వర్గ కసి… ఈ పదం చాలామందికి అర్థం కాదు… నక్సలైట్ల నిర్మూలనకు ఫేక్ ఎన్‌కౌంటర్లను మొదలుపెట్టి, దూకుడుగా కొనసాగించిన జలగం వెంగళరావు మామూలు మరణానికి గురైనప్పుడు పీపుల్స్‌వార్ బాగా బాధపడింది… అదీ వర్గ కసి లక్షణం… ఏ జాతికైనా, ఏ దేశానికైనా, ఎవరికైనా వర్తించేది వర్గ కసి అనే పదం… అది ఫీలయ్యేవాడికే అర్థమవుతుంది ఆ పదం అసలు అర్థమేమిటో…
సేమ్… ఇజ్రాయిలీ గూఢచార సంస్థ మోసాద్ గురించి చెప్పాలి… తమ దేశానికి, తమ జాతికి నష్టం చేకూర్చిన ప్రతి ఒక్కరినీ వెంటాడి వేటాడి మరీ చంపేస్తుంది ఈ సంస్థ… ఏళ్ల తరబడీ ప్లాన్ చేసి, నిరీక్షించి మరీ ఖతం చేస్తుంది… అదీ వర్గ కసి… అది తప్పా ఒప్పా, ఫెయిలా, సక్సెసా అనే పదాల సంగతి తరువాత… కానీ మనుగడ కోసం ఓ జాతికి ఉండాల్సిన లక్షణం అది… అది అలా ఉంది కాబట్టే యూదు జాతి బతికి ఉంది…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే…? ఓ సీఐఏ ఆపరేషన్స్ డైరెక్టర్ చెప్పినట్టుగా వెలువడిన ఓ పుస్తకం… దాని పేరు ‘‘కన్వర్వేజన్స్ విత్ క్రవ్’’… అంటే కాకితో సంభాషణ… అదొక కవి హృదయం… దాన్నలా వదిలేయండి… ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకుని అత్యంత నీచమైన, దారుణ ఆపరేషన్లకు పూనుకునేది అమెరికన్ గూఢచార సంస్థ సీఐఏ… ఇండియాతో ఇప్పుడు దానికి అవసరం కాబట్టి ప్రేమను నటిస్తోంది… కానీ అది ఎప్పుడూ ఇండియాకు వ్యతిరేకమే… ఇండియాకు సంబంధించి మోస్ట్ అన్‌వాంటెడ్ ఎలిమెంట్ అది…
Ads
సదరు మాజీ సీఐఏ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ రాబర్ట్ క్రౌలే చెప్పినట్టుగా గ్రెగరీ డగ్లస్ రాసిన ఓ పుస్తకం ఇప్పుడు చర్చనీయాంశం… మేం భారత అణుపితామహుడు హోమీ జహంగీర్ బాబాను హతమార్చాం, భారత అణుకార్యక్రమానికి సపోర్ట్ చేసిన లాల్ బహదూర్ శాస్త్రిని ఖతం చేశాం అంటున్నాడు సదరు సీఐఏ మాజీ అధికారి… అంతేకాదు, ఆసియాలో ప్రధానపంట వరిని దెబ్బతీసి, పూర్తిగా పాశ్చాత్యదేశాల మీద ఆధారపడే బానిస బతుకులకు ప్లాన్ చేశాం అని కూడా అంటున్నాడు…
నిజమో, కాదో…. అమెరికన్ రచయితలకు అలవాటైన కాన్స్పిరసీ కథనాలేమో తెలియదు… అత్యంత కీలకమైన సీఐఏ మాజీ అధికార్లు రిటైరైనా సరే దేశ ఆంతరంగిక విషయాల్ని వెల్లడించడాన్ని ఆయా దేశాలు అంగీకరిస్తాయా..? ఆమోదయోగ్యమేనా..? జవాబుల్లేని ఈ కీలక ప్రశ్నలు వదిలేస్తే… సదరు అధికారి చెప్పినవి నిజమే అనుకుందాం డిబేట్‌కు… ఎందుకంటే… సీఐఏ నీచ చరిత్రే అది గనుక…
ఎస్, హోమీ బాబా మరణం యాదృచ్ఛికం కాదని ప్రతి భారతీయుడు అనుకుంటున్నదే… అలాగే శాస్త్రి మరణం కూడా సహజమరణం కాదని కూడా సగటు భారతీయుడు సందేహిస్తున్న సంగతి తెలిసిందే… మేం వాళ్లను చంపాం, వీళ్లను చంపాం అని సదరు సంస్థ మాజీ అధికార్లు ఏవేవో రాస్తుంటారు, మనవాళ్లు మన భాషల్లోకి అనువదించుకుని ఆనందిస్తారు సరే… వాటిల్లో నిజానిజాలు ఎవడికీ తెలియదు సరే, అప్పుడంటే ఇండియా ఓ పేద దేశం, అగ్రదేశాల ఆగ్రహాలకు భయపడే దేశం… కానీ ఇప్పుడెందుకు బాబా, శాస్త్రి మరణాల మీద స్పందించలేకపోతోంది… అంతెందుకు, బీజేపీకి నెహ్రూ అంటే తీవ్ర ద్వేషం కదా… నేతాజీ మరణం మీద రహస్య ఫైల్స్ ఎందుకు బహిర్గతం చేయరు…? కారణం… వర్గ కసి లేకపోవడం…!!
అప్పట్లో ఈ రహస్యం తెలిసీ రష్యా ఎందుకు నోరు మూసుకుంది..? ఆఫ్టరాల్ ఇండియా ప్రధాని, మనదేం పోయిందిలే అనుకునే స్థితి కాదప్పుడు… ప్రతి దశలో రష్యా మనకు అండదండగా ఉన్న కాలం అది… తన గడ్డ మీదకు వచ్చి ఆపరేషన్ చేస్తుంటే కేజీబీ ఎందుకు ఊరుకుంది..? ఇది అన్నింటికన్నా పెద్ద ప్రశ్న…
వోకే… ది గ్రేట్ ఇండియన్ జేమ్స్‌బాండ్ అని పిలవబడే అజిత్ దోవల్‌కు ఈరోజుకూ ఒక ఆఫ్టరాల్ ముట్లుడిన ముసలి అనారోగ్య దావూద్ ఇబ్రహీం హత్య ఎందుకు చేతకావడం లేదు..? వర్గ కసి లేదా..? చేత కాలేదా..? కాదా..? జాతి ఆత్మను సంతృప్తిపరిచే ‘‘రహస్య ఆపరేషన్లు’’ కూడా దోవల్‌కు చేతకావడం లేదా..? శక్తియుక్తులు ఉడిగాయా..? ఈరోజుకూ శాస్త్రి మరణం తాలూకు తాష్కెంట్ ఫైల్స్ ఎందుకు రహస్యం..?
తమ ప్రధాని మరణాన్ని కూడా ఈ జాతి ఎందుకంత నిర్లిప్తంగా తీసుకుంది..? ఓ దరిద్రపు కాంగ్రెస్ అనబడే పార్టీని, దాని పాలనను వదిలేయండి…. (ఈ దేశ ఉపరాష్ట్రపతి తను ఓ అరబ్ కంట్రీ రాయబారిగా ఉన్నప్పుడు మన గూఢచార సంస్థ మూలాల్ని పెకిలించే కుట్ర చేశాడు, ‘రా’ మాజీ అధికార్లు నెత్తీనోరూ కొట్టుకున్నారు… ఈరోజుకూ సదరు నాయకుడు కాంగ్రెస్ కీర్తికిరీటం…) మరి ది గ్రేట్ జాతీయతావాదం అని గొప్పలు చెప్పుకుంటూ, జబ్బలు చరుచుకుంటూ బతికే బీజేపీ ప్రభుత్వం సాధించిందేముంది..? కేబినెట్ సెక్రెటరీ స్థాయి హోదాను, అధికారాల్ని అనుభవించే అజిత్ దోవల్ సాధించి, చూపించిన ఒక్క ‘‘ఆత్మసంతృప్తి ఆపరేషన్’’ ఒక్కటైనా ఉందా..? అసలు ఆ మనిషికి వర్గకసి అంటే తెలుసా..?! ఈ పుస్తకంలో ప్రధానలోపం వరిని తుడిచిపెట్టేయడం… ఏ దేశమైనా మరో దేశాన్ని హస్తగతం చేసుకుని, సంపద పెంచి మరీ దోచుకోవాలని అనుకుంటుంది… కానీ ప్రధాన జీవనాధారాన్ని కనుమరుగు చేస్తుందా..?!
Share this Article