జాతీయ అవార్డుల ప్రకటన ప్రతిసారీ ఓ ప్రహసనమే… రాష్ట్రాలు, కేంద్రం ప్రకటించే అవార్డులంటేనే అదోరకం… బోలెడు పైరవీలు, లెక్కలు, విధేయతలు మన్నూమశానం… అందుకే ఆ అవార్డులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తాయి… ఏ పైరవీలు అడ్డుపడని కేటగిరీల్లో మాత్రం ఎంపికలు బాగానే ఉంటయ్… ఉదాహరణకు అయ్యప్పనుం కోషియం సినిమాకు దక్కిన అవార్డులు… ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ అవార్డులన్నీ దానివే… సరైన ఎంపికలు కూడా…
కానీ..? ఉత్తమచిత్రం సూరారై పొట్రు సంగతికొస్తే… నో డౌట్, స్పూర్తిని కలిగించే కథ… కొంత సినిమాటిక్ మసాలా… కానీ మరీ అంత గొప్ప సినిమా ఏమీ కాదు… ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు కూడా వచ్చాయి… నిజానికి అందులోని కథానాయిక అపర్ణ బాలమురళి మెరిట్ ఉన్న నటే… కానీ ఆ సినిమాలో ఆమె పెద్దగా ఇంప్రెస్ చేసిందేమీ లేదు… స్క్రీన్ ప్లే కూడా సోసో…
తానాజీ అవార్డులపై కూడా ఇలాంటి భిన్నాభిప్రాయాలే ఉన్నాయి… నాన్-ఫీచర్ ఫిలిమ్స్‌కు సంబంధించిన కేటగిరీలు బోలెడు… వాటిపై పెద్దగా ఎవరికీ ఆసక్తి ఉండదు… కానీ ప్రభుత్వ వ్యవహారాలంటేనే అలా ఉంటయ్ కదా… సరే, ఒకసారి తెలుగు సినిమాల సంగతికొద్దాం… థమన్… అలవైకుంఠపురంలో సినిమా సంగీత దర్శకత్వానికి గాను ఆయనకు అవార్డు వచ్చింది… ఎస్, ఆ సినిమాలో పాటలన్నీ బంపర్ హిట్స్… యూట్యూబ్‌లో వాటికి వచ్చిన వ్యూస్ సంఖ్య ఎక్కడికో వెళ్లిపోయింది… వెరీ వెరీ పాపులర్ ట్యూన్స్… (ఉత్తమ బీజీఎం అవార్డు వేరేవాళ్లకు వచ్చింది…)
Ads
అసలు ఉత్తమ సంగీత దర్శకత్వం అంటే… ట్యూన్స్ పాపులర్ అయితే చాలా..? సాహిత్యమూ గట్రా అసలు పరిగణనలోకి తీసుకుంటారా..? ఎందుకంటే..? సిరివెన్నెల రాసిన సామజవరగమన పాట మీద బొచ్చెడు విమర్శలొచ్చినయ్…ప్రత్యేకించి నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు… అనే పల్లవి మీద కూడా… సామజవరగమని అని రాసి ఉండాల్సింది, సిరివెన్నెల మరీ పురుష పదాన్ని స్త్రీ పాదాల దగ్గర పెట్టేశాడనే వెటకారాలూ వినిపించాయి… సో, ఇవన్నీ పరిగణనలోకి రావా అనేది ఓ ప్రశ్న…
పాపులారిటీయే అవార్డులకు ప్రామాణికమైతే కొరియోగ్రఫీలో సంధ్యారాజుకు ఇవ్వకూడదు… ఆమె సమకూర్చిన నాట్యరీతులు సూపర్బ్… పైగా ఆమే స్వయంగా డాన్సర్… కానీ అవన్నీ శాస్త్రీయ నాట్య గతులు… సరే, ఆ డిబేట్ అలా వదిలేస్తే… ఉత్తమ తెలుగు చిత్రం కలర్ ఫోటో… ఇక్కడా అంతే… సినిమా కథ ఎంపిక బాగుంది, తీసిన తీరు బాగుంది… కానీ అది కేవలం ఓటీటీలో రిలీజైంది… అవార్డు ఇవ్వాలంటే థియేటర్లో రిలీజ్ కావాలనే ఓ నిబంధన ఉన్నట్టుంది… మరి ఈ అవార్డు..?
ఒక సినిమాకు అవార్డు వచ్చిందంటే చాలు, దానికి లింకున్న జ్యూరీ మెంబర్ ఎవరనే అన్వేషణ, ఆరాలు వెంటనే జరుగుతాయి… డిస్కషన్ సాగుతుంది… ఈ సినిమాను ఆహాలో రిలీజ్ చేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ… అందులో దర్శకుడు ఆదిత్య స్టోరీ బోర్డు హెడ్… ఆయన అవార్డుల జ్యూరీ సభ్యుడు… పైగా సినిమాకు కథను, డబ్బును పెట్టిన సాయి రాజేష్ గతంలో ఆదిత్య సహాయకుడిగా పనిచేశాడు… చాలా క్లోజ్… ఐనంతమాత్రాన అవార్డులు ఇచ్చేస్తారా అనేది కాదు ప్రశ్న… అవార్డులకూ, జ్యూరీ సభ్యులకూ లింకుల మీద డిబేట్లు జరుగుతాయి అని చెప్పుకోవడం ఇది…
‘ఉత్తమ’ అనే అవార్డుకు ప్రామాణికం పాపులారిటీ కాదు… ఒక ప్రత్యేకత, ఒక విశిష్ట తపన, ఒక ప్రతిభాపూర్వక ప్రయత్నం, ఒక ప్రశంసార్హమైన ప్రయోగం… ఇలా రకరకాల అంశాలు పరిగణనలోకి రావాలి… ఐనా ఇలాంటి పెదవివిరుపులు, చర్చలు ప్రతిసారీ జరుగుతూనే ఉంటయ్… సదరు మంత్రిత్వ శాఖ, ఆ జ్యూరీలు మరింతగా ‘‘బభ్రాజమానం, భజగోవిందం’’ అన్నట్టుగా కూరుకుపోతూనే ఉంటాయి…!!
Share this Article