్గరెట్ అభ్యర్థిత్వం ఎంపిక భేటీకి డుమ్మా కొట్టేసింది… వెరసి యశ్వంత్ సిన్హాలాగే మార్గరెట్‌ను కూడా ఘోరంగా ఓడిపోయే ప్రణాళికను బీజేపీ అమలు పరుస్తోంది… అందులో మొదటి సూచిక మమత వోటింగుకు దూరంగా ఉంటామనే ప్రకటన…! ఢిల్లీ సర్కిళ్ల ప్రచారం మేరకు మొన్న మంత్రిపదవికి రాజీనామా చేసిన ముక్తార్ నక్వీని బెంగాల్ గవర్నర్‌గా వేస్తారట… మమతకు హేపీ కదా… నక్వీ మెచ్యూర్డ్ పర్సన్… హుందాగా ఉంటుంది తన వ్యవహారశైలి… ష్… రాబోయే సాధారణ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, బీజేపీ అభ్యర్థుల ఎంపిక చాలా ప్రణాళికబద్ధంగా జరగబోతోంది… లోగుట్టు మోడీషాకు ఎరుక… అదీ సంగతి…!!
మమతక్కాయ్… ఈసారి ఇంకా మోడీ భయ్యాకు డ్రెస్సులు, బెంగాలీ స్వీట్లు పంపించలేదట… సోదర ప్రేమలో తేడా రానివ్వొద్దు… పంపించెయ్, సారు ఎదురుచూస్తున్నాడు…!!
Share this Article